అటు అందం.. ఇటు అభినయంతో అదరగొడుతున్నది కియారా అద్వానీ. పెళ్లి, ప్రెగ్నెన్సీ కారణంగా కొన్నిరోజులు ఇండస్ట్రీకి, మీడియాకి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. తాజాగా, సోషల్ మీడియాలో హాట్‌హాట్ ఫొటోలు పోస్ట్ చేసి.. నెటిజన్లను తనవైపు తిప్పుకొన్నది. ‘మమ్మీ ఇంటికి వచ్చింది. చాక్లెట్ తెచ్చింది’ అంటూ ఓ కొంటె కొటేషన్ జతచేసి.. తన ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్చేసింది. చాక్లెట్ రంగు డ్రెస్‌లో మెరిసిపోతున్న ఈ అమ్మడి ఫొటోలు.. సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసినవాళ్లంతా.. ‘ఔరా! కియారా!’ అంటున్నారు.
అభిమానులు మొదలుకొని.. తోటి సెలెబ్రిటీల వరకూ కామెంట్లు పెడుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ స్పందిస్తూ.. గార్జియస్ అర్థం వచ్చేలా ‘గార్జి’ అని కామెంట్ పెట్టింది. మరో నాయిక నేహా ధూపియా ‘ఫైర్’ ఎమోజీ పోస్టు చేసింది. ఇక బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ మంచిపేరు తెచ్చుకున్నది కియారా అద్వానీ. తన అసలు పేరు అలియా అద్వానీ. అప్పటికే పరిశ్రమలో అలియా భట్ ఉండటంతో.. తనపేరును ‘కియారా’గా మార్చుకున్నది. 2014లో ‘ఫగ్లీ’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఎం.ఎస్. ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమాలో ‘సాక్షి’ పాత్రలో మెప్పించింది.
కబీర్ సింగ్, షేర్షా సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక మహేష్ బాబు సరసన ‘భరత్ అనే నేను’తో టాలీవుడ్లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వినయ విధేయ రామ, గేమ్ చేంజర్‌లో రామ్‌చరణ్‌తో జతకట్టి.. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం తర్వాత.. 2023లో వీరిద్దరూ పెళ్లిపీటలెక్కారు. ఆ తర్వాత కొన్నిరోజులు సినిమాలకు దూరంగా ఉన్నది కియారా. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. అభిమానులను పలకరిస్తుంటుంది. చివరిగా ‘వార్ 2’ సినిమాలో కియారా మెరిసింది. యశ్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలోనూ కియారా హీరోయిన్గా చేస్తున్నది.