సమాజ సేవ కెరీర్‌గానూ మారింది. స్వచ్ఛంద సంస్థ నిర్వహణకు మేనేజ్మెంట్ స్కిల్స్ అవసరం అవుతున్నాయి. సోషల్ఆడిట్.. అతికొద్దిమందికి మాత్రమే సాధ్యమైన కళ. ఇందుకు ఉదాహరణ తెలుగు వనిత సౌమ్య కిడాంబి. అంచెలుగా ఎదిగిన సౌమ్య తాజాగా జీవన నైపుణ్యాల విద్యాలయం బేర్‌ఫుట్ కాలేజ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.
సౌమ్య కిడాంబి.. అచ్చమైన మధ్యతరగతి యువతి. పదహారణాల తెలుగు కుటుంబం ఆమెది. డిగ్రీ వరకు వైజాగ్‌లో చదివారు. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో మాస్టర్స్ చేశారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో మానవహక్కుల చరిత్ర-సాధనపై పరిశోధన చేశారు. ఆ తర్వాత, మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ అనే స్వచ్ఛంద సంస్థలో చేరారు. ప్రముఖ సంఘ సేవకురాలు అరుణా రాయ్ స్థాపించిన ఈ సంస్థ గురించి చాలామందికి తెలియకపోవచ్చు. సమాచార హక్కు, కనీస వేతనాల చట్టం, ఉపాధి హామీ పథకం.. మజ్దూర్ సంఘటన్ పోరాట ఫలితాలే.
ఆ లక్ష్యాల సాధనలో అరుణ నేతృత్వంలో సౌమ్య కిడాంబి కృషి అపారం. మజ్దూర్ కిసాన్ శక్తి సభ్యురాలిగా ఏడేళ్ల పాటు క్షేత్రస్థాయిలోనే ఉన్నారు, దొరికిందేదో తిన్నారు. వీలున్నచోట తలదాచుకున్నారు. ‘ఏ విశ్వ విద్యాలయమూ బోధించని విలువైన పాఠాలు క్షేత్ర స్థాయిలో తెలుసుకున్నాను, నేర్చుకున్నాను’ అంటారామె. ఉపాధి హామీ లాంటి పథకాలు ఎంత సవ్యంగా అమలవుతున్నాయో నిశితంగా గమనించారు. ఈ తరహా పర్యవేక్షణను ‘సోషల్ ఆడిట్’ అంటారు. ఈ ప్రక్రియ అప్పటికి మనకు కొత్తే. ఆ ప్రయోగం తనకు అంతర్జాతీయంగా పేరు తీసుకొచ్చింది. అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ బడ్జెట్ పార్ట్నర్షిప్ (ఐబీపీ) నుంచి ఆమెకు పిలుపు వచ్చింది.
ప్రజలకు వీలైనంత మేర మేలు జరిగేలా ప్రభుత్వ సంస్థలు బడ్జెట్ రూపొందించేందుకు ఈ సంస్థ సాయపడుతుంది. ఐబీపీ తరఫున కెన్యా, దక్షిణాఫ్రికా ప్రతినిధులకు సోషల్ ఆడిటింగ్‌లో శిక్షణ ఇచ్చారు సౌమ్య. ఆ తర్వాత ‘శాట్’ అనే సామాజిక ఆడిటింగ్ సంస్థలో చేరారు. మన దేశంలో సోషల్ ఆడిట్ కోసం స్థాపించిన తొలి స్వతంత్ర సంస్థ ఇది. డైరెక్టర్ హోదాలో సౌమ్య ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలతో కలిసి పనిచేశారు. సర్కారు పథకాలు సమర్థంగా అమలయ్యేలా కృషి చేశారు. పేదల హక్కులకు పెద్దపీట వేశారు.
ఇంతలో బేర్‌ఫుట్ కాలేజ్ రూపంలో ఓ అరుదైన అవకాశం సౌమ్య తలుపు తట్టింది. రాజస్థాన్‌లోని తిలోనియాలో ప్రారంభించిన ఈ అక్షరాలయంలో పిల్లలు, పెద్దలు.. ఎవరైనా సరే రాత్రిబడులకు వెళ్లొచ్చు. అక్షరాస్యత పెంచుకోవచ్చు. జీవన నైపుణ్యాలను మెరుగుపర్చుకోవచ్చు. గ్రామీణ ప్రజలకు.. అందులోనూ మహిళలకు నీళ్లు, విద్యుత్ చాలా అవసరం. వాటి కోసం ఇంటిపెద్ద నుంచి కేంద్ర సర్కారు వరకు చాలామంది మీద ఆధార
పడాల్సిందే. ఎవరో ఒకరు దయ చూపితేనే పని అవుతుంది. ఎందుకింత పరాధీనత? బేర్‌ఫుట్ కాలేజ్ ఈ రెండు విషయాల్లోనూ సాధికారతకు యత్నిస్తున్నది. సౌర విద్యుత్‌తో వంట చేసుకునేందుకు, ఇంట దీపం వెలిగించుకునేందుకు సాయపడుతుంది.
అవసరమైతే నీటి పంపులను బాగు చేసుకునే నైపుణ్యాన్నీ అందిస్తుంది. ఈ కాలేజ్‌లో సర్టిఫికెట్లు ఉండవు. కచ్చా నేల మీదే బోధన జరుగుతుంది. అందుకే ‘బేర్ ఫుట్ కాలేజ్’ అని పేరు పెట్టారు. రాజస్థాన్‌లోని కరువు ప్రాంతాలను దగ్గర నుంచీ చూసి చలించిపోయిన బంకర్ రాయ్ దీని వ్యవస్థాపకుడు. ప్రజలకు కేవలం చదువే సరిపోదని, జీవితాల్నీ మెరుగుపరచాలని.. స్వశక్తితో కరువును, పేదరికాన్ని ఎదుర్కోవడానికి సరిపడా సాంకేతికతను అందించాలనీ రాయ్ భావించారు. ఆ లక్ష్యంతో తీర్చిదిద్దిన వ్యవస్థే ఇది. యాభై సంవత్సరాల్లో బేర్‌ఫుట్ కాలేజ్ లక్షలమందిని ప్రభావితం చేసింది. బంకర్రాయ్ ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల వ్యక్తులలో ఒకరిగా నిలిచారు. ఆయన వృద్ధాప్యంలోకి అడుగుపెట్టాక, బేర్‌ఫుట్ కాలేజీకి సమర్థ నాయకత్వం అవసరమైంది.
ఆ సమయంలో బంకర్ రాయ్ సతీమణి అరుణా రాయ్‌కి సౌమ్య గుర్తుకొచ్చారు. మజ్దూర్ సంఘటన్లో తనతో పనిచేస్తూ… సంస్థ ఆశయాలకు నిలువెత్తు రూపంగా మారిన సౌమ్య బేర్‌ఫుట్ కాలేజ్‌ను అంతే ఉత్సాహంగా నడిపించగలరనే నమ్మకం కలిగింది. ఈ ఏడాది జూన్‌లో సౌమ్యను బేర్‌ఫుట్ కాలేజ్ సీఈఓగా నియమించారు. ‘తమ జిల్లాలో, గ్రామంలో ఏదైనా కొత్తగా ప్రారంభించాలని కోరుకునేవారు ఎంతోమంది. రోజూ నాకు గ్రామీణ మహిళల నుంచి అనేక ఫోన్‌కాల్స్ వస్తుంటాయి. ఎదగాలనే ఆకాంక్షకు ఇదే తార్కాణం’ అంటారు సౌమ్య కిడాంబి.