అందరి సమస్యలూ బాగా తెలిసిన వాడు దేవుడు! అయినా విశ్వాసులు అభ్యర్థించే శైలిని బట్టి దేవుడి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ‘ఆయన ఎంత రహస్యంగా ఉన్నా, ఇంకెంత రహస్యంగా విన్నా, మనల్ని ఆదుకోవాలని తెలిసినా, మన దగ్గరి నుంచి విన్నపం వినయంగా పోవాల్సిందే’ (మ 6:4). రకరకాల వేషధారణలతో లొడలొడా వాగకుండా.. మనోభాషణం సాగించాలని, దేవునితో వ్యక్తిగతంగా ముఖాముఖి సంభాషణ సాగించాలని ప్రభువు బోధ. దీనికి ప్రార్థన అనే పదాన్ని ప్రయోగించారు. ప్రార్థనలో దేవుడి ఉనికిని స్తుతించాలి. ఆయన మనకు చేసిన దానికి కృతజ్ఞత చూపాలి. ‘నీవు చెప్పిన ఆజ్ఞలు జవదాటకుండా, నీ చిత్తానుసారమే నడచుకుంటామయ్యా, అందుకు అనుదినమూ నైతిక బలం అందించుమయ్యా’ అని ఆయన ముందు వేడుకోవాలి. ‘ఈ ప్రార్థనా దీపం హృదయంలో వెలగాలి. ఆ కాంతి మనల్ని చీకటిలోంచి వెలుగులోకి నడిపిస్తుందన్న నమ్మకం ఉండాల’ని ప్రార్థన రహస్యాన్ని ప్రభువు విశదీకరించాడు.
-ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024