మహిషాసురుడు మేరు పర్వతం మీద పదివేల ఏండ్లు ఘోర తపస్సు చేయగా బ్రహ్మ ప్రసన్నుడయ్యాడు. ‘నాకు అమరత్వం కావాల’న్నాడు మహిషుడు. ‘సాధ్యం కాదు’ అన్నాడు బ్రహ్మ. స్త్రీ తననేం చేస్తుందన్న అహంకారంతో ‘దేవుళ్లు, మానవులు, దానవుల వల్ల నాకు చావు కలగకుండు గాక!’ అని వరం అడిగాడు మహిషాసురుడు. బ్రహ్మ ‘తథాస్తు’ అని వరమిచ్చాడు.
మహిషుడు రాక్షసులతో దేవలోకం మీద విరుచుకుపడ్డాడు. దేవతలు ఓడిపోయారు. మహిషుడు ఇంద్ర పదవిని అధిష్ఠించాడు. దేవతలు త్రిమూర్తుల దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నారు. కోపించిన త్రిమూర్తుల నుంచి, ఇంద్రాది దేవతల నుంచి ఒక మహాతేజం ఉద్భవించి, అందులో నుంచి ఓ స్త్రీమూర్తి రూపుదిద్దుకున్నది. ఆమే ఆదిపరాశక్తి. దేవతలందరి తేజస్సే ఆమె శరీరం. వాళ్లంతా తమ తమ ఆయుధాలను అమ్మవారికి ఇచ్చారు. పద్దెనిమిది చేతులలో ఆయుధాలతో, సింహవాహినిగా దుర్గాదేవి సాక్షాత్కరించింది. చక్షరుడు, చామరుడు మొదలైన ఎంతోమంది పరాక్రమం కలిగిన అనుచరులతో మహిషుడి మీదికి యుద్ధానికి ఉపక్రమించింది జగజ్జనని. అసురుణ్ని సంహరించి లోక కల్యాణం చేసింది.
మహిషాసురుడు అంటే జంతు, మానవ ప్రవృత్తులు రెండూ కలగలసిన వాడు. ప్రధానంగా రెండు రూపాలనూ మార్చుకోగలిగిన వాడు. మరెన్నో రూపాలు ధరించి దుర్గాదేవితో యుద్ధం చేశాడు. జన్మతః మహిషుడిది జంతుతత్తమే! సృష్టిలో సత్తరజస్తమో గుణాల రకరకాల నిష్పత్తుల వల్ల జీవులందరూ రూపుదిద్దుకుంటారు. జంతువులు తమో గుణానికి, రాక్షసులు రజో గుణానికి, దేవతలు సత్త్వ గుణానికి ప్రతీకలు. మానవులు ఈ మూడు గుణాలనూ కలిగి ఉంటారు. సత్తగుణం భగవత్ సన్నిధానానికి తీసుకువెళ్లేది. మిగతావి జీవుణ్ని దూరంగా తీసుకువెళ్తాయి. రజస్తమో గుణాలు పెచ్చుపెరిగి సత్త గుణం గలవారిని పీడించినప్పుడు, సత్త్వగుణం కలిగిన వారు చేతులెత్తేసినప్పుడు భగవత్ సన్నిధికి తీసుకువెళ్లేదారి మూసుకుపోతుంది. ఆదర్శం అనేది కనిపించక లోకం అయోమయానికి గురవుతుంది. ధర్మాత్ములైన సత్తగుణం గలవారు దైవాన్ని ఆశ్రయించడం మరచిపోరాదు- ఆశ్రయిస్తే పరతత్వం రూపం ధరించి, దిగివచ్చి సర్దుబాటు చేస్తుందన్నది మహిషాసుర సంహార వృత్తాంత సారాంశం.
l డా॥ వెలుదండ సత్యనారాయణ