నేడు మహావతార్ బాబాజీ స్మృతి దినోత్సవం
ఒక అవతార పురుషుడు సర్వవ్యాపకుడైన పరమాత్మలో జీవిస్తాడని రుజువు చేశాడు మహావతార్ బాబా. ఆయన సజీవ సన్నిధి మూర్తీభవించిన భగవంతుని అమర స్వరూపమే! అది మానవ అవగాహనకు అతీతమైనది. అమరయోగులైన మహావతార్ బాబాజీ తెరచాటున ఉండి మానవాళిని ఉద్ధరించే రక్షకులుగా చాలామంది విశ్వసిస్తారు. ‘ఒక యోగి ఆత్మకథ’ రచయిత పరమహంస యోగానంద మాటల్లో చెప్పాలంటే క్రియా యోగులు అందరికీ మహావతార్ బాబా పరమగురువు.
కాలక్రమంలో మరుగునపడిన క్రియాయోగాన్ని ప్రపంచానికి తెలియజేసింది ఆయనే! క్రియాయోగ బోధనలను వ్యాపింపజేయడానికి తన గురువైన యుక్తేశ్వర్ (లాహిరీ మహాశయుల శిష్యులు) ఆదేశంపై యోగానంద 1917లో భారతదేశంలో ‘యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా’ను స్థాపించారు. 1920లో అమెరికాలో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్ఆర్ఎఫ్)ను నెలకొల్పారు. ఆ యువసన్యాసి 1920లో మహావతార్ బాబాజీ సందర్శించిన శుభ సందర్భానికి గుర్తుగా ఏటా జూలై 25న మహావతార్ బాబాజీ స్మృతి దినోత్సవం నిర్వహిస్తున్నది. క్రియాయోగను విశ్వవ్యాప్తం చేసే క్రమంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. చిత్తశుద్ధి ఉన్న క్రియాయోగులందరినీ వారి లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో కాపాడతానని, మార్గదర్శనం చేస్తానని మహావతార్ బాబాజీ వాగ్దానం చేశారంటారు వారి శిష్యులు. బాబాజీ స్మృతి దినోత్సవం గురించి మరింత
సమాచారం కోసం yssofindia.org వెబ్సైట్ చూడొచ్చు.