బరువు తగ్గడం ఒకెత్తు. పొట్ట భాగంలో కొవ్వును కరిగించుకోవడం మరో ఎత్తు. అయితే.. ఈ కొవ్వుల్ని కరిగించడంలో జపనీయుల వ్యాయామాలు సమర్థంగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. చిన్నచిన్న వ్యాయామాలే.. పెద్దపెద్ద ఫలితాలు ఇస్తాయని చెబుతున్నారు. కేవలం నాలుగు నిమిషాల్లోనే ముగిసే ‘టబాటా వ్యాయామాలు’.. పొట్ట దగ్గరి కొవ్వును సమర్థంగా తగ్గిస్తాయట. ఇందులో 20 సెకన్లు వ్యాయామం చేసి.. 10 సెకన్లు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా ఎనిమిది సార్లు రిపీట్ చేస్తే.. నాలుగు నిమిషాల్లోనే వ్యాయామం పూర్తవుతుంది. లాంజెస్, బర్పీ జంపింగ్, జంప్ స్క్వాట్, పుషప్స్, క్రంచెస్, స్కీ జంప్స్ వంటివన్నీ టబాటా వ్యాయామాలే!
ఈ వ్యాయామాలు పొట్టపై ఎక్కువ ఒత్తిడిని కలుగజేసి, ఆ భాగంలో కొవ్వులను కరిగిస్తాయట. ఇక ఈ వ్యాయామాలు చేయడంలో అనుభవం వచ్చేకొద్దీ.. వ్యాయామం చేసే సమయాన్ని, విశ్రాంతి సమయాన్నీ పెంచుకుంటూ పోవాలని నిపుణుల సలహా. అంటే, 40 సెకన్లు వ్యాయామం చేస్తే.. 20 సెకన్లు విశ్రాంతి తీసుకోవాలన్న మాట. అయితే, తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రభావం చూపే ఈ వర్కవుట్లను ఫిట్నెస్లో అనుభవం ఉన్నవారే చేయాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొత్తగా వ్యాయామాలు ప్రారంభించిన వారు, బీపీ, గుండె సంబంధిత సమస్యలున్న వారు ఈ తరహా వ్యాయామాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.