తరం మారినప్పుడు మనుషుల ఆలోచనలు, అలవాట్లలో కూడా చాలా తేడాలు ఉంటాయి. పాత తరం విహారం అనగానే తీర్థయాత్రలు చుట్టేసేవారు. మిలీనియల్స్ మాత్రం.. గిరి శిఖరాలు తిరిగి రావడమే నిజమైన ట్రావెలింగ్గా భావిస్తున్నారు. అందులోనూ సోలోగా వెళ్లడానికి ప్రాధాన్యం ఇస్తున్నారట. సోలోగా వెళ్లినా, జట్టుగా బయల్దేరినా హిల్‌స్టేషన్ తమ ఫేవరెట్ డెస్టినేషన్ అంటున్నారు మిలీనియల్స్. ఇందుకు కారణాలు
ఏకాంతం : ప్రస్తుతం మిలీనియల్స్ ఇటు ఉద్యోగం, అటు కుటుంబ బాధ్యతలతో సతమతమవుతున్నారు. అందుకే వాళ్లు ఏకాంతాన్ని కోరుకుంటున్నారు. కొన్నిరోజులు బ్రేక్ తీసుకుని హిల్‌స్టేషన్స్‌లో ఒంటరిగా గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
తక్కువ ఖర్చు: పీక్ సీజన్లలో ధరలు ఎక్కువగా ఉండటం వల్ల, ఆఫ్ సీజన్లో హిల్స్టేషన్లకు వెళ్లేందుకు మిలీనియల్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు కసోల్, బిర్ లాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ పర్యాటక కేంద్రాలు ఎంచుకుంటున్నారు. సోలోగా వెళ్తే ఆర్థికంగా భారం పడదని భావిస్తున్నారు.
వెల్నెస్: శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కోసం మిలీనియల్స్ హిల్‌స్టేషన్స్ ఎంచుకుంటున్నారు. రిషికేశ్‌లో యోగాభ్యాసం నుంచి ముక్తేశ్వర్‌లో ఫారెస్ట్ స్టే వరకు మనసుకు ప్రశాంతత చేకూర్చే ప్రదేశాలకే జై కొడుతున్నారు.
ఆన్ డ్యూటీ: అక్కడైతే ప్రశాంతంగా ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చని! అలా లీవ్ తీసుకోకుండా.. కొండకోనలకేగి రిమోట్ వర్క్ చేస్తున్నారు కొందరు. వైఫై అందుబాటులో ఉన్న హోమ్ స్టేల్లో దిగి.. ప్రకృతి ఒడిలో డ్యూటీ చేస్తున్నారు.