పురుషులతో పోలిస్తే.. మహిళల ఆయుష్షు ఎక్కువని పలు పరిశోధనల్లో తేలింది. అదే సమయంలో.. ఆడవాళ్లు తమ జీవితంలో ఎక్కువ సమయం అనారోగ్యంతోనే గడుతున్నారని వెల్లడైంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం, మెకిన్సే నిర్వహించిన ఓ అధ్యయనం.. పురుషుల కన్నా మహిళలు తమ జీవితాల్లో 25శాతం ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నట్లు బయటపెట్టింది. వెన్నునొప్పి, తలనొప్పితోపాటు నిరాశ నిస్పృహలకు గురికావడంలో స్త్రీలే ముందున్నారట.
ముఖ్యంగా, మహిళల్లో నిగూఢంగా దాగి ఉండే ఐదు సమస్యలు.. వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయట. పురుషులతో పోలిస్తే.. మహిళల్లో ఈ సమస్యలు ఆలస్యంగా బయటపడటం వల్ల సరైన సమయంలో చికిత్స అందడంలేదనీ, దాంతో జీవితంలో చాలాకాలం అనారోగ్యంతోనే గడిపేస్తున్నారనీ సర్వే ప్రతినిధులు చెబుతున్నారు.
గుండె సంబంధిత రుగ్మతలు, నెలసరి సమస్యలు, న్యూరో సమస్యలు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఆడవాళ్లలో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయట. ఈ సమస్యలు ఆలస్యంగా వెలుగు చూడటం వల్ల.. వాళ్లు సరైన సమయంలో చికిత్సకు నోచు కోవడం లేదని సర్వేలో వెల్లడైంది. ఫలితంగా నడి వయసు వచ్చేటప్పటికే.. మహిళలు రకరకాల అనారోగ్య సమస్యలతో సావాసం చేయాల్సివస్తున్నదని సర్వేకారులు అభిప్రాయపడుతున్నారు.