‘సమస్యలు ఎప్పుడూ చెప్పి రావండీ..!’ అచ్చా.. చాలా సార్లు విన్నాంలే గానీ.. కొత్తగా ఏదైనా చెప్పండి అంటారా? రైట్.. ‘మేటర్ ఏదైనా మైండ్‌లో నుంచే పుడుతుంది’ అబ్బో.. ‘ఏంటా మేటర్?’ అని ఆలోచిస్తున్నారా? అయితే, ఓ కొత్త మైండ్ సెట్ టెక్నిక్ గురించి తెలుసుకోవాల్సిందే. అదేంటంటే.. ‘మైండ్ ఓవర్ మేటర్’. ఈ కాన్సెప్ట్‌ని కామ్‌గా మీరు ఫాలో అయితే.. సమస్యలు చెప్పి వచ్చినా చక్కగా ఫేస్ చేయొచ్చు. ఇట్టే పరిష్కారం వెతికేయొచ్చు. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ‘ల్యాగ్ వద్దులేగానీ.. విషయంలోకి రండి!’ అనుకోకండి.. మైండ్‌ని కాస్త స్లోడౌన్ చేయండి. గట్టిగా ఊపిరి తీసుకోండి.. అప్పుడే ‘మైండ్‌ఫుల్‌నెస్’ టెక్నిక్‌ని తెలుసుకోగలం.
ఏదైనా స్టార్ట్ చేసే ముందు దాంట్లో వంద శాతం మునిగిపోవడమే మైండ్‌ఫుల్‌నెస్ అంటే. అప్పటికి ఏం చేస్తున్నామో దాంట్లోనే జీవించడం అన్నమాట. కాస్త ధ్యానం, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు లాంటివి చేస్తే ఈ టెక్నిక్‌ని ఫాలో అయిపోవచ్చు. దీంతో సమస్యకు పాజిటివ్‌గా చెక్ పెట్టొచ్చు. మీలో మీరు.. మీతో మీరు అనుకూల వాతావరణాన్ని సృష్టించొచ్చు. దీన్నే ‘పాజిటివ్ అవుట్‌లుక్’ టెక్నిక్‌గా పిలుస్తున్నారు. సమస్య తీవ్రతని కాకుండా దానికున్న పరిష్కారం చూస్తారన్నమాట. వాటిని అధిగమించగానే మీలో అహాన్ని కాకుండా.. కృతజ్ఞతా భావాన్ని పెంపొందించుకుంటారు. దీంతో మీకో ‘సపోర్ట్ నెట్వర్క్’ పెరుగుతుంది. ఇది మనం చూస్తున్న సోషల్ నెట్వర్క్ కాదండోయ్.. మనం చూపించే కృతజ్ఞతతో మన చుట్టూ చేరే వెల్‌విషర్స్ అన్నమాట. ‘ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మెంటార్స్.. మన మంచి కోరే వారందరూ ఈ సపోర్ట్ నెట్‌వర్క్‌లోకి వస్తారు. సో.. ఈ టెక్నిక్స్ మీరు ఫాలో అయితే.. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ‘మైండ్’ ఎప్పుడూ ‘మేటర్’పైనే ఉండి దిశా నిర్దేశం చేస్తుంది. వెంటనే పాటించేయండి!