ఒక హీరో వరుస విజయాలు సాధిస్తే… పట్టుదల, స్వయం కృషితో ఎదిగాడు అని కితాబిస్తారు! అదే ఒక కథానాయిక సినీరాజ్యమేలితే.. ఆమె ప్రతిభను గుర్తించకపోగా, ఆమె కటౌట్ వెలిగిపోవడానికి ‘కమిట్మెంట్’ కారణమని కామెంట్ చేస్తారు. ఈ తరహా చౌకబారు విమర్శలు ఇండస్ట్రీ జనాలపై నాసిరకం మనుషులు ఎప్పుడూ చేసేవే!! అదేం దౌర్భాగ్యమో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవాళ్లూ దిగజారుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం సంస్కారహీనంగా నోరుజారుతున్నారు.
ఇష్యూను డైవర్ట్ చేయాలని మూసీ గబ్బును మించి కంపుగొలిపే మాటలన్నారు. తమ పొలిటికల్ మైలేజ్ కోసం కథానాయిక సమంతను టార్గెట్ చేశారు. తన అద్భుతమైన నటనతో పద్నాలుగేండ్లుగా వెండితెరను ఏలుతున్న నటిపై బురదజల్లారు. సాటి మహిళ అని కూడా చూడకుండా మహిళా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిత్వ హననమే! తన ప్రతిభతో అందనంత ఎత్తుకు ఎదిగిన నటి సమంత. ఈ వ్యాఖ్యలు ఆమె ప్రతిష్ఠను ఇసుమంతైనా కదల్చలేవు. అదే సమయంలో, మంత్రివర్యురాలు తెంపరి మాటలు హుందాగా సాగిపోయే తెలంగాణ రాజకీయాలకు ‘కొండ’ంత చేటు.
Samantha | తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు సమంత. ఓ పెద్దింటి కోడలు కాకమునుపే ఆమె స్టార్. ఇంకాచెప్పాలంటే తెలుగులో తన మొదటి సినిమా ‘ఏ మాయ చేసావే!’ మొదటి ఆటతోనే సమంత బిగ్‌స్టార్ అయిపోయింది. కేరళ తీరం నుంచి టాలీవుడ్‌కు తరలివచ్చిన వసంతంలా కనిపించింది దర్శక, నిర్మాతలకు! అందుకే, అవకాశాలు వెల్లువెత్తాయి. ఆమె కాల్షీట్ల కోసం ఎదురుచూశారు. ‘ఏ మాయ చేసావే’లో మెచ్యూర్డ్ లేడీగా అలరించిన ఆమె.. రెండో చిత్రం ‘బృందావనం’లో బబ్లీ పెర్ఫార్మెన్స్తో ముచ్చటగొలిపింది. ‘దూకుడు’తో తనకు సాటెవ్వరు అనిపించుకుంది. ‘ఈగ’లో బిందుగా కనువిందు చేసింది. ‘బిందు జోలికొస్తే చంపేస్తా’ అని సినిమాలోని ఈగ మాత్రమే కాదు.. ఆ చిత్రాన్ని చూస్తున్న ప్రేక్షకులూ ఫీలయ్యేంతలా ఆ పాత్రను పండించింది సమంత. ఇండస్ట్రీలోకి వచ్చిన రెండో ఏడాదే ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమాకు గానూ ఉత్తమ నటిగా నంది పురస్కారం అందుకుంది.
‘ఈగ’ సక్సెస్ తర్వాత సమంత సినీ జర్నీ మెరుపువేగం పుంజుకుంది. తెలుగుతోపాటు తమిళ సినిమాల్లోనూ పాత్రలు వెతుక్కుంటూ ఆమె తలుపుతట్టాయి. కేవలం అందం ఒక్కటే ఉంటే.. సక్సెస్ వచ్చినంత వేగంగా వెనక్కి మళ్లిపోతుంది. అందుకు తగ్గ అభినయం పండించగలదన్న నమ్మకం కుదిరినప్పుడే.. ఇండస్ట్రీ ఆదరిస్తుంది. తన పాత్రకు ఆమె అయితేనే న్యాయం చేస్తుందన్న విశ్వాసం ఉంటేనే.. దర్శకుడి ఎంపిక అవుతుంది. ప్రతి భావాన్నీ కొలిచినట్లు పలికించే సమంత రాక సినీ సృజనశీలురకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. కథానాయకుడి చుట్టూనే కథ అల్లుకున్నా.. సమంత పాత్రను చక్కెర గుళికలా తీర్చిదిద్దేవారు. పొడిపొడిగా పలుకుతూనే మనసు తడిచేసే నేర్పరి ఆమె. అందుకే ఏడాదికి ఆరేడు సినిమాలు చేసేంత బిజీగా మారిపోయింది.
‘సీతమ్మ వాకిట్లో..’ సిరిమల్లెల నవ్వులు పూయించినా, ‘అత్తారింటికి దారేది’లో శశిలా మెరిసినా.. సమంత మార్కు స్పష్టంగా కనిపించింది. ఆమె నటనలో మరోకోణం ఆవిష్కరించిన సినిమా ‘మనం’. ‘బిట్టూ..’ అంటూ కొడుకుపై అవ్యాజమైన ప్రేమ కురిపించే సన్నివేశాల్లో ఆమె అచ్చంగా అమ్మగా దర్శనమిస్తుంది. కమర్షియల్ సినిమాల్లో హొయలు ఒలికించినా, ప్రయోగాత్మక చిత్రాల్లో తన నటనకు పరిధులు ఉండవని నిరూపించింది సమంత. అందుకు ఉదాహరణే ‘రాజుగారి గది 2’. ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ ఈ నటిని మరోమెట్టు పైకి ఎక్కించింది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ‘యూ టర్న్’తో సమంత కెరీర్ కొత్త మలుపు తీసుకుంది. తమిళంలో వచ్చిన ‘సూపర్ డీలక్స్’లో బోల్డ్‌గా నటించి పాత్ర డిమాండ్‌కు న్యాయం చేసింది. ఇక ‘ఓ బేబీ’ సమంత కెరీర్లో ద బెస్ట్ అని చెప్పొచ్చు. పాతికేండ్ల పడుచుగా మారిన ఏడుపదుల ముదుసలి పాత్రను ఆమె పోషించిన తీరు అద్భుతం. ‘ఫ్యామిలీమ్యాన్-2’ వెబ్‌సిరీస్ ఈ కథానాయిక స్టామినాను పాన్ ఇండియాకు పరిచయం చేసింది. ఇలా చెబుతూ పోతే, సమంత కెరీర్లో ఆల్‌టైమ్ హిట్స్ ఎన్నో! సినిమాలు ఫెయిల్ అయ్యాయేమో కానీ, నటిగా మాత్రం ఆమె విఫలమైన సందర్భం లేదు!
వ్యక్తిగత జీవితంలో ఒడుదొడుకులు సహజం. సమంత జీవితంలోనూ చికాకులు ఉన్న మాట వాస్తవం. నాగచైతన్యను ప్రేమించి పెండ్లి చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత ఇద్దరికీ పొసగలేదు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఈ దశలో కొంత కుంగుబాటుకు గురైందామె! ‘యశోద’ సినిమా విడుదలకు ముందు మయోసైటిస్ అనే జబ్బుకు గురైంది. ఆమె తనకు వచ్చిన వ్యాధి గురించి సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు నలుగురూ నాలుగు రకాలుగా స్పందించారు. కొందరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కొందరు మాత్రం ‘సమంత సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నద’ని వెకిలిగా కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు తనను మరింత ఒత్తిడికి గురి చేశాయని సమంత అప్పట్లో స్పందించింది. అనారోగ్యం నుంచి కోలుకున్న ఆమె ఇప్పటికీ లైమ్‌లైట్‌లోనే ఉంది. ఇప్పుడు తన చేతినిండా సినిమాలు లేకపోవచ్చు. కానీ, ఆమె ఆల్వేస్ ఆకా‘సమంతే’!
సినిమాల్లో బిజీగా ఉన్న రోజుల్లోనూ, వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడూ, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడూ.. సందర్భం ఏదైనా ఆమె ధైర్యంగానే ఉంది. హుందాగానే వ్యవహరించింది. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సాక్షాత్తూ ఓ మహిళా మంత్రి అనరాని మాటలన్న ఈ సందర్భంలోనూ అంతే ఔన్నత్యాన్ని ప్రదర్శించింది. తన ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దని విన్నవించుకుంది. విడాకుల అంశాన్ని ప్రస్తావిస్తూ వ్యక్తుల గోప్యత విషయంలో జాగ్రత్తలు పాటించాలని సోషల్ మీడియా వేదికగా సున్నితంగా హెచ్చరించింది. చిరంజీవి మొదలుకొని సినిమా ఇండస్ట్రీ వాళ్లంతా సమంత వెన్నంటి ఉన్నామని ప్రకటించారు. ఇక మంత్రివర్యుల విషయానికి వస్తే.. తను చేసిన కామెంట్లను ఉపసంహరించుకుంటున్నాను అని పేర్కొన్నారు. అంతలోనే మళ్లీ వివాదానికి ఆజ్యం పోశారు. అయినా, వ్యాఖ్యలను రికార్డుల్లోంచి తొలగించడానికి ఇది చట్టసభ కాదు. మహిళా మంత్రి ప్రజాక్షేత్రంలో నోరుజారారు. దిద్దుకోలేని తప్పు చేశారు. బేషరతుగా క్షమాపణలు వేడుకున్నా.. ఆ నీతిమాలిన కామెంట్లకు నిష్కృతి ఉండదు. ఒక ఆడపిల్లను, స్వయం ప్రతిభతో ఎందరికో ఆదర్శంగా నిలిచిన మహిళను పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకున్న తీరు.. సమంత అభిమానులనే కాదు, తెలుగువాళ్లందరినీ
సిగ్గు సిగ్గు అనేలా చేసింది.