దేశంలో మహిళా డ్రైవర్లు పెరుగుతున్నారు. హైవేలపై రయ్యిమంటూ దూసుకెళ్తున్నారు. కుటుంబ పోషణ కోసం ట్యాక్సీ, ఆటోలు నడిపేవాళ్లే కాకుండా.. లగ్జరీ కార్లు కొనడంలోనూ ఆడవాళ్లు ఆసక్తి చూపుతున్నారు. సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకం సంస్థ.. ‘స్పిన్నీ’ ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలోని మహిళా డ్రైవర్లపై ఇటీవలే ఓ సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా పలు విషయాలను వెల్లడించింది. 2025 నివేదిక ప్రకారం.. మనదేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుదారుల్లో మహిళల వాటా.. 46 శాతంగా ఉన్నది. 2023లో వీరివాటా కేవలం 16 శాతం మాత్రమే! ఢిల్లీ- జాతీయ రాజధాని ప్రాంతం పరిధిలో అత్యధికంగా 48 శాతం కొనుగోలుదారులు మహిళలేనట.
ముంబై నగరం.. 46 శాతంతో ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. వీరిలో దాదాపు సగంమంది డ్రైవర్లుగా రోడ్లపై నిత్యం చక్కర్లు కొడుతున్నారు. మామూలు కార్లేకాదు.. లగ్జరీ బ్రాండ్ వాహనాల కొనుగోలులోనూ ఆడవాళ్లు ఆసక్తి చూపుతున్నారు. మెర్సిడెస్-బెంజ్ కొనుగోలుదారుల్లోనూ 15 శాతం మహిళలే ఉన్నట్టు సర్వేలో తేలింది. అదే సమయంలో కొత్త కార్ల కొనుగోలులో మాత్రం మహిళలు తక్కువగా ఉన్నారని వెల్లడించింది. అయినా.. గతంతో పోలిస్తే వాహనరంగంలో మహిళా శ్రామిక శక్తి పెరుగుతున్నదని సర్వే ప్రతినిధులు చెబుతున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పురుషులు తక్కువ ధర, బేసిక్ వేరియంట్ల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారట. అందుకు భిన్నంగా.. మహిళలు మధ్యస్థ, అగ్రశ్రేణి వేరియంట్ల వైపు మొగ్గు చూపుతున్నారని సర్వే చెబుతున్నది. మెరుగైన ఫీచర్ల కోసం ఎక్కువ ధర చెల్లించడానికీ మహిళలు ముందుకొస్తున్నారట. బ్రాండ్తోపాటు అనుభవానికి కూడా ఆడవాళ్లు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనీ, వారి ఆసక్తి, ప్రోత్సాహంతో వాహనరంగంలోనూ రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నారనీ సర్వే ప్రతినిధులు చెబుతున్నారు.