Nitanshi Goel | ‘లాపతా లేడీస్’ సినిమాలో ఫూల్ కుమారీగా అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకున్న నటి నితాంశీ గోయల్. చిన్నప్పటి నుంచే బుల్లితెర, వెండితెరపై రాణిస్తున్నది. సోషల్ మీడియాలోనూ ఆమెకు ఫాలోవర్స్ ఎక్కువే. నోయిడాలో పుట్టి పెరిగిన నితాంశీకి కరాటేలో ప్రవేశం ఉంది. ‘మోహినీ అట్టమ్’లోనూ శిక్షణ పొందింది. శాస్త్రీయ నృత్య పోటీల్లో పాల్గొని బహుమతులూ అందుకుంది. పియానో కూడా వాయిస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నితాంశీ.. ప్రముఖ బ్రాండ్స్‌కి మోడలింగ్ చేసింది.
టీవీ ప్రకటనల్లోనూ నటించింది. తన పేరుతోనే ఓ యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తున్నది. 2022లో యునైటెడ్ బిజినెస్ జర్నల్ ‘ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్30 అండర్ 30’ జాబితాలోనూ చోటు దక్కించుకుంది. చైల్ ఆర్టిస్ట్‌గా ‘వికీ డోనర్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నితాంశీ ‘ఎమ్.ఎస్.ధోనీ: ది అన్టోల్ స్టోరీ’, ‘ఇందూ సర్కార్’ సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకుంది. తాజాగా ‘లాపతా లేడీస్’ సినిమాతో మరోసారి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.
‘లవ్ స్లీప్ రిపీట్’, ‘ఇన్సైడ్ ఎడ్జ్’ వెబ్‌సిరీస్‌లలోనూ సత్తా చాటింది. అంతేకాదు ‘మేరే సప్నే’, ‘నఖ్రా’, ‘హమ్ మిలే థే జాహా’ వంటి మ్యూజిక్ ఆల్బమ్స్‌లో కూడా మెరిసింది. వయసుకు మించిన పరిణితితో రాణిస్తున్న నితాంశీ తనకు ప్రియాంక చోప్రా అంటే చాలా ఇష్టమని చెబుతున్నది. ఆమె సినిమాలు చూస్తూ ఆమె యాక్టింగ్ స్కిల్స్ అబ్జర్వ్ చేస్తూ పెరిగాననీ, ప్రియాంక తనకు ఇన్స్పిరేషన్ అని వెల్లడించింది.