బతుకమ్మ పేర్పులో కలువపూలు ప్రత్యేకం. చెరువుతో కొద్ది పాటి సంబంధం ఉన్న వాళ్లకి కూడా నీటి మీద తేలియాడే తామరాకులు, కలువ తీగలూ సుపరిచితాలే. అయితే ఇక్కడి చిత్రాల్లో ఉన్నది కూడా కలువ తీగే. ప్రపంచంలోనే నీటిలో పెరిగే వాటిలో అతి పెద్ద ఆకులు కలిగి ఉండటం దీని ప్రత్యేకత. విక్టోరియా అమెజానికా, విక్టోరియా వాటర్ లిల్లీగా పిలిచే దీని ఆకులు సుమారు పది అడుగుల వెడల్పుదాకా పెరుగుతాయి. అంతేకాదు, ఇవి చాలా బలమైనవి కూడా.
వీటి మీద చిన్న పిల్లలు, నాజూగ్గా ఉన్న పెద్దవాళ్లు కూడా చక్కగా కూర్చోవచ్చు. దీనిలో మరో చిత్రమూ ఉంది. దీనికి పూసే కలువలు తొలి రోజు తెల్లగా, మర్నాడు గులాబీ రంగులో, తర్వాతి రోజు ఊదా రంగులో ఉంటాయట. తెలుపు రంగు పూలు విరజిమ్మే సువాసనకు వచ్చిన ప్రత్యేక రకానికి చెందిన తుమ్మెదలు, పూలు మూత పడే సమయానికి అందులోనే ఉంటాయట.
మర్నాడు రాత్రి మళ్లీ విచ్చుకునే వేళకు అవి బయటికి ఎగిరిపోతాయి. మరోనాడు మరో పువ్వులో నిద్రపోతూ పరపరాగ సంపర్కానికి ఈ తుమ్మెదలు సాయపడతాయట. ఇంత చిత్రమైన ఈ మొక్క అమెజాన్ నదీ పాయల దగ్గరి మడుగుల్లో తొలుత కనిపించిందట. ప్రస్తుతం మన దేశంలోనూ వీటిని పెంచుతున్నారు. ఇంత పెద్దగా ఉండే ఈ మొక్క ఆకుల్ని చూసి ముచ్చటపడుతున్న కొందరు, ఇదిగో ఇలా వాటి మీద కూర్చుని ఫొటోలు తీసుకుంటున్నారు. ఆకు పడవలో ఊయలలూగుతున్నారు!