Farah Khan | బాలీవుడ్లో స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన షారుఖ్ ‘దీవానా’ సినిమాతో హీరోగా మారాడు. వరుస హిట్లతో బాలీవుడ్ బాద్షాగా ఎదిగాడు. పఠాన్, జవాన్ సినిమాలతో గతేడాది భారీ విజయాలను అందుకున్నాడు. ‘దీవానా’ సినిమాకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన ఫరాఖాన్.. షారుఖ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
‘దీవానా కన్నా ముందు షారుఖ్ ‘కబీ హా కబీ నా’ సినిమాకు సంతకం చేశాడు. ఈ సినిమా అనుకున్న దానికంటే తక్కువ బడ్జెట్లోనే పూర్తయింది. ఆ చిత్రానికీ నేనే కొరియోగ్రాఫర్‌ని. ఇందులో నటించినందుకు షారూఖ్‌కు రూ.25 వేలు ఇచ్చారు. అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ నాకే ఇచ్చారు. ఒక్క పాటకు రూ.5,000 చొప్పున ఆరు పాటలకుగానూ రూ.30,000 పారితోషికం అందుకున్నా. అప్పట్లో అసిస్టెంట్‌ను పెట్టుకునేంత సీన్ కూడా లేదు.
కాబట్టి ఆ జీతం అంతా నేను మాత్రమే తీసుకున్నాను’ అలా.. షారుఖ్ కన్నా తానే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్నానంటూ చెప్పుకొచ్చింది ఫరా. ఈ సినిమా నుంచే షారూఖ్- ఫరా ఖాన్ మధ్య స్నేహ బంధం బలపడింది. తర్వాతికాలంలో ఫరా ఖాన్ దర్శకత్వంలో షారుఖ్ ‘మై హూనా’, ‘ఓం శాంతి ఓం’, ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రాల్లో నటించాడు.