మయోసైటిస్.. అకారణంగా మనిషిపై దాడి చేసే మాయదారి రోగం. నిర్లక్ష్యం చేస్తే కండరాలను కబళిస్తుంది. ఊపిరితిత్తులను చిత్తు చేస్తుంది. నిన్న మొన్నటి వరకూ పెద్దగా వినిపించని ఈ వ్యాధి పేరు.. సినీనటి సమంత ఉదంతంతో చర్చనీయమైంది. ఎవరి నోట విన్నా అదే మాట. ‘మయోసైటిస్ ఎందుకొస్తుంది, ఎవరికొస్తుంది వ్యాధి లక్షణాలేమిటి, ఎలా గుర్తించాలి, చికిత్స ఉందా?’.. ఇలా సగటు మనిషిలో ఎన్నో ప్రశ్నలు. ‘ సమంతకు ఏమైంది? తన ప్రాణానికి ఏమైనా అపాయమా?’ అన్న సందేహం ఒకటి.
మయోసైటిస్.. ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. మన రోగ నిరోధక శక్తి మనపైనే దాడికి తెగబడే విచిత్ర పరిస్థితి. సాధారణంగా ప్రతి మనిషిలో రోగ నిరోధక వ్యవస్థ అంటూ ఉంటుంది. ఆ పటాలం ఒక సైన్యంలా.. వివిధ వ్యాధులతో పోరాడుతూ మనకు రక్షణ కల్పిస్తుంది. కానీ, శత్రువుల పీచమణచాల్సిన సైనికులే.. రాజ్యంపై దాడికి తెగిస్తే? ఇంకేముంది, రక్షణ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఇక్కడ జరిగేదీ అదే. మయోసైటిస్ వ్యాధి స్వభావమూ ఇలాంటిదే. మయోసైటిస్ వల్ల కండరాలు బలహీనపడిపోయి, పూర్తిగా దెబ్బతింటాయి. క్రమంగా ఊపిరి తీసుకునే కండరాలు దెబ్బతిని శ్వాస వ్యవస్థ కుప్పకూలిపోతుంది. భుజాలు, మెడ, చేతులు, కాళ్లు, పొత్తికడుపు, వెన్నెముక కండరాలు.. తీవ్రంగా ప్రభావితం అవుతాయి. చిన్న వస్తువులను కూడా పైకెత్తలేరు. కొన్నిసార్లు లేచి నిలబడటమూ కష్టమే. ఆహారాన్ని మింగడం అసాధ్యంగా అనిపిస్తుంది.
అయిదు రకాలు..
మయోసైటిస్.. ఐదు రకాలుగా ఉంటుంది. ఒక్కోరకం వ్యాధి ఒక్కో శరీర వ్యవస్థను నాశనం చేస్తుంది. చికిత్స ఆలస్యం అయ్యేకొద్దీ మనిషి బతుకును నరకం చేస్తుంది.
డెర్మటో మయోసైటిస్
మయోసైటిస్ తొలుత కండరాలను దెబ్బతీస్తుంది. అక్కడితో ఆగకుండా, చర్మంపై కూడా ప్రభావం చూపితే.. దాన్ని డెర్మటో మయోసైటిస్ అంటారు. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఎవరికైనా రావచ్చు. పిల్లల్లో వస్తే కనుక దాన్ని ‘జువెనైల్ డెర్మటో మయో సైటిస్’గా వ్యవహరిస్తారు. ఈ వ్యాధి దాడికి ప్రత్యేకమైన కారణమంటూ లేదు. ఎందుకో కానీ, పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువ.
పాలి మయోసైటిస్
ఈ రుగ్మతలో కండరాలు మాత్రమే దెబ్బతింటాయి. వయోధికులలో ఎక్కువ. దీనికి ప్రత్యేక కారణాలు కనిపించవు. ఇన్క్లూజన్ బాడీ మయోసైటిస్ సాధారణంగా యాభై ఏండ్లు పైబడిన వారిలోనే ఎక్కువ. దీనికి కూడా ప్రత్యేక కారణాలేవీ నిర్ధారణ కాలేదు.
యాంటీ సింథటిస్ సిండ్రోమ్
ఇక్కడ కండరాలతో పాటు ఊపిరి తిత్తులు కూడా ప్రభావితం అవుతాయి. శ్వాస పీల్చుకోడం అసాధ్యం అవుతుంది.
ఓవర్ లాప్ మయోసైటిస్
ఈ రోగులలో కీళ్ల సమస్యలతోపాటు మయోసైటిస్ లక్షణాలూ ఉంటాయి. ఇది కండరాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు, ఔషధాల వల్ల కూడా మయోసైటిస్ రావచ్చు.
నిర్ధారణ పద్ధతులు
రోగిలో కనిపించే లక్షణాల ఆధారంగా వ్యాధి తీవ్రతను అంచనా వేయవచ్చు.
క్రియాటిన్ ఫాస్పో కైనేస్(సీపీకే), మయోసైటిస్ యాంటీబాడీస్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా గుర్తించవచ్చు.
కండరాల ఎంఆర్ఐ స్కానింగ్. కండరాల బయాప్సీ.
చికిత్సా విధానాలు
భయపడాల్సిన పన్లేదు. కుమిలిపోవాల్సిన అగత్యమూ లేదు. ‘నాకే ఎందుకొచ్చింది?’ అన్న చర్చ అర్థరహితం. ఈ వ్యాధి స్వభావమే అంత. ఎవరినైనా లక్ష్యంగా ఎంచుకోవచ్చు. మనం చేయాల్సిందల్లా ఒక్కటే.. వ్యాధి నిర్ధారణ జరిగిన వెంటనే చికిత్సకు సిద్ధపడాలి. తొలుత స్టిరాయిడ్స్తో వైద్యం ఆరంభిస్తారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే ఇంజెక్షన్ రూపంలో స్టిరాయిడ్స్ ఇస్తారు. తొలిదశలో అధిక మోతాదులో ఇచ్చినా క్రమంగా స్టిరాయిడ్స్ పరిమాణం తగ్గిస్తారు. ఆ తరువాత, దీర్ఘకాలం పాటు ఇమ్యునో సప్రెషన్స్ వాడాల్సి ఉంటుంది.
ఫిజియోథెరపీ వల్ల కూడా కండరాలు బలపడే అవకాశం ఉంటుంది. అయితే, చికిత్సను సక్రమంగా తీసుకోవాలి. మధ్యలోనే ఆపేస్తే కండరాలు పూర్తిగా బలహీనపడతాయి. ఇతర అవయవాలు సైతం దెబ్బతింటాయి. గుండె, ఊపిరితిత్తులు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. వ్యాధి లక్షణాలు నియంత్రణలోకి వచ్చిన తరువాత కూడా చికిత్సను కొనసాగించాల్సిందే. లేకపోతే జబ్బు తిరగబెట్టే ఆస్కారం ఉంది. నిజానికి, మనం అదృష్టవంతులం. వైద్యశాస్త్రం ఎంతో పురోగతిని సాధించింది. ఆధునిక వైద్య విధానాలు, శక్తిమంతమైన మందులు అందుబాటులోకి వచ్చాయి. కొంత సమయం పట్టినా సరే, మయోసైటిస్ నుంచి బయటపడవచ్చు. సాధారణ జీవితం గడపవచ్చు.
నిజమే, మయోసైటిస్ అనేది నరకమే నయమనిపించే వ్యాధి. బతుకు అస్తవ్యస్తం అయిపోతుంది. వృత్తి జీవితం నాశనం అయిపోతుంది. మన కలల్ని కాకెత్తుకెళ్తుంది. అయినా సరే, పోరాడాల్సిందే. మళ్లీ సున్నానుంచి మొదలు పెట్టాల్సిందే. ‘నేను ఈ మహమ్మారిని నా తొలి శత్రువుగా ప్రకటిస్తున్నాను. దానిపై యుద్ధం ప్రారంభిస్తున్నాను. నా జీవితంలో సంతోషాలే కాదు, విషాదాలూ ఉన్నాయి. దీన్ని ఇంకో కష్టంగా భావిస్తాను. తెగబడి పోరాడతాను. అంతేకానీ తలవంచే ప్రసక్తే లేదు’ అంటూ సమంత చేసిన ఆత్మవిశ్వాస ప్రకటన ప్రతి మయోసైటిస్ రోగికీ ఓ ప్రార్థన గీతం.
– డాక్టర్ ఎస్.నయన్ పటేల్
కన్సల్టెంట్ రుమటాలజిస్ట్
స్టార్ హాస్పిటల్, హైదరాబాద్
– మహేశ్వర్రావు బండారి