పచ్చని పైర్ల మధ్య ఆమె పాట పరిమళిస్తుంది. ఆ గొంతుకకు చల్లగాలి తాళం వేస్తుంది. పని చప్పుళ్ల తాళంలోనే ఆమె స్వరం జోరుగా సాగుతుంది. పనీపాటలను జతచేస్తూ తనదైన శైలిలో పల్లెపాటలకు ప్రాణం పోస్తున్నది గుండెబోయిన ఝాన్సీ. తాతల నుంచీ పుణికిపుచ్చుకున్న గాత్రాన్ని పల్లెగాథలు తెలిపే రాగాలతో జతకట్టిన ఆమె సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. చదువు వ్యవసాయాలను జోడెడ్లలా నడుపుతూ ఉన్న ఊరికీ కన్న వారికీ గుర్తింపు తెస్తున్న ఈ తెలంగాణ మట్టి బిడ్డతో ‘జిందగీ’ మాట కలిపింది.
పాటతో నా అనుబంధం ఎప్పటి నుంచీ అని అడిగితే నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ అని చెబుతా. ఎందుకంటే మా తాతలు, ముత్తాతలు కూడా పాటలు పాడేవారు. ఒగ్గు కథలు, యక్షగానంలాంటి వాటితో పాటు కోతలు, నాట్ల పాటలు, ఇతర జానపదాలూ గానం చేసేవారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి పెద్ద పెద్దగా రాగాలతో మా ముత్తాత పాటలు పాడటం నాకు ఇంకా గుర్తే. చిన్నప్పుడు అవి నన్ను చాలా ఆకర్షించేవి. నేను కూడా వాళ్లలాగా పాడాలి అనుకునేదాన్ని. అందుకే మూడో తరగతి నుంచే పాటలు నేర్చుకుని పాడటం మొదలు పెట్టా.
మాది సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కోమటికుంట గ్రామం. అమ్మ హేమలత. నాన్న సైదులు. మాది వ్యవసాయ కుటుంబం. మేం ముగ్గురం అక్కచెల్లెళ్లం. ఒక తమ్ముడు. నేను మా సూర్యాపేటలోనే బడి చదువు పూర్తి చేశా. డిగ్రీ అయ్యాక ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ చదివా. నేను బడిలో ఉన్నప్పటి నుంచే పాటలు పాడేదాన్ని అని చెప్పా కదా! అప్పుడు రకరకాల పోటీలు జరిగేవి. ఎక్కడికి వెళ్లినా ఫస్ట్ ప్రైజ్ నాకే. ‘ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లననీ…’ అనే పాట బాగా పాడేదాన్ని. ఇక్కడ ఓ విషయం చెప్పాలి. మేం ముగ్గురం ఆడపిల్లలం అయినా.. మా నాన్న ఎప్పుడూ దిగులు పడలేదు. మమ్మల్నీ అట్లా చూడలేదు. వాళ్లే నా బలం అన్నట్టు పెంచారు. నేను కూడా నాన్నతో పాటు వ్యవసాయం చేయడం నేర్చుకున్నా.
చిన్నప్పుడే మోటర్ సైకిల్ నడిపా. ‘పడినా లేస్తది ఏం కాదు తోలనీ…’ అంటుండేవారు నాన్న. ఆ ధైర్యంతోనే తొమ్మిదో తరగతిలోనే ట్రాక్టర్ కూడా నేర్చుకున్నా. ఇప్పుడు మా పొలంలో పనులకు ట్రాక్టర్ నేనే నడుపుతా. కోతలు, నాట్లలాంటి అన్ని పనులూ వచ్చు. సైదులు పిల్లలంటే ఒక బ్రాండు అన్నంత ధైర్యంగా పెరిగాం. నాకు చదువు చదువే, పని పనే. ఆడపిల్లలు కష్టం చేయలేరు… అన్నమాట ఉత్తిదే. మనం ఏదైనా చేయగలం. దానికి నేనే ఉదాహరణ. అది నలుగురికీ స్ఫూర్తిగా ఉండాలని పొలం దగ్గరే నా వీడియోలు పెడతా. నాన్నకు సాయం చేస్తూనే పీజీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్నా. తప్పకుండా సాధిస్తానన్న నమ్మకమూ ఉంది. అక్కలు కూడా అదే దోవలో ఉన్నారు.
నా వీడియోల్లో ఎప్పుడూ పొలం గట్లే కనిపిస్తాయి. నేను కూడా వ్యవసాయానికి సంబంధించిన ఆహార్యంలోనే ఉంటా. నిజానికి ఆ పనిచేస్తూ అలసట వచ్చినప్పుడు పాట పాడితే అదో ఊరటగా ఉంటుంది. అందుకే నాట్లు వేసేటప్పుడు, కోతలు కోసేటప్పుడు పెద్దవాళ్లు పాటలు పాడుతూ పనిచేసేవాళ్లు. నేను కూడా వాళ్ల దగ్గరి నుంచి కొన్ని పాటలు నేర్చుకున్నా. అవి ఎంత సరదాగా ఉంటాయో అంతగా ఆ నేపథ్యానికి సరిపోయేలానూ ఉంటాయి. అంటే, పొలం నీళ్లలో ఉండే జలగల మీదా అందులో పాట ఉంది. ‘పుట్టేడూ నీళ్లల్లో పుట్టిందా జనిగె… ఓ జనిగే… సారేడూ నీళ్లలో సాగిందా జనిగె…’ అంటూ గమ్మత్తుగా సాగుతుందా పాట. మన పెద్దవాళ్లు పొలం గట్లనే తమ పాటలకు నేపథ్యాలుగా చేసుకుని వాటిని అల్లేవారు.
అవన్నీ గుండెలకు హత్తుకుంటూ పనిలో అలసటను పారదోలుతాయి. బావామరదళ్ల పాటలు, పల్లెటూరి పాటలు, రైతుల జీవితాలను తెలిపే పాటలు… ఇలా బాగుందనిపించిన ప్రతి పాటా నేర్చుకున్నా. నేను పాడి రీల్‌గా చేసి సోషల్ మీడియాలో పెడుతుంటే అందరికీ అవి నచ్చుతున్నాయి. ‘బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నరు.. బురదా బట్టల రైతును చూసి దూరంగుండని అన్నరు…’ అంటూ సాగే పాట రైతన్నకు గుండెనిండా వందనాలు చెబుతుంది. ‘ఈ రోజు బురద అంటుతుందని బరిలోకి దిగకపోతే రేపు గొంతులోకి ముద్ద ఎలా దిగుతుంది మిత్రమా..’ అంటూ మట్టి చేతుల్లో నారుతో నేను చేసిన వీడియోకు మంచి స్పందన వచ్చింది. మందు చల్లడం, దుక్కి దున్నడం, పంట పండించడంలో రైతుల కష్టాలు ఎలా ఉంటాయో చెబుతూ వీడియోలు చేస్తుంటాను.
జానపదాలనే కాదు జనాన్ని చైతన్యపరిచే పాటలు, ముందుతరాల త్యాగాలను తెలిపే పాటలు, తెలంగాణ బంగారు గని సింగరేణికి సంబంధించిన పాటలు.. ఇలా ఎన్నో పాడుతుంటా. పాట జనాన్ని ఆలోచింపజేస్తుంది. ఆలోచనను మేల్కొలుపుతుంది. పోరాట యోధుల విలువ తెలుపుతుంది. ఎర్రజెండా పాటలన్నా నాకు అమితమైన ఇష్టం. మొత్తంగా చెప్పాలంటే నాకు 500 పైగా పాటలు వచ్చు. నా గురువు ఎవరు అని అడిగితే ఎవరూ లేరనే చెప్పగలను. ఎక్కడ నచ్చిన పాట విన్నా పట్టేసి అదే విధంగా పాడగలను. నా జీన్స్‌లోనే వచ్చిందేమో అనుకుంటా.
ప్రస్తుతం యూట్యూబ్‌లో చూసి నేర్చుకుంటున్నా. బతుకమ్మ పండుగప్పుడు నేను వచ్చి పాట చెబుతానని ఎదురు చూస్తారు మా వాళ్లంతా. రామనవమికీ మంగళహారతి పాడేది నేనే. మా చుట్టు పక్కల పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు పాటలు పాడేందుకు పిలుస్తారు. కొన్ని పాటల రికార్డింగులూ చేశా. హైదరాబాద్‌లోని ఓ సంస్థ వారి ద్వారా సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా యువరైతు అవార్డు అందుకున్నా.
నా పాట నలుగురికీ చేరాలని 2023లో సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం మొదలు పెట్టాను. తమ్ముడు నాకు ఇందులో బాగా సాయం చేస్తాడు. ప్రస్తుతం సింగర్ ఝాన్సీ పేరిట ఉన్న ఇన్‌స్టా పేజీకి 4 లక్షల 45 వేల మందిదాకా ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్ చానెల్‌కు 2 లక్షల 45 వేల మందికిపైగా సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. ఏ పాట పెట్టినా నన్ను ఎంతో ఆప్యాయంగా ఆదరిస్తారు.
సోషల్ మీడియా వల్ల మా ఊరికి మంచి గుర్తింపు వచ్చింది. ఊళ్లో అందరూ మా తల్లిదండ్రుల్ని మెచ్చుకుంటున్నారు. నా పాటలకు వచ్చిన కామెంట్లలో నాకు బాగా నచ్చింది ఏంటంటే…‘నువ్వు అమ్మాయిని కాదు అమ్మను కన్నవే… మీసం మెలేసి తిరుగన్నా’ అంటూ నాన్నను ఉద్దేశించి ఒకరు పెట్టారు. ‘ఆడబిడ్డల్ని కాదు ఆడపులుల్ని కన్నవన్నా’ అని మరొకరు కామెంట్ చేశారు. నాన్న వీటికి ఎంత మురిసిపోయారో. ఆయన కష్టంలో సాయంగా ఉండాలనే నేను వ్యవసాయం నేర్చుకున్నా. గవర్నమెంటు ఉద్యోగం తెచ్చుకొని అమ్మానాన్నల్ని బాగా చూసుకుంటా. పాటల ప్రయాణం మరింత హుషారుగా కొనసాగిస్తా!