చెత్తబుట్టలో పడేసే వంటింటి వ్యర్థాలు.. పెరటి మొక్కలకు బలాన్ని ఇస్తాయి. సహజసిద్ధమైన ఎరువుగా పనిచేసి.. మొక్కలు ఏపుగా పెరిగేందుకు సాయపడతాయి. మట్టిసారాన్ని పెంచడంతోపాటు రసాయనాల ముప్పునూ తగ్గిస్తాయి. మరి.. మొక్కల ఎదుగుదలను ప్రోత్సహించే ఆ పదార్థాలేంటో తెలుసుకుందామా!.l ఆరోగ్యానికి మేలుచేసే గ్రీన్ టీ.. మొక్కల ఎదుగుదలలోనూ ముందుంటుంది. వేడినీటిలో ముంచి పక్కన పడేసిన ‘గ్రీన్ టీ’ బ్యాగుల్లోని తేయాకును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇది మొక్కలకు సహజ ఎరువుగా పనిచేస్తుంది. దీన్ని అలాగే మొక్కల మొదళ్లలో వేస్తే సరిపోతుంది. దీంతోపాటు ఒక లీటర్ నీటిలో కొన్ని గ్రీన్ టీ బ్యాగులు వేసి.. కొన్ని గంటల పాటు నాననివ్వాలి. ఆ తర్వాత టీ బ్యాగులను బాగా పిండేసి.. ఆ నీటిని మొక్కలపై పిచికారీ చేయాలి. ఇలా చేస్తే.. మొక్కలు మరింత ఏపుగా పెరుగుతాయి.
మొక్కలను చీడపీడల నుంచి కాపాడటంలో ఉల్లిపొట్టు కీలకపాత్ర పోషిస్తుంది. బయట పడేసే ఉల్లిపొట్టును మొక్కల పొదల్లో వేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఐదు లీటర్ల గోరు వెచ్చని నీటిలో
20 – 30 గ్రా. ఉల్లిపొట్టు వేసి.. నాలుగు రోజులపాటు పక్కన ఉంచాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మొక్కలపై పిచికారీ చేస్తే.. మొక్కలకు బలం వస్తుంది.
తొక్కే కదా!’ అని పారేసే అరటి తొక్కలోనూ.. మొక్కలకు అవసరమయ్యే పోషకాలు ఎన్నో ఉంటాయి. అరటిపండు తొక్కల్ని మొక్కల మొదళ్ల వద్ద వేసి.. దానిమీద కొద్దిగా మట్టిని కప్పాలి. కొన్నిరోజులకు ఆ తొక్కలు మట్టిలో కలిసిపోయి.. ఎరువుగా మారుతాయి. ముఖ్యంగా, పూల మొక్కలు విరివిగా పూసేందుకు ఈ ఎరువు అద్భుతంగా పనిచేస్తుంది.