కొంతమంది తల్లిదండ్రులు చదువంటే ఇంజినీరింగ్. కాదంటే మెడిసిన్ అంటారు. ఇది తప్పంటే ఒప్పుకోరు. పిల్లలు ఇష్టంలేదంటే ఊరుకోరు. వాళ్లు చెప్పిన ఎంపీసీ, బైపీసీలే చదవాలంటారు. అది పిల్లలకు శిక్ష కాదు, భవిష్యత్‌కు రక్ష అనుకుంటారు. ఆ పరీక్షల్లో ఫెయిలైపోతే జీవితమే ఫెయిలైనట్లుగా ఫీలైపోతారు. ఆ సెంటిమెంట్స్ అన్నీ పక్కనపెట్టి పిల్లల ఇష్టాలకు పెద్దపీట వేయండని పిలుస్తున్నది ‘క్రియేటివ్ కెరీర్స్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2024’ సృజన ఏ ఒక్కరి సొత్తు కాదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది. ఆ టాలెంట్‌కి తగ్గ అవకాశాలు ఎక్కడుంటాయో తెలుసుకోవాలనుకుంటే ‘క్రియేటివ్ కెరీర్స్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2024’కి వెళ్లండి.
ఆ అవకాశాలను కలుసుకునే అవకాశమూ ఉంది. జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డ్, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్‌తోపాటు మరికొన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నాయి. ఫైన్ ఆర్ట్స్, ఫ్యాషన్, డిజైనింగ్ కోర్సులు చదివే విద్యార్థులే కాదు ఏదో ఒక ఆర్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ క్రియేటివ్ సమ్మిట్‌లో పాల్గొనవచ్చు. ఆర్టిస్టులు, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, వీడియో ఎడిటర్లు, యానిమేటర్లు, కంటెంట్ రైటర్లు, డిజైనర్లు.. ఇలా ఆకట్టుకునే పనులు చేసేవాళ్లకు గేమింగ్, యానిమేషన్ రంగాల్లో బోలెడు అవకాశాలున్నాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే క్రియేటర్స్ కోసమే ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. మే 25, 26 తారీఖుల్లో హైదరాబాద్, బేగంపేటలోని మనోహర్ హోటల్లో ఈ సమ్మిట్ జరుగుతుంది. ధైర్యే సాహసే క్రియేటర్ అనుకుంటూ పోయిరండి!