శ్రావణ మాసమంతా నోములూ వ్రతాలే. పూజ కోసం ఎంత మంచి చీర కట్టుకున్నా, ఎన్ని నగలు పెట్టుకున్నా ముఖం మెరుస్తుంటేనే పండుగ కళ. అలా అని ఈ హడావుడి సమయంలో ఫేషియల్స్ లాంటివి చేయించుకునేందుకు తీరిక దొరకదు. అలాంటి అతివల కోసం చిటికెలో అయిపోయే ఫేస్‌మాస్క్ ఒకటుంది. తక్కువ పదార్థాలు, తక్కువ సమయం ఎక్కువ మెరుపు… దీని ప్రత్యేకం. ఈ మ్యాజిక్ ఫేస్‌ప్యాక్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు.. తేనె, పెరుగు, రోజ్ వాటర్.
ముందుగా గడ్డ పెరుగు తీసుకోండి. కాస్త పల్చటి పెరుగు అయితే నీళ్లు వంపి పక్కన పెట్టుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల పెరుగుకు ఒక టేబుల్ స్పూన్ తేనె కలపండి. తర్వాత దానికి కొంచెం రోజ్ వాటర్‌ను జోడించి జారైన మిశ్రమంలా చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖం, మెడభాగాలకు పట్టించాలి. ఒక పదిహేను నిమిషాలు ఉంచి, ఆ తర్వాత కడిగేయండి. మెరిసే ముఖం మీ సొంతం అవుతుంది. తేనె, పెరుగు చర్మాన్ని చల్లబరిచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయి. రోజ్ వాటర్ కూడా చర్మాన్ని తేమగా, తాజాగా ఉంచేందుకు సాయపడుతుంది.