Grains | ఉత్తరాది వారి ఇళ్లలో రోటీ దాదాపు ప్రతిరోజూ ఆహారంలో భాగంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే, కాలానుగుణంగా చాలా మంది ఉపయోగించే ధాన్యం మారుతూ ఉంటుంది. వాతావరణంలో వేడి, చలి, తేమల మార్పులకు అనుగుణంగా శరీరం స్పందిస్తుంది. అలాంటి సమయంలో సరైన రోటీని ఎంచుకోవడం వల్ల శరీరం తేలికగా, సమతుల్యంగా, ఉత్సాహంగా ఉంటుంది. పూర్వీకుల ఆహార విధానాలు కూడా ఇదే సూత్రాన్ని అనుసరించాయి. కొన్ని ధాన్యాలు శరీరానికి చల్లదనం ఇస్తే, మరికొన్ని వేడి కలిగిస్తాయి. ఇంకొన్ని జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఈ సూత్రాన్ని అర్థం చేసుకుంటే ప్రతిరోజు ఆహారం మరింత ఆరోగ్యకరంగా మారుతుంది. కనుక కాలానుగుణంగా తీసుకోదగిన వివిధ రకాల రోటీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవికాలంలో రాగి రోటీ మంచి ఎంపికగా భావిస్తారు. రాగి శరీరానికి చల్లదనం ఇచ్చి, వేడి ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇందులో కాల్షియం, ఫైబర్ అధికంగా ఉండటంతో పొట్ట నిండిన భావన కలిగిస్తుంది. పెరుగు, తేలికపాటి కూరలతో ఇది బాగా సరిపోతుంది. జొన్న రొటీ కూడా వేసవికి అనుకూలం. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి, సులభంగా జీర్ణమవుతుంది. భోజనం తర్వాత భారంగా అనిపించదు. దీని వల్ల రోజంతా శక్తి నిలకడగా ఉంటుంది. చలికాలంలో బాజ్రా (సజ్జ) రోటీ శరీరానికి వేడి అందిస్తుంది. దీని వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. చలి సమయంలో మెటబాలిజం మందగించే పరిస్థితిలో ఇది జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. నెయ్యి, ఆకుకూరలతో ఇది రుచిగా ఉంటుంది. మొక్కజొన్న రోటీ కూడా చలికాలంలో మంచి ఎంపిక. ఇది ఫైబర్‌తో నిండినది, శరీరానికి దీర్ఘకాలిక శక్తిని ఇస్తుంది. కొంచెం భారంగా ఉన్నప్పటికీ చలి సమయంలో అవసరమైన వేడి అందిస్తుంది.
అలాగే వర్షాకాలంలో రాజగిరా రోటీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తేమ ఎక్కువగా ఉన్న సమయంలో ఇది తేలికగా జీర్ణమై శరీరానికి పోషణ ఇస్తుంది. గ్లూటెన్ రహితంగా ఉండటం వల్ల ఆరోగ్యకరమైన ఎంపికగా భావిస్తారు.అదేవిధంగా బేసన్ రోటీ కూడా వర్షాకాలానికి అనుకూలం. ఇది సులభంగా జీర్ణమై, ప్రోటీన్ అందిస్తుంది. వర్షాకాలంలో అలసటను తగ్గించి శక్తిని పెంచుతుంది. ఇక గోధుమ రోటీ అన్ని కాలాల్లో సరిపోతుంది. ఇది సమతుల్య గుణాలు కలిగి ఉండి, దాదాపు అన్ని వంటకాలతో బాగా కలుస్తుంది. ఇది శక్తిని నిలకడగా విడుదల చేస్తూ ప్రతిరోజు ఆహారంలో ముఖ్యమైన భాగంగా ఉంటుంది. చిన్న మార్పు అయినా, సరైన కాలానికి సరైన రోటీని ఎంచుకోవడం ద్వారా శరీరం ప్రకృతికి అనుగుణంగా సర్దుబాటు అవుతుంది. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.