సాదా సీదా ప్రజలకు అర్థమయ్యే భాషలో మనిషి ప్రవర్తన గురించి క్రీస్తు అనేక సందర్భాల్లో అనేక విషయాలు బోధించాడు. మనిషి కొత్తగా పుట్టాలని ఆయన కోరుకున్నాడు. ఇది వినడానికి అసాధ్యమైన పనిగా కనిపిస్తుంది. ప్రాణాలతో ఉండగా మనిషి మళ్లీ పుట్టడం ఏంటనిపిస్తుంది. కానీ, ఒకే జన్మలో శారీరకంగా మళ్లీ జన్మించడం అసాధ్యం.
కానీ, క్రీస్తు చెప్పింది.. మనిషి మారాలని. తన పాత జీవితానికి స్వస్తి పలికి, కొత్త జీవితానికి స్వాగతం పలకాలని బోధించాడు. అదే నూతన జన్మ, మళ్లీ కొత్తగా పుట్టడం. ఇది మనిషి ప్రవర్తనలోని మానసిక పరివర్తనకు సంబంధించిన మార్పు. మారు మనసు అనేది వారి జీవితానికి కొత్త ఉషస్సు.
ఇదే మళ్లీ జన్మించడం! ఈ లోకంలో తప్పు చేయని మనిషి ఉండడు. ఆ తప్పును సరిదిద్దుకోవడం అవసరం అనేది క్రీస్తు సందేశం. మానసికంగా పరివర్తన చెంది, పాపభూయిష్టమైన పాత జీవితాన్ని వదిలిపెట్టి ప్రభువు చూపిన దారిలో నడిచిన ఎందరో మహనీయులయ్యారు. వారంతా నిస్సందేహంగా ప్రభువు సాన్నిధ్యాన్ని పొందుతారు.
– ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024