లచ్చింపురం బాపమ్మ బిడ్డెనూ!

పిల్లలను ఎట్లా పెంచాలె? వాళ్లు ఏం జేస్తే తల్లిదండ్రులు ఖుషీ అయితరు? ఎన్కటి జమాన్ల అవ్వయ్యతో పిలగాళ్లు ఎట్లుండేటోళ్లు? అప్పటోళ్ల ముచ్చట్లేంటి? మురిపాలేంటి? లచ్చింపురం బాపమ్మ బిడ్డె కనకవ్వ యాది చేసుకొని చెప్తాంది.!
నా పేరు ఇట్యాల కనకవ్వ. మా ఊరు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి. మేం కాపుదానపొల్లం. ఎవుసాయమే మా ఆదెరువు. అప్పట్ల మాకో పదెకరాల పొలం ఉండేది. నాతోడ యారాండ్లు లేరు. మా ఆయన వెంకటయ్యతోడ నలుగురు ఆడిబిడ్డెలు. ఇంటికి పెద్దదాన్ని కాబట్టి ఏ కార్యమైనా నా చేతిల మీదికెల్లే జరుగుతుండె. పెండ్లీలప్పుడు పెట్టువోతలకు పైసల్లేకపోతే ఉన్నదాంట్లెకెల్లి కొంత భూమి అమ్మేసి పెండ్లీలు చేసినం. ఇగ నాకు ఇద్దరు బిడ్డెలు, ఇద్దరు కొడుకులు. మా వెంకటయ్య సదువుకున్నోడే. ‘టీచర్ నౌకరీ చేద్దువురావయా’ అని సర్కారు అప్పట్ల పిలిశినా పోలేదు. ‘ఏ నాకెందుకే అవ్వా? నాకు పొలం ఉండెనే ఉండె?’ అని ఎవుసాయమే చేస్తాండు.
భయం లేకుండె
మా తల్లిగారి ఊరు లచ్చింపురం. పుట్టింటికాడ కూడా నేనే పెద్ద బిడ్డెను. నాతోడ నలుగురు అక్కచెల్లెండ్లు. పద్నాలుగేండ్ల వయసున్నప్పుడు నాకు పెండ్లయింది. పిల్లలు పెద్దగై వాళ్ల తెలివి వాళ్లకొచ్చినంక పానం నిమ్మళమైంది. ఈ కాలంల అయితే పిలగాళ్లు పుట్టిన కాడ్నుంచీ ఒకటే భయపడ్తాండ్రు. పుట్టక ముందేమో పిల్లల్లేరనే బాధ. పుట్టినంకనేమో ఎట్లుంటరనే బాధ. కొంచెం పెద్దగైనంకనేమో ఏం సంపాదిస్తరో అనే బాధ. ఒక్క బాధనా, ఒక్క కష్టమా? చిన్నపాటి దగ్గో, పడిశమో అయితే కూడా తల్లిదండ్రులకు పెద్ద శెరే అయితాంది. ఇవన్నీ సాలవన్నట్టు ఇంకేదో కరోననంట. ఎవరితోనైనా మాట్లాడాల్నంటెనే భయమైతాంది. ముక్కు, మూతికి ముసుగులేస్కొని కనిపిస్తాండ్రు. ఎన్కటికి గత్తర బీమారి ఎగవడ్డప్పుడు కూడా ఇసొంటి భయం లేకుండె. ఆ జమాన్ల ఉంటేగింటే తిండికి, బట్టకు కష్టముంటుండెగనీ ఈ రోగాలు, నొప్పులెక్కడియి? ఈ బీపీలెక్కడియి? షుగర్లెక్కడివి? మా ఎర్కల ఉప్పులు, పప్పులు లేకపోతే ఒకరితాన ఒకరం బదులు తీస్కునేది. ఇచ్చంత్రం పాడుగానూ ఇప్పుడు ‘వదినె! ఒక బీపీగోళి బదులియ్యి, ఓ అక్కా! షుగర్గోళియ్యి రేపిస్తా’ అని చేతిబదలు తీస్కుంటాండ్రు. ‘తిన్నారుల్లా, పన్నారుల్లా’ అనే మాటలే లేకపాయె.
సంబరమైతాంది!
పిల్లల పెండ్లీలు చేసినం. మనుమలు, మునిమనుమరాండ్లు కూడా అయ్యిండ్రు. అందరూ కల్పితే ముప్పై మందికి పైన్నే ఉంటరుగావచ్చు. మా పెద్ద కొడుకు బాబు ఎవుసాయెం జేత్తాండు. చిన్న కొడుకు వెంకట కిషన్ తైసీల్దార్. మొదాలు టీచర్ కొల్వు సంపాయించిండు. కాయకష్టం చేసి చదివిస్తే టీచరైనందుకు సంతోషించినం. కానీ మా కిషను ఇగురంతోటి అంతకంటే పెద్ద పరీచ్చ ఇచ్చిండు. తైసీల్దార్ నౌకరి కొట్టనే కొట్టిండు. ఒకప్పుడు గిట్లనే ఏదన్నా పనివడితే మేం తైసీలాపీస్కు పోతుంటిమి. ఇప్పుడు మా అసొంటి వాళ్లకెందరికో సమస్యెలు తీర్చేందుకు మా కొడుకు తైసీల్దార్ అయినందుకు మస్తు సంబరమైతాంది. ఏ తల్లిదండ్రైనా కోరుకునేది ఇదేగా? వాళ్ల పిల్లలుకూడా అట్లనే తెల్వికి రావాల్నని సదివిస్తాండ్రు మా కొడుకులు.
వీడియోల ఇచ్చంత్రం
మా అవ్వ పేరు కొట్టె ఆగవ్వ. నిరుడు జరిగిపోయింది. ఆమె మొకం ఎవరికీ తెల్వదుగానీ, ఆమె మాటలు దేశమంతటా తెలుసు. బైటిదేశాలల్ల ఉన్నోళ్లకు కూడా మా అవ్వ మాట తెలుసు. అదేందో టిక్కుటాకు అంట. పెద్ద పెద్ద సీన్మలోళ్లు గూడా మా అవ్వ మాటలతో వీడియోలు చేసిండ్రు. ఇప్పటిగ్గూడా ‘ఆ.. బాపమ్మనే లచ్చింపురం’ అనే మాట ఫోన్లల్ల, కంప్యూటర్ల, ఆట్సప్ల వినిపిస్తాంది. చానామంది ఆమెను చూడనీకె లచ్చింపురం వచ్చిండ్రు కూడా. టిక్కుటాకు లచ్చింపురం బాపమ్మ బిడ్డెను నేను అని చెప్పుకునేంత ఫేమసైంది మా అవ్వ. జనాలు పక్కింటోళ్లకు కూడా మొకం తెల్వకుంట లోపటింట్లనే ఉంటున్న ఈ జమాన్ల ఇసొంటి వీడియోల ద్వారా లోకమంతా గుర్తు వట్టుడంటే గొప్పనే మరి!
… దాయి శ్రీశైలం
ఇవి కూడా చదవండి:
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

