రెండేండ్ల క్రితం ఓ యువకుడు మా వీధిలో అద్దెకు దిగాడు. అతని మాటతీరు, ప్రవర్తన నచ్చాయి. కొద్దిరోజుల్లోనే మంచి స్నేహితులమయ్యాం. ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. ప్రేమలోనూ పడ్డాం. ఏడాదిగా డేటింగ్లో ఉన్నాం. తను తరచూ మా ఇంటికి వస్తాడు. అమ్మానాన్న మా స్నేహాన్ని అర్థం చేసుకున్నారు. మా పెండ్లికి పరోక్షంగా ఆమోదం తెలిపారు. తీరా అతణ్ని అడిగితే.. ‘నాకు రెండేండ్ల సమయం కావాలి’ అంటున్నాడు. ఈ మధ్యే ఓ కొత్త విషయం తెలిసింది. గతంలో ఓ అమ్మాయి అతణ్ని మోసం చేసి, వేరొకరిని చేసుకుందట. రెండేండ్లు ఆగినా, ఆ తర్వాత అతను చేసుకోనంటే నా పరిస్థితి ఏమిటి? నేను కూడా తనని మోసం చేస్తానని భయపడుతున్నాడా? రకరకాల ఆలోచనలతో నా బుర్ర బద్దలవుతున్నది. మంచి సలహా ఇవ్వండి. – ఓ సోదరి
అతని కోణంలో ఆలోచిస్తే.. ఆ అభ్యర్థన న్యాయమైనదే అనిపిస్తున్నది. ఒత్తిడి చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నచ్చిన భాగస్వామిని ఎంచుకునే హక్కు ఏ మనిషికైనా ఉంటుంది. ప్రస్తుతం డేటింగ్లో ఉన్నామని చెబుతున్నారు మీరు. ఏ బంధమైనా దృఢంగా ఉంటేనే కలకాలం నిలుస్తుంది. అనుమానాలకు, అపోహలకు తావివ్వకండి. మనసు విప్పి మాట్లాడుకోండి. పాత జ్ఞాపకాల నుంచి బయటపడటానికి అతనికి కొంత సమయం పట్టవచ్చు. ఈ వ్యవధిని సద్వినియోగం చేసుకోండి. జీవితం పట్ల ప్రేమ కల్పించండి. మంచి స్నేహితుల్లా ఉండటానికి ప్రయత్నించండి. గతంలో ఓ అమ్మాయి అతణ్ని మోసం చేసింది కాబట్టి.. ఆమె ఇవ్వలేని నమ్మకాన్ని మీరు ఇవ్వగలగాలి. ఒకర్నొకరు బాగా అర్థం చేసుకోండి.
మీతో జీవితం ఆనందంగా ఉంటుందనే భరోసా ఇవ్వండి. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని చెప్పారు మీరు. తల్లిదండ్రుల కోసమే పెండ్లి చేసుకోవాలనుకుంటే, దయచేసి అతణ్ని మీ జీవితంలోకి ఆహ్వానించకండి. అతనే కావాలనుకుంటే మాత్రం నమ్మకంగా ఓ రెండేండ్లు ఎదురుచూడండి. ఆలోపు అనూహ్య పరిణామాలు ఎదురైనా.. హుందాగా స్వీకరించండి.