Actor Adil Hussain | ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో మొదటి ప్రయత్నంలోనే దర్శకుడిగా హిట్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచిన డైరెక్టర్ సందీప్ వంగా. ఇదే సినిమాను ‘కబీర్ సింగ్’గా హిందీలోనూ రీమేక్ చేసి అక్కడా హిట్ కొట్టి నిలబడ్డాడు. అంతేకాదు తన మూడో సినిమా ‘యానిమల్’తో రూ.900 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సత్తా చాటుకున్నాడు సందీప్. కాగా, యానిమల్ సినిమా కలెక్షన్ల పరంగా సూపర్ హిట్ అనిపించుకున్నా చాలామంది ఈ చిత్రంపై పెదవి విరిచారు.
‘కబీర్ సింగ్’లో నటించిన ఆదిల్ హుస్సేన్ యానిమల్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. నిజానికి ఆదిల్ ‘కబీర్ సింగ్’తో బాగా పాపులర్ అయ్యారు. కానీ, రిలీజ్ తర్వాత ఆ సినిమాలో నటించినందుకు గిల్టీగా ఫీలవుతున్నానని, సినిమా చూసి సిగ్గుతో తలదించుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఆదిల్ కామెంట్స్‌పై సందీప్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఆదిల్‌కు 30 సినిమాలు చేసినా రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో వచ్చిందని గుర్తు చేశాడు.
సందీప్‌పై కామెంట్స్ మళ్లీ స్పందించాడు ఆదిల్. ‘ఆయనేమైనా తైవాన్ డైరెక్టర్ ఆంగ్ లీ కన్నా ఫేమస్ అనుకుంటున్నాడా? అతను అంతలా ఊహించుకుంటే నేనేం చేయలేను. ‘కబీర్ సింగ్’ కలెక్షన్ల ముచ్చట నాకు అంతగా తెలియదు. కానీ, ఆంగ్ లీ తెరకెక్కించిన ‘లైఫ్ ఆఫ్ పై’ చిత్రం రూ.5,000 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.
ఈ లెక్కల్ని ఆయన సాధిస్తాడని నేను అనుకోవడం లేదు. సందీప్ ఆచితూచి మాట్లాడితే బాగుండేది. ఏదో ఆవేశంలో వాగేశాడు. దాన్ని నేను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించాడు. ‘యానిమల్ సినిమాలో ఏదైనా పాత్ర ఆఫర్ చేస్తే చేసేవారా?’ అని ప్రశ్నిస్తే.. రూ.200 కోట్లు ఇచ్చినా చేసేవాడిని కాదని, అలాంటివి ఎప్పటికీ చేయనని చెప్పుకొచ్చాడు. 2012లో వచ్చిన లైఫ్ ఆఫ్ పై సినిమాలో అదిల్ ఓ పాత్రలో నటించాడు.