ఆర్థిక స్వాతంత్య్రం అంటే.. డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు! సంపాదించిన డబ్బును స్వతంత్రంగా ఖర్చు పెట్టగలగడం కూడా! దురదృష్టవశాత్తూ.. మనదేశ మహిళల్లో ఈ స్వతంత్రం అంతగా లేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్న మహిళలు.. దానిని స్వేచ్ఛగా ఖర్చు పెట్టలేక పోతున్నారని చెబుతున్నారు.
లైఫ్ ఇన్సూరెన్స్ – 2022లో మహిళల్లో ఆర్థిక స్వాతంత్య్రంపై ఓ సర్వే నిర్వహించింది. ఇందులో 59 శాతం మంది మహిళలు తమ సొంత డబ్బుపై స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేరని తేలింది. 89 శాతం మంది పెళ్లయిన స్త్రీలు.. ఆర్థిక ప్రణాళిక కోసం తమ జీవిత భాగస్వామిపై ఆధారపడతారని సదరు సర్వే పేర్కొన్నది. ఈ అంతరం తగ్గినప్పుడే.. మహిళలు నిజమైన ఆర్థిక స్వాతంత్య్రం సాధించినట్లని నిపుణులు అంటున్నారు. నిజానికి ఆడవాళ్లకు డబ్బుతో ఉండే సంబంధం.. బాల్యం నుంచే రూపుదిద్దుకుంటుంది. చిన్నప్పటి నుంచే వారిని ఆర్థిక సంభాషణలకు దూరంగా ఉంచుతున్నారు. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం పురుషుల పనిగానే చూస్తున్నారు. దాంతో, ఆర్థిక విషయాల్లో మహిళలు వెనకబడుతున్నారు. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో మహిళలకు ఏమాత్రం స్వేచ్ఛ దక్కడం లేదు. అయితే, పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంలో లింగ భేదం లేదు. కానీ, పెట్టుబడుల విషయంలో పురుషులు విఫలమైనప్పుడు.. అందరూ తేలిగ్గానే తీసుకుంటారు. అదే మహిళలు విఫలమైనప్పుడు? తీవ్ర ఛీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. దాంతో, చాలామంది మహిళలు పెట్టుబడులకు దూరంగానే ఉండిపోతున్నారు.
ఇలాంటి పరిస్థితి మారాలనీ, మహిళలూ ఆర్థికంగా చురుగ్గా మారాలనీ నిపుణులు అంటున్నారు. ఇందుకోసం డబ్బు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. ‘ఆర్థిక విషయాల్లో అర్థం కాని పదాలను నోట్ చేసుకోండి. గూగుల్లో వెతకండి. స్నేహితులను అడిగి తెలుసుకోండి. లేకుంటే.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని అడిగినా.. చక్కగా వివరిస్తుంది. అయితే, ఆర్థిక రంగానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, మీరు తెలుసుకొని, అర్థం చేసుకున్న ప్రతిమాటా.. మీలో భయాన్ని దూరం చేస్తుంది. ఆర్థిక విషయాలపై మీకు ధైర్యాన్ని ఇస్తుంది’ అని అంటున్నారు. అప్పుడే, మీ డబ్బును మీరు సొంతంగా ఖర్చుపెట్టడం, పెట్టుబడులకు మళ్లించడం లాంటివి ధైర్యంగా చేస్తారని చెబుతున్నారు.