జెన్-జెడ్ మహిళల్లో ‘సంతానోత్పత్తి’ ఓ సమస్యగా మారుతున్నదట. పీసీఓఎస్, ఊబకాయం, వివాహం ఆలస్యమవడం, ఇతర కారణాల వల్ల.. ‘సంతానోత్పత్తి’పై ఆందోళన చెందుతున్నారట. దాని కారణంగానే.. 51 శాతం మంది సాధారణ ఆరోగ్య పరీక్షలతోపాటు సంతానోత్పత్తికి సంబంధించిన టెస్టులూ చేయించుకుంటున్నారట. దేశంలోని మెట్రో నగరాలు, ఇతర ప్రధాన నగరాల్లో తాజాగా నిర్వహించిన ఓ సర్వే.. ఈ విషయాలను వెల్లడించింది. ఈ సర్వేలో భాగంగా 200లకు పైగా జెన్ జెడ్ (23-30 ఏళ్ల వయసు) మహిళల నుంచి వివరాలు సేకరించారు.
ఇందులో పాల్గొన్న వారిలో సగం మందికిపైగా.. 35 ఏళ్ల తర్వాత సంతానోత్పత్తి గణనీయంగా తగ్గుతుందని నమ్ముతున్నారు. పునరుత్పత్తికి సంబంధించిన ఆరోగ్య సమాచారం కోసం.. 41 శాతం మంది సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. ఇక 28-32 ఏళ్ల మధ్య గర్భధారణ కోసం ప్రయత్నించాలని అనుకుంటున్నట్లు 40 శాతం మంది చెప్పుకొచ్చారు. మరో 25 శాతం మంది సంతానోత్పత్తికి సరైన సమయం, గర్భధారణకు సంబంధించిన అనుమానాలను తరచుగా లేవనెత్తుతున్నారు.
ఎగ్ ఫ్రీజింగ్ గురించి విన్నట్లు 56 శాతం మంది జెన్ జెడ్ మహిళలు వెల్లడించారు. కానీ, వారిలో చాలామందికి దాని గురించిన పూర్తి అవగాహన లేదట. ఆర్థిక స్థిరత్వం సాధించడం, కెరీర్ కోసం సంతానాన్ని వాయిదా వేసుకోవాలని అనుకుంటున్నట్లు 10 శాతం మంది చెప్పుకొచ్చారు. చివరగా, 18 శాతం మంది జెన్-జెడ్ మహిళలు.. పిల్లలను కనకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు.. జెన్-జెడ్ మహిళల్లో సంతానోత్పత్తికి ప్రతిబంధకంగా పరిణమిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఫ్యాషన్ డైట్లను అనుసరించడం, ప్రిస్క్రిప్షన్ లేకుండా సప్లిమెంట్లను తీసుకోవడం కూడా.. సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.