పౌరాణిక ప్రాశస్త్యం, చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక వైభవం కలగలసిన అందమైన ప్రదేశం.. గాంధారి ఖిల్లా. విభిన్న సంస్కృతుల నిలయంగా విలసిల్లుతున్న ఈ గిరిపై గిరిజనుల సంబురం వైభవంగా కొనసాగుతున్నది. కొండపై కొలువుదీరిన మైసమ్మకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ నెల 18న మొదలైన జనజాతర నేటితో ముగుస్తుంది.
మంచిర్యాల జిల్లా కేంద్రానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలోని అటవీప్రాంతంలో ఉంటుంది గాంధారి ఖిల్లా. వందల ఏండ్ల చరిత్ర దీని సొంతం. చుట్టూ ఆకట్టుకునే ప్రకృతి, కొండపై పచ్చదనం, శతాబ్దాల నాటి కోట, అందులో రాతి ద్వారాలు, సొరంగ మార్గాలు, సవతుల బావులు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలను పొదుగుకున్న గుట్టపైకి మైసమ్మ జాతర సందర్భంగా వేలమంది గిరిజనులు చేరుకుంటారు.
ముచ్చటగా మూడో రోజు..
జాతరలో ‘కోవ మెకాశీలు’ పూజారులుగా వ్యవహరిస్తారు. గోండులు, మన్నెలు, మెకాసి, నాయక్పోడ్లు, కోయ గిరిజనులకు గాంధారి మైసమ్మ ఆరాధ్య దైవం. జాతర వేళకు ఎక్కడెక్కడి నుంచో గిరిజనులు ఖిల్లాకు వస్తారు. మన రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. మైసమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు. ఉత్సవాల్లో మూడో రోజు తెల్లవారుజాము నుంచి సాధారణ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి వన భోజనాలు చేస్తారు. కోట సమీపంలోని పాలవాగులోని పవిత్ర జలాన్ని ఇండ్లకు తీసుకెళ్తారు. ఈ నీటిని పొలాల్లో చల్లితే, మంచి దిగుబడి వస్తుందని గిరిజనుల విశ్వాసం. మూడు రోజుల జాతరలో ఆదివాసీల సాంస్కృతిక కార్యక్రమాలతో ఖిల్లా కొత్తదనం సంతరించుకుంటుంది. సంప్రదాయ నృత్యాలు అబ్బురపరుస్తాయి. గిరిజన దర్బార్ ఆకట్టుకుంటుంది. కాబట్టే ‘గాంధారి’ జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నది.
ఖిల్లా చారిత్రక నేపథ్యం..
అటవీప్రాంతంలో ఉన్న ‘గాంధారి ఖిల్లా’ కేంద్రంగా కాకతీయ సామంతరాజులైన గోండు రాజులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది. సుమారు వేయి సంవత్సరాల కిందట రాష్ట్రకూటులు ఈ కోటను నిర్మించారని చెబుతారు. రాష్ట్రకూటుల నుంచి కాకతీయుల వరకు నాటి రాజుల శాసనాలు నేటికీ కోటలో కనిపిస్తాయి. గిరిజనుల ఇలవేల్పు ‘గాంధారి’ మైసమ్మ ఇక్కడ కొలువై ఉంది. అమ్మవారితో పాటు భైరవుడు, శివుడు, వేంకటేశ్వరుడు, ఆంజనేయుడి విగ్రహాలు గుట్టపై చూడొచ్చు. ద్వాపర యుగంలో దుర్యోధనుడు ఈ గుట్టపై కొన్నాళ్లు ఉన్నాడని స్థానికులు చెబుతారు. తన తల్లి గాంధారి పేరిట కోటను నిర్మించాడని, ఆ క్రమంలో ఈ ప్రాంతానికి ‘గాంధారి ఖిల్లా’ అని పేరు వచ్చిందంటారు.
– కొమ్మెర రామమూర్తి