నిరంతర అభ్యాసంతోనే ఫలితం
ఇక్కడ అర్జునుణ్ని ఉద్దేశించి చెబుతూ కృష్ణపరమాత్మ సాధకులకు అందరికీ హితాన్ని గూర్చుటకై మార్గదర్శనం చేస్తున్నాడు. నిజానికి ప్రపంచంలో సాధకులందరికీ ఒకే విధమైన స్వభావం కానీ, ప్రతిభాపాటవాల స్థాయిగానీ ఉంటాయా? అంటే ఉండవనే చెప్పాలి.
- గీతాసారం
అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్
అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ!
(భగవద్గీత – 12-9)
మనసును సుస్థిరంగా నాయందే నిలుపుటకు సమర్థుడవు కానిచో, అర్జునా! అభ్యాసయోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నించు.. అంటున్నాడు కృష్ణపరమాత్మ.
ఇక్కడ అర్జునుణ్ని ఉద్దేశించి చెబుతూ కృష్ణపరమాత్మ సాధకులకు అందరికీ హితాన్ని గూర్చుటకై మార్గదర్శనం చేస్తున్నాడు. నిజానికి ప్రపంచంలో సాధకులందరికీ ఒకే విధమైన స్వభావం కానీ, ప్రతిభాపాటవాల స్థాయిగానీ ఉంటాయా? అంటే ఉండవనే చెప్పాలి. కాబట్టి, అందరికీ ఒకే మార్గం అనుసరణీయం కాదు. అనుసరించేందుకు అనువుగా కూడా ఉండదు. వివిధ మనస్తత్వాలు కలిగిన సాధకులను వివిధ మార్గాలలో ఉన్నతీకరించేందుకు అవసరమైన ప్రేరణనివ్వాలి. కృష్ణపరమాత్మ ప్రయత్నం ఆ మార్గంలోనే సాగింది.
‘భగవంతునియందే మనసును నిలుపుము’ అంటూ ముందుగా చెప్పినా ఒకవేళ అలా మనసు, బుద్ధి నిలవకపోతే నెమ్మదిగా అభ్యాసం చేస్తూ సాధన చేయాలని ఉపదేశిస్తున్నాడు. లక్ష్యాన్ని సాధించే దిశలో మాటిమాటికీ, క్రమపద్ధతిలో ప్రయత్నించడాన్ని ‘అభ్యాసయోగం’ అంటారు. యోగం అంటే చిత్తవృత్తులను నిరోధించడం లేదా చిత్తాన్ని ఒకే లక్ష్యంపై నిలపడం అని చెప్పవచ్చు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం చేసే సాధనే అభ్యాసయోగం. సరైన దిశలో, సరైన లక్ష్యాన్ని సాధించాలనే తపన తపస్సుగా మారి నిరంతర ప్రయత్నం దానికి తోడైతే ఫలితం సాకారమవుతుంది. ఆధ్యాత్మిక జీవితంలోనైనా లేదా భౌతిక జీవితంలోనైనా ఈ మార్గమే అనుసరణీయం.
ఒక నిర్వాహకుడికి యాజమాన్యం ఒక లక్ష్యాన్ని ఏర్పరచింది. దానిపై ఆ నిర్వాహకుడు మనసును లగ్నం చేసి పని చేయలేకపోతున్నాడు. అప్పుడు యాజమాన్యానికి రెండే మార్గాలు ఉన్నాయి. అతణ్ని తొలగించడం.. లేదా ఆ వ్యక్తికి ప్రేరణనిచ్చి అతను తనలోని ప్రతిభాపాటవాలను, శక్తిసామర్థ్యాలను జాగృతం చేసుకొని ఉపయోగించుకునేందుకు సహకరించడం. కృష్ణపరమాత్మ రెండో మార్గాన్ని ఎన్నుకున్నాడు. భక్తులను లేదా సాధకులను ఏ విధంగానైనా ఉన్నతీకరించాలనే సంకల్పంతో ప్రేరణనిస్తున్నాడు. నిజానికి భౌతిక జీవితంలో ఈ విధానం మానవ వనరులను సరిగా నిర్వహించుకునే పద్ధతికి ప్రతీకగా నిలుస్తుంది.
కార్యనిర్వహణలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్థాయి. ప్రభావవంతమైన పనితీరు రాబట్టాలంటే వారి స్వభావానికి ఉపయుక్తమైన శిక్షణ వారికి అందివ్వాలి. ఉన్న స్థితిని గుర్తించి, సామర్థ్యాన్ని గుర్తించి ఆ స్థాయి నుంచి ఉన్నత స్థాయిని చేరే విధానానికి మార్గం చూపాలి. నిజానికి ఒక స్థాయిలో నిర్వాహకుడు అపజయం పాలైతే అతణ్ని తొలగించడం, లేదా పక్కన పెట్టడం సమంజసం కాదు. ప్రత్యామ్నాయ మార్గం చూపగలగాలి. కోతి చెట్టును ఎక్కగలదు, ఏనుగు బరువులు మోయగలదు. రెండిటినీ ఒకే విధానంలో పనిచేయమనడం వల్ల ఆశించిన ఫలితాలు ఆవిష్కృతం కావు. అందుకని కృష్ణపరమాత్మ బోధిస్తున్న విధంగా ఎవరికి ఏ మార్గం అనువైనదో.. ఏ మార్గంలో అతను తన సమర్థతను సంపూర్ణంగా ఉపయోగించుకోగలడో గుర్తించి ఆ మార్గంలో అతని ఎదుగుదలకు సహకరిస్తే సాధకుని లేదా నిర్వాహకుని వికాసం అభ్యుదయ మార్గంలో విస్తరిస్తుంది. సాధకునికీ, లేదా నిర్వాహకునికీ అది ఉపయోగపడుతుంది.. అలాగే సంస్థ ప్రయోజనమూ సిద్ధిస్తుంది.
సంస్థలో ఒక ఉద్యోగికి నివేదికలను రూపొందించే బాధ్యతను అప్పగించారు. అయితే అనుభవరాహిత్యంతో అతనా బాధ్యతను ఆశించిన స్థాయిలో నిర్వర్తించలేకపోయాడు. అప్పుడా యాజమాన్యం అతనిలోని లోపాలను గుర్తించి, వానిని అధిగమించేందుకు అవసరమైన ప్రేరణను, అవసరమైన శిక్షణను అందించి, పదేపదే సాధన చేసేందుకు అవకాశం ఇచ్చింది. కొంతకాలానికి ఆ ఉద్యోగి తన పనిలో నైపుణ్యాన్ని పెంపొందించుకొని, సమర్థంగా నివేదికలను రూపొందించగలిగాడు.
ఇక్కడ యాజమాన్యం అనుసరించిన విధానం అభ్యాసయోగానికి ఆచరణాత్మక అన్వయంగా భావించవచ్చు. ఉద్యోగి ప్రస్తుత సామర్థ్యాన్ని గుర్తించడం, తగిన శిక్షణనివ్వడం, నిరంతర సాధనకు ప్రోత్సహించడం ద్వారా యాజమాన్యం ఉద్యోగి నుంచి ఆశించిన ఫలితాన్ని సాధించగలిగింది. ఇదే విధానాన్ని భగవంతుడు భక్తునికి ప్రబోధిస్తున్నాడు.
పాలకుర్తి రామమూర్తి…?
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

