చాలామంది శీతలపానీయాల మోజులో పడిపోయి.. పండ్ల రసాలను నిర్లక్ష్యం చేస్తారు. తీసుకున్నా ఒకేరకం పండ్ల రసాలు తీసుకుంటారు. అలా కాకుండా, శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లను పుష్కలంగా అందించే ‘మిశ్రమ’ రసాలు తాగడం మేలని సలహా ఇస్తారు పోషకాహార నిపుణులు.
దానిమ్మ-ద్రాక్ష : ఈ పండ్లలో పాలిఫినాల్స్ పుష్కలం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, టానిన్లు, ఆంథోసైనిన్లు, ఎలాజిక్ యాసిడ్ ఉంటాయి. రెడ్వైన్తో పోలిస్తే దానిమ్మ తొక్కలో మూడురెట్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాబట్టి, ఈ రెండూ కలిపి తాగితే ఎంతో మేలు.
మామిడి-పైనాపిల్ : ఈ రసాల్లో రెస్వెరాట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది, పాడైన శరీర కణజాలానికి మరమ్మతులు చేస్తుంది. రెండూ కలిపి తాగడం వల్ల గుండె సంబంధ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. పైనాపిల్లో విటమిన్-సి, ఫినాలిక్ యాసిడ్స్ ఉంటాయి. ఇదో సూపర్ కాంబినేషన్.
పుచ్చకాయ-నిమ్మకాయ : ఇవి శరీరాన్ని తేమగా ఉంచుతాయి. పుచ్చకాయలో లైకోపీన్ ఉంటుంది. నిమ్మకాయలో విటమిన్-సి అపారం. రెండూ కలిపినప్పుడు వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు మరింత బలపడి, క్యాన్సర్కారక ఫ్రీ రాడికల్స్పై పోరాడతాయి.
స్ట్రాబెర్రీ-నారింజ : స్ట్రాబెర్రీలోని ఆంథోసైనిన్లు క్యాన్సర్ కారకాలతో పోరాడగలవని వైద్యులు చెబుతున్నారు. ఇవి గుండె వ్యాధుల నుంచీ రక్షిస్తాయి. నారింజలో విటమిన్-సి కూడా అధికమే. దీన్ని స్ట్రాబెర్రీతో కలిపి తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి.
యాపిల్-జామ : యాపిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ అధికం. ఇవన్నీ కణాలను రక్షించడంలో సాయపడతాయి. జామలో విటమిన్-ఎ, విటమిన్-సి, లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. రెండిటి మిశ్రమం అద్భుతాలు చేస్తుంది.