e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home జిందగీ ధనాధన్‌.. సనా!

ధనాధన్‌.. సనా!

తన పుట్టుకే ఓ విజయం. శారీరక బలహీనతను అధిగమించింది. ఇప్పుడు ఆమె పంచ్‌ పవర్‌కు పతకాలు హస్తగతం అవుతున్నాయి. అంతిమ లక్ష్యం.. ప్రపంచచాంపియన్‌గా నిలవడం. మహా సంకల్పం.. ఆడకూతుళ్లకు ఆత్మవిశ్వాసాన్నికల్పించడం. ఒకవైపు సాధకురాలిగా శిక్షణ కొనసాగిస్తూనే, మరోవైపు మార్షల్‌ఆర్ట్స్‌ గురువుగా రాణిస్తున్నది హైదరాబాద్‌కు చెందిన సనా అఫ్రీన్‌.చిన్న వయసులోనే కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌ సాధించి, జాతీయస్థాయిలో తన పంచ్‌పవర్‌ను చాటుకున్న సనా గురించి ఆమె మాటల్లోనే..

‘కడుపులో ఉన్నప్పుడే ఫైటింగ్‌ చేశావు నువ్వు’ అనేది అమ్మ. ఏడో నెల గర్భవతిగా ఉన్నప్పుడు ఫిట్స్‌ వచ్చిందట తనకు. డెలివరీ కష్టమన్నారు. ‘తల్లీబిడ్డల్లో ఒకర్నే కాపాడగలం’ అని తేల్చి చెప్పారట డాక్టర్లు. కానీ, మా అమ్మ పేగుబలం, నా అదృష్టం.. ఇద్దరం బతికాం. బిడ్డ పుట్టిన ఆనందం నన్ను చూడగానే ఆవిరైందట. అంత బలహీనంగా ఉన్నానట. డాక్టర్లయితే, ఈ అమ్మాయి బతకడం కష్టమని ‘కండ’బద్దలు కొట్టారట. మళ్లీ అదృష్టం నా పక్షమే వహించింది. బతికి బట్ట కట్టాను. అయినా, ఏండ్లు గడుస్తున్నా అలాగే బక్కగా ఉండిపోయాను. తరచూ అమ్మ నన్ను దవాఖానకు తీసుకెళ్లేది. అప్పుడు నాకు తొమ్మిదేండ్లు అనుకుంటా. మా ఇంటికి సమీపంలో ఓ కరాటే మాస్టర్‌ పిల్లలకు పాఠాలు చెప్పడం చూశాను. ‘నేనూ వెళ్తాను’ అన్నాను. నాన్న అడ్డు చెప్పలేదు. అప్పటివరకూ అన్నమైనా సరిగ్గా తినేదాన్ని కాదు. మొదటిరోజు కరాటే క్లాస్‌కు వెళ్లి రాగానే ‘ఆకలేస్తుందంటూ’ కంచం ఖాళీ చేశానట. ఇలా అయినా, కడుపునిండా తింటాననే ఉద్దేశంతో నన్ను కరాటే క్లాస్‌కు పంపడం మొదలుపెట్టారు.

- Advertisement -

పన్నెండేండ్లకే బ్లాక్‌ బెల్ట్‌
‘ఆడపిల్లకు కరాటే ఎందుకు?’ అని మా ఇంట్లో ఎప్పుడూ అనుకోలేదు. నాన్న, అమ్మ బాగా ప్రోత్సహించారు. నాన్న మహ్మద్‌ గౌస్‌ ఓల్డ్‌ సిటీలో వ్యాపారం చేసేవారు. మేమూ అక్కడే ఉండేవాళ్లం. నాకు ఓ చెల్లి. పేరు సబా. ఇద్దరం బీకాం సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాం. చిన్నప్పటినుంచీ అంతే. ఇద్దరిదీ ఒకటే స్కూల్‌, ఒకే క్లాస్‌. పేరుకే అక్కా చెల్లెళ్లం కానీ, స్నేహితుల్లా ఉంటాం. తొమ్మిదేండ్ల వయసులో నా కరాటే సాధన మొదలైంది. పన్నెండేండ్ల వయసులోనే బ్లాక్‌ బెల్ట్‌ సాధించాను.

యాక్సిడెంట్‌తో ఫుల్‌స్టాప్‌
అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే అది జీవితం ఎలా అవుతుంది? ఊహించని ప్రమాదం నన్ను కరాటేకు దూరం చేసింది. తీవ్ర గాయాలు కావడంతో నా సాధనకు ఫుల్‌స్టాప్‌ పడింది. కానీ, ఫిట్‌నెస్‌ కోసం రెగ్యులర్‌గా జిమ్‌కు వెళ్లేదాన్ని. ఇలా రోజులు గడిచిపోతుండగా, మూడేండ్ల క్రితం నా కజిన్‌ ఒకరు ఎంఎంఏ (మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్‌) హైదరాబాద్‌ జిమ్‌ గురించి న్యూస్‌ పేపర్లో చదివి నాకు చెప్పారు. అప్పటికే నాకు ఆ టీమ్‌లోని కోచ్‌ షేక్‌ ఖాలీద్‌ తెలుసు. ఆయనకు ఫోన్‌ చేసి మాట్లాడాను. ఇంట్లోవాళ్లు కూడా ఒప్పుకోవడంతో ఆ జిమ్‌లో జాయిన్‌ అయ్యాను. అయితే, అక్కడ శిక్షణ తీసుకునే వాళ్లంతా అబ్బాయిలే! నా ప్రాక్టీస్‌ వాళ్లతోనే సాగేది. ముఖ్యంగా వరల్డ్‌ చాంపియన్‌ మెహబూబ్‌ ఖాన్‌ నా ట్రైనింగ్‌ పార్ట్‌నర్‌. అలాంటి గొప్ప ఫైటర్స్‌తో ప్రాక్టిస్‌ చేయడంతో నా పంచ్‌ పవర్‌ పెరిగింది. అక్కడ చేరాక పాల్గొన్న నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో గోల్డ్‌ మెడల్‌ గెలిచి, కరాటేలో తెలంగాణ నుంచి ‘నేషనల్‌ ఫస్ట్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌’గా రికార్డు సాధించాను. నేషనల్‌ ఫైట్స్‌లో రెండు గోల్డ్‌ మెడల్స్‌ సంపాదించాను. అలాగే, హైదరాబాద్‌లో జరిగిన ఫైట్‌ నైట్‌లో గెలిచాను. గతేడాది లాక్‌డౌన్‌కు ముందువరకు చాలా పతకాలు సాధించాను.

నాన్న చాలా స్ట్రాంగ్‌
నాన్న నన్ను కరాటేలో చేర్పించినప్పుడు, ఇరుగుపొరుగు ‘ఆడపిల్లలకు కరాటే ఎందుకు?’ అన్నారు. పైగా, సంప్రదాయ కుటుంబంలోంచి నేను ఇలా మార్షల్‌ ఆర్ట్స్‌లోకి రావడాన్ని చాలామంది తప్పుబట్టారు. ముఖ్యంగా నేను టోర్నమెంట్‌ కోసం మొదటిసారి హైదరాబాద్‌ వదిలి ఒంటరిగా వెళ్లినప్పుడు, నాన్నతో ఎంతోమంది రకరకాల మాటలు అన్నారు. కానీ, ఆయన అవేవీ పట్టించుకోలేదు. ‘అమ్మాయిలకు కాస్తంత ప్రోత్సాహం ఇస్తే గొప్ప విజయాలు సాధించగలరు’ అని నమ్మారు. ఆర్థికంగా ఎన్ని సమస్యలొచ్చినా నా శిక్షణకు ఆటంకాలు రాకుండా చూసుకునేవారు. అలాగే, టోర్నమెంట్స్‌లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. అప్పుడూ బాగా ఖర్చయ్యేది. అమ్మానాన్న కూర్చుని బడ్జెట్‌ లెక్కలు వేసేవాళ్లు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎప్పుడూ ఆగిపోమనలేదు. ధైర్యంగా ఫైట్‌ చేయమని చెప్పేవారు. నేను ఫ్యూచర్‌ ప్లాన్స్‌పై క్లారిటీగా ఉన్నాను. ‘వరల్డ్‌ చాంపియన్‌’ అవ్వాలన్నది నా లక్ష్యం. దానికోసం నా వంతు కృషి చేస్తున్నాను. ప్రాక్టీస్‌ కొనసాగిస్తూనే, ఐఎఫ్‌సీ క్లబ్‌లో ఉమెన్‌ ట్రైనర్‌గా పని చేస్తున్నాను. వివిధ జిమ్స్‌లో ట్రైనర్‌గానూ చేస్తున్నాను. ముఖ్యంగా ఆడపిల్లలు, మహిళలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇవ్వడం సంతృప్తిగా అనిపిస్తున్నది.

ఆత్మ రక్షణ ముఖ్యం
ఆడపిల్లలు.. కరాటే, మార్షల్‌ ఆర్ట్స్‌ తప్పకుండా నేర్చుకోవాలి. బ్లాక్‌ బెల్ట్‌ తెచ్చుకోనవసరం లేదు. అనుకోకుండా ఎదురయ్యే ఆపదల్లోంచి తమను తాము రక్షించుకోవాలి. అందుకు, ట్రైనింగ్‌ క్లాసులకు వెళ్లి కనీసం సెల్ఫ్‌ డిఫెన్స్‌ టెక్నిక్స్‌ అయినా నేర్చుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ విషయంపై అవగాహన తెచ్చుకోవాలి. సమాజంలో చాలా మార్పు వస్తున్నది. ప్రతి కమ్యునిటీలోనూ ఆడపిల్లల చదువుపై అవగాహన వస్తున్నది. సెల్ఫ్‌డిఫెన్స్‌ గురించి కూడా ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులూ ఆలోచించాలి.

… నిఖిత నెల్లుట్ల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana