ఎంత సుదీర్ఘ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. చీటూరు నిర్మల పాటల ప్రస్థానం కూడా అలా మొదలైందే! కమ్యూనిస్టు భావజాలం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నిర్మల చిన్నప్పటి నుంచి పోరుబాటలో పాటై సాగుతున్నది. ప్రజా చైతన్యమే ధ్యేయంగా పాటెత్తుకుంది. ప్రజల మెప్పులే పురస్కారాలుగా ఎదిగింది. పాటే తన ప్రాణం అంటున్న అరుణోదయ నిర్మల ప్రస్థానమిది..
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామం నిర్మల పుట్టినూరు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిలువుటద్దం ఆ గ్రామం. జాటోతు థానూనాయక్, దర్గ్యానాయక్, జోగ్యానాయక్ పుట్టిన గడ్డ. అక్కడ ఎవరిని కదిలించినా ఆనాటి విప్లవం గురించే చెబుతారు. అక్కడి మట్టి వాసనలో ధిక్కారం ఉన్నది. అలాంటి గ్రామంలో రైతు కూలీ సంఘం నాయకుడు, కరుడుగట్టిన కమ్యూనిస్టు చీటూరు సోమయ్య- పిచ్చమ్మ దంపతులకు జన్మించింది నిర్మల. తరచూ ఇంటికి వచ్చిపోయే జనశక్తి నేతలు, కార్యకర్తలు పాడే పాటలు వింటూ పెరిగిన ఆమె ఆ తర్వాత అదే బాటలో పయనించింది. తండ్రి సోమయ్యతో పల్లెలు తిరుగుతూ విప్లవ గీతాలు ఆలపించేది. కూతురి ఆసక్తితో 2000 సంవత్సరంలో అరుణోదయ సభ్యురాలుగా చేర్పించాడు తండ్రి. అప్పటినుంచి ఆమె పాటల ప్రయాణానికి పునాది పడింది.
అరుణోదయలో సభ్యురాలుగా చేరిన నిర్మలను విమలక్క తీర్చిదిద్దింది. 2015 వరకు దాదాపు పదిహేనేండ్లు అరుణోదయతో ప్రస్థానం కొనసాగించింది. తెలంగాణ నృత్యగానం, వీర తెలంగాణ, అరుణోదయ పాటలపై బ్యాలే నృత్యాలను కంపోజ్ చేసి మంచి కళాకారిణిగా గుర్తింపు సాధించింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ గొంతుక కలిపింది నిర్మల. ఉద్యమ వేదికలపై వందలాది గీతాలు ఆలపించి.. ‘ఔరా!’ అనిపించుకుంది. భుజాన గొంగడి , కాళ్లకు గజ్జెలు కట్టి ఊరూరా తన పాటలతో జనాన్ని చైతన్యపరిచింది. మిలియన్ మార్చ్, సాగరహారంలోనూ తన ఆటపాటలతో ఉద్యమ ఆకాంక్షను తెలియపరిచింది.
లక్షలాది మంది పోరాటాల ఫలితంగా 2014లో తెలంగాణ ఏర్పాటైంది. ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పాటు చేసి ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు కల్పించింది. అలా నిర్మలకు అవకాశం వచ్చింది. సంక్షేమం, ప్రజాహిత కార్యక్రమాల్లో తన వంతు పాత్రను పోషిస్తూ ముందుకు సాగుతున్నది నిర్మల. తన ప్రస్థానంలో ఎన్నో పురస్కారాలు ఆమెను పలకరించాయి. తెలంగాణ రచయితల వేదిక వట్టికోట ఆళ్వార్‌స్వామి పురస్కారం, పుడమి మహిళా పురస్కారం, బాబూ జగ్జీవన్‌రామ్ పురస్కారం, సంక్షేమ పథకాల సంబురాల దరువు పురస్కారం, పుడమి సాహితీ వేదిక జాతీయ పురస్కారం ఇలా ఎన్నో పురస్కారాలు ఆమెను వరించాయి.
అరుణోదయలో కోశాధికారిగా కొనసాగుతున్న కాలంలో నిర్మలకు.. విజృంభణ విద్యార్థి సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కొనసాగుతున్న పలస యాదగిరితో పరిచయమైంది. 2003లో వీరిద్దరి వివాహం జరిగింది. యాదగిరి సీపీఐ (ఎంఎల్) జనశక్తి విప్లవోద్యమ నిర్మాణంలో పనిచేస్తున్న కాలంలో అనేకసార్లు జైలుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. జీవిత సహచరిగా నిర్మల ఆ సమయంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నది. పార్టీ ఆదేశాల మేరకు యాదగిరి కొంతకాలం రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. ఆ కాలంలో నిర్మల తన ఇద్దరు పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే, అరుణోదయలో కీలకంగా పనిచేసింది.
ఉద్యమ వేదికలపై ఎగిసిన నిర్మల గొంతు.. ఇప్పుడు యూట్యూబ్‌లో మార్మోగుతున్నది. ‘అరుణోదయ నిర్మల’ చానెల్ ఏర్పాటు చేసి ఉద్యమ గీతాలు, జానపదాలతో ఉర్రూతలూగిస్తున్నదామె. భర్త యాదగిరి స్వతహాగా కవి, రచయిత. ఆయన రాసిన పాటలేకాక, ఇతర రచయితల పాటలు పాడుతూ.. వాటిని రికార్డు చేసి, యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నది. మహిళా చైతన్యం, మహిళలపై జరుగుతున్న దురాగతాలతోపాటు సమాజహితులు, డాక్టర్లు, అడ్వకేట్లు, జర్నలిస్టులు, రైతులు, ఉద్యమాల్లో అమరులైన త్యాగధనులపై పాటలు పాడుతున్నది. బతుకమ్మ, తెలంగాణ పండుగలు, ఉద్యమాల గీతాలు పాడుతూ యూట్యూబ్‌లోనూ సంచలనం సృష్టిస్తున్న నిర్మల ఇదే జోరు కొనసాగించాలని మనమూ కోరుకుందాం.