విద్యాబోధన అంటే సంవత్సరాల తరబడి మూస పద్ధతిలో సాగే క్రతువు కాదనీ, విద్యార్థుల్ని ఆకట్టుకుని పాఠం పట్టుబడేలా చేసే మార్గం అని నమ్మారు ఈ టీచరమ్మలంతా. అందుకే పాఠాలు చెప్పడంలో తమకంటూ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఆటలు, ఆటవిడుపు పర్యటనల ద్వారా అక్షరాన్ని చేరువ చేసే ప్రయత్నం ఒకరు చేస్తే, మనుషుల మధ్య మాటల్లా పాఠాలను మలిచి అందించారు మరొకరు. సర్టిఫికెట్లు చేతికొచ్చాక ఉద్యోగానికి ఎదురుచూస్తున్న విద్యార్థులకు చేతినిండా పనిదొరికే మార్గాన్ని చూపారు ఇంకొకరు. అలా అని వీళ్లంతా అతి సులభంగా ఆ వృత్తిలోకేం రాలేదు. వైకల్యాలను జయించిన వారు, చిన్ననాడే కుటుంబ బాధ్యతల్ని తలకెత్తుకున్న వారూ ఉన్నారిందులో. ఎన్నో ఒడుదొడుకులకు ఓర్చి మంచి టీచరమ్మలుగా పేరు తెచ్చుకున్న వీళ్లు చెప్పే పాఠాలే కాదు, వాళ్ల జీవిత పాఠాలూ విలువైనవే! ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ సూపర్ టీచరమ్మల విజయాలు తెలుసుకుందాం..
దివ్యాంగురాలినని ఆమె ఎన్నడూ దిగులు చెందలేదు. సంకల్ప బలంతో ముందుకు సాగి కోరుకున్న కొలువు సాధించింది. హిందీ అంటే గుబులెందుకంటూ విద్యార్థులకు ఆ భయాన్ని దూరం చేసింది హైదరాబాద్‌కు చెందిన దుర్గేష్ నందిని. విద్యార్థులకు వినూత్న రీతిలో హిందీని బోధిస్తూనే.. హిందీ సాహిత్యంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నది.
హైదరాబాద్‌కు చెందిన దుర్గేష్ నందిని అందరిలాగానే ఆరోగ్యంగా పుట్టింది. రెండేండ్లు వచ్చే వరకూ అపురూపంగా పెరిగింది. ఆ వయసులోనే టీకా వికటించి నందిని వైకల్యం బారినపడింది. ఆమె సోదరి కూడా టీకా బాధితురాలే! ఊహించని వైకల్యం ఆ అక్కాచెల్లెళ్ల జీవితాన్ని ఒక్కపూటలో మార్చేసింది. నందిని తల్లి కుంగిపోయింది. కొన్నాళ్లకు తేరుకొని.. తన బిడ్డలను ఏ ఇబ్బందీ లేకుండా పెంచాలని నడుం బిగించింది. వృత్తిరీత్యా టీచర్ అయిన ఆమె.. తన పిల్లలకు ఇంట్లోనే పాఠాలు చెప్పేది. పరీక్షలు మాత్రం పాఠశాలలో రాసే ఏర్పాటు చేసింది. తల్లి ప్రోత్సాహంతో చదువుల్లో చక్కగా రాణించింది నందిని. వైకల్యాన్ని అధిగమించే సంకల్ప బలాన్ని పోగు చేసుకుంది. అంచెలంచెలుగా ఎదుగుతూ హిందీ భాషలో పీహెచ్డీ చేసి డాక్టరేట్ పట్టాను పొందింది. తన స్ఫూర్తిదాయక ప్రయాణం నాలుగు గోడల మధ్యనే నిలిచిపోకుండా పట్టుబట్టి టీచర్ కొలువు సాధించింది. 1994 డీఎస్సీలో ప్రభుత్వ పాఠశాల హిందీ టీచర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
ప్రభుత్వ టీచర్‌గా హైదరాబాద్‌లోని స్కూల్లోనే తన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన దుర్గేష్ నందిని వినూత్న పద్ధతుల్లో విద్యాబోధనకు శ్రీకారం చుట్టింది. హిందీ పాఠం అంటే చాలామంది విద్యార్థులకు బెరుకు. ఏదో మార్కుల కోసం హిందీ పుస్తకం పట్టుకునే వాళ్లు తప్ప.. ఆ భాష నేర్చుకోవాలన్న తపన ఉండేది కాదు. నందిని హిందీ ఉపాధ్యాయురాలిగా బడిలో అడుగుపెట్టిన కొన్నాళ్లకే.. హిందీ పీరియడ్ ఎప్పుడెప్పుడా అని విద్యార్థులు ఎదురు చూసేవారు! అంత చక్కగా పాఠం బోధించేదామె. పుస్తకంలో సిలబస్ పూర్తి చేసి.. చేతులు దులుపుకోవడం నందినికి రాదు. ప్రతి దశలోనూ విద్యార్థులను ఇన్వాల్వ్ చేస్తూ పాఠ్యాంశం బోధించేది. హిందీ మాటలు, పాటలు రాయిస్తూ.. ఆ భాషపై విద్యార్థుల్లో ఇష్టం ఏర్పడేలా చేసేది. పాఠాలను డ్రిల్లింగ్ చేయిస్తూ వినూత్నంగా నేర్పేది. దాంతో పిల్లల్లో నందిని టీచర్ మీద, ఆమె బోధించే హిందీ భాష మీదా ప్రత్యేక అభిమానం ఏర్పడింది. ఆమె ఏ బడికి వెళ్లినా.. ఇదే పద్ధతిని పాటిస్తూ వచ్చింది. భాష మీద పట్టు రావడం కోసం విద్యార్థులతో ఇంటర్వ్యూలు చేయించడం, తమ ఆలోచనలను హిందీలో రాయమని చెప్పి ప్రోత్సహించడం లాంటివి చేసేది. విద్యార్థులు రాసిన కవితలను, బొమ్మలను పుస్తకం రూపంలో తెచ్చి.. వారిని సృజనశీలురుగా తీర్చిదిద్దింది.
ఉపాధ్యాయురాలిగా తన వృత్తికి వంద శాతం న్యాయం చేస్తూనే.. రచనావ్యాసంగంలోనూ సత్తా చాటింది దుర్గేష్ నందిని. తన రచనలతో దివ్యాంగుల్లో ఆత్మైస్థెర్యం నింపాలని భావించింది. ఆమె ఆలోచనకు ఇంట్లోవాళ్లూ మద్దతుగా నిలిచారు. తనకిష్టమైన హిందీలోనే రచనలు గావించింది. తనకు ప్రాణప్రదమైన హిందీ భాషలో ఇప్పటివరకు 50కిపైగా పుస్తకాలు రాసింది నందిని. వాటిలో ఐదు పుస్తకాలను తానే పబ్లిష్ చేసింది. ఆమె రచనల్లో ఒకటైన స్వశక్త్ దివ్యాంగ్ పుస్తకం ఎంతో ప్రత్యేకమైనది. మన దేశవ్యాప్తంగా దివ్యాంగులైన 72 మంది విజేతల గెలుపు కథలను అందులో పొందుపరిచింది. ఈ పుస్తకానికి పార్లమెంట్ లైబ్రరీలో చోటు దక్కడం విశేషం. తాను చేస్తున్న హిందీ రచనలకు గాను పలు వరల్డ్ రికార్డులను కైవసం చేసుకుంది. హిందీ భాషలో విద్యార్థుల సామర్థ్యాల పెంపు కోసం నిరంతరం కృషి చేసిన దుర్గేష్ నందిని ప్రస్తుతం ఎస్సీఈఆర్టీలో సేవలు అందిస్తున్నది. ఎంపికైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు హిందీ భాషలోని మెలకువల గురించి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నది. సాధించాలనే తపన ఉంటే.. వైకల్యం అడ్డు కాదంటారు నందిని. భవిష్యత్తులో విద్యార్థులతో హిందీ రచనలు చేయిం చి, వాటితో పుస్తకం తీసుకురావడమే తన లక్ష్యం అంటున్న ఈ టీచరమ్మను సూపర్ అనకుండా ఉండగలమా!
హన్మకొండకు చెందిన నక్క స్నేహలత.. సివిల్ ఇంజినీరింగ్ చేసింది. ఉద్యోగాల కోసం గాలిస్తున్న సమయంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)లో ఖాళీలున్నాయని తెలిసింది. ఆలస్యం చేయకుండా అందులో చేరింది. నిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పించడం న్యాక్ బాధ్యతల్లో ఒకటి. 2007లో ఉమ్మడి వరంగల్ జిల్లా న్యాక్ ఇన్స్పెక్టర్గా విధుల్లోకి చేరిన స్నేహలత.. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి మండల కేంద్రాన్ని తట్టిలేపింది. ములుగు వంటి గ్రామీణ ప్రాంతాలకు సైతం వెళ్లి అక్కడున్న యువతకు న్యాక్ అంటే ఏమిటో తెలియజేసింది. న్యాక్‌తో మాకేంటి అన్నవాళ్లే.. తర్వాత ఆమె పర్యవేక్షణలో శిక్షణ తీసుకొని.. ఉపాధి అవకాశాలు సొంతం చేసుకున్నారు.
యేటా మూడు బ్యాచ్‌ల చొప్పున ఇప్పటివరకు 500కు పైగా బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చింది స్నేహలత. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10,000 మందికిపైగా తర్ఫీదునిచ్చి ధ్రువపత్రాలు అందించింది. స్నేహలత న్యాక్ ట్రైనింగ్ అందరికంటే కాస్త విభిన్నంగా ఉంటుంది. గ్రామీణ నేపథ్యం కలిగిన వారికి శిక్షణనిచ్చే సమయంలో వారి నేపథ్యం తెలుసుకుంటుందామె! అభ్యర్థుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని ట్రైనింగ్ ఇస్తుంది. న్యాక్ డైరెక్టర్ శాంతిశ్రీ ప్రోత్సాహంతో విరివిగా శిక్షణ శిబిరాలు నిర్వహించింది. తనదైన శైలిలో న్యాక్ బోధన చేసినందుకు గాను ఈ ఏడాది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ విభాగంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి పురస్కారానికి ఎంపికైంది స్నేహలత. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనుంది. ప్రస్తుతం హుజురాబాద్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న స్నేహలత ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని చెబుతున్నది. న్యాక్ సేవలను నలుమూలకు చాటి, యువతకు చక్కటి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పనిచేయడమే తన లక్ష్యమని తెలుపుతున్నది.
జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన మారం పవిత్రకు చదువంటే ఎంతో ఇష్టం. మిర్యాలగూడ దగ్గర్లోని తడకమల్ల ఆమె సొంతూరు. ఆమె నాలుగో తరగతి చదువుతున్నప్పుడే తండ్రిని కోల్పోయింది. తల్లి రెక్కల కష్టం మీద ఆ కుటుంబం నడిచింది. సోదరితో కలిసి డిగ్రీ వరకు చదువుకుంది. తన చదువు కొనసాగించడానికి ఒప్పుకొంటేనే పెండ్లికి అంగీకరిస్తానని చెప్పింది. అప్పటికే ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆ అబ్బాయి ఆమె ఇష్టాన్ని గౌరవించాడు. పెండ్లి తర్వాత పవిత్ర బి.ఎడ్, ఎం.ఎడ్ పూర్తి చేసింది. భర్త ప్రోత్సాహంతో డీఎస్సీకి సిద్ధమై.. 2009లో ప్రభుత్వ టీచర్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ప్రస్తుతం ఆమె సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో బయాలజీ టీచర్‌గా పనిచేస్తున్నది.
విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థం చేయడానికి రోల్ ప్లే, బోర్డ్ గేమ్స్, కార్డ్ గేమ్స్, క్షేత్రస్థాయి పర్యటనలు చేయిస్తుంటుంది పవిత్ర. స్కూల్‌కే పరిమితమైన విద్యార్థులను హైదరాబాద్‌లోని సీసీఎంబీ, శ్రీహరికోట లోని ఇస్రోకు స్వయంగా తీసుకెళ్లి.. పిల్లల్లో విజ్ఞానాన్ని నింపే ప్రయత్నాలు చేసింది. మరోవైపు ఓపెన్ స్కూల్ విద్యార్థులకోసం సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాలను రాయడం, టీశాట్ పాఠాల కోసం కంటెంట్ ఇవ్వడం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,9 తరగతుల విద్యార్థుల కోసం వర్క్‌షీట్స్ తయారు చేయడం ఇలా ఎన్నో సేవలు అందిస్తున్నది. దీక్ష పోర్టల్‌లో ఇప్పటివరకు 99 వీడియో పాఠాలను అప్లోడ్ చేసింది. విద్యారంగంలో పవిత్ర చేస్తున్న కృషికి గాను 2021లో సారాభాయ్ టీచర్ సైంటిస్ట్ జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ప్రస్తుతం ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎన్నికై రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్నది. మన జీవితంతో ముడిపడిన సైన్స్‌ను విద్యార్థులు అర్థం చేసుకొని ఆచరించేలా చేయడమే తన బాధ్యత అంటున్నది ఈ టీచరమ్మ.
– పిల్లనగోయిన రాజు
– మహేశ్