స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. ‘టాక్ ఆఫ్ ద సోషల్ మీడియా’గా మారింది. ఆమెకు సంబంధించిన ఓ పాత వీడియో.. నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నది. కెరీర్ తొలినాళ్లలో బాలీవుడ్ నటి ‘బిపాసా బసు’ను ఉద్దేశించి మృణాల్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
Mrunal Thakur | ఓ ఇంటర్వ్యూలో బిపాసాను ఉద్దేశించి.. ఆమె కన్నా తానే అందంగా ఉంటాననీ, బిపాసా కండలు తిరిగిన మగవాడిలా కనిపిస్తుందని మృణాల్ వ్యాఖ్యానించింది. ఈ మాటలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో.. మృణాల్ ఇప్పటికే క్షమాపణలు కోరింది. అయినప్పటికీ ఈ విషయంపై ఎవరో ఒకరు సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుతూనే ఉన్నారు. అయితే, ఈ వివాదంపై టెలివిజన్ స్టార్ హీనా ఖాన్.. మృణాల్‌కు అండగా నిలుస్తున్నది. తప్పులు చేయడం మానవ సహజమనీ.. క్షమాపణలు కోరిన తర్వాత కూడా వివాదాలను కొనసాగించడం పద్ధతికాదని హితవు పలికింది. తాజాగా, మృణాల్ క్షమాపణలు చెబుతున్న పోస్ట్‌ను తిరిగి షేర్ చేస్తూ.. ఆమెకు మద్దతు పలికింది. ‘మనమందరం తప్పులు చేస్తాం. ముఖ్యంగా చిన్నతనంలో ఉన్నప్పుడు.. ఏం మాట్లాడితే, ఎలాంటి వివాదాలు తలెత్తుతాయో తెలుసుకోలేం.
నేను కూడా గతంలో ఇలాంటి పొరపాట్లు చేశాను. అప్పుడు మనల్ని ఎవరూ పట్టించుకోరు. కానీ, కాలక్రమేణా మనదైన పరిశ్రమలో రాణించి.. పైకి ఎదుగుతాం. అప్పుడు కొందరు వెతికివెతికి పాత పొరపాట్లను బయటికి తీసుకొస్తారు. లేనిపోని వివాదాల్లోకి లాగుతారు. అలాంటివాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ రాసుకొచ్చింది. ఇక సినిమా ఇండస్ట్రీలో బిపాషా-మృణాల్ ఇద్దరివీ స్ఫూర్తిదాయకమైన ప్రయాణాలనీ, ఇద్దరూ అద్భుతమైన నటులేనని కొనియాడింది. ఈ విషయంలో మృణాల్ బాగా స్పందించిందనీ, తన తప్పును తెలుసుకొని క్షమాపణలు కోరడం సంతోషంగా, గర్వంగా ఉన్నదని చెప్పుకొచ్చింది. ఇక టీవీ సీరియల్స్‌లో చిన్నచిన్న పాత్రలతో నటనారంగంలోకి వచ్చింది మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత హిందీలో కథానాయికగా అవకాశాలు దక్కించుకుంది. ‘సీతారామం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. తొలి సినిమాతోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నది. ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో తెలుగువారికి మరింత దగ్గరైంది.