‘మనుషులందరూ స్వార్థపరులే. దయగలిగిన వారు, సహాయం చేయాలన్న తలంపు ఉన్నవారు లేరుగాక లేరు’ అని నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి ఓ మహిళ గట్టిగా నిష్ఠూరపడింది. అదే దారిన వెళ్తున్న ఒక జ్ఞాని అది గమనించాడు. ఆమెను దగ్గరికి పిలిచాడు. ‘అందరూ అలా ఉండరు. మంచి హృదయం, నిజాయతీ ఉన్నవాళ్లు ఎందరో ఈ సమాజంలో ఉన్నారు. నీకు ఆ విషయం అర్థం కావాలంటే నాకు తెలిసిన పాత కథ ఒకటి చెబుతాను విను’ అన్నాడు. ఆమె ఆశ్చర్యపోతూ ‘నిజంగా మంచి మనుషులు ఉన్నారంటారా?’ అని మళ్లీ అడిగింది.
దానికి జ్ఞాని నవ్వి ‘ఒక ఊరిలో ఓ బంగారు వ్యాపారి ఉండేవాడు. ఒక రోజు ఉదయం అతని అంగడి చాలా రద్దీగా ఉంది. అప్పుడే ఒక భిక్షగాడు అక్కడికి వచ్చాడు. ఆ అంగడికి ఏ భిక్షగాడు వచ్చినా ఆ వ్యాపారి భిక్షం వేయకుండా ఉండడు. అలాగే ఆ రోజు కూడా దానం చేశాడు. కానీ వ్యాపార ఒత్తిడిలో గమనించకుండా మామూలు నాణేనికి బదులు ఒక బంగారు నాణేన్ని ఆ భిక్షగాడికి ఇచ్చాడు. భోజన విరామానికని అంగడి కట్టేసే సమయంలో లెక్క చూసుకున్నాడు. పొరపాటుగా భిక్షగాడికి బంగారు నాణేన్ని ఇచ్చేశానని గుర్తించాడు. ఇంతలో అతని భార్య అక్కడికి వచ్చింది. భర్త చేసిన నిర్వాకానికి తిట్ల దండకం అందుకుంది. ఏమి చెయ్యాలో ఆ వ్యాపారికి అర్థం కాలేదు. మధ్యాహ్నం భిక్షగాళ్లందరూ శివాలయం దగ్గర చేరి సేద తీరుతారని తెలుసుకున్నాడు. ఎండలకి అస్సుబుస్సుమని చెమట కార్చుకుంటూ అక్కడికి బయలుదేరాడు.
కొద్దిదూరం నడిచాడో లేదో ఆ భిక్షగాడు ఎదురు వచ్చాడు. ‘తెలియక నేను బంగారు నాణేన్ని ఇచ్చినా.. ఎలా తీసుకొని వెళ్లిపోయావని’ కోపంగా అరవబోయాడు. ఆయితే ఆ భిక్షగాడు వినమ్రంగా నమస్కరించి ‘మీరు పొరపాటుగా నాకు బంగారు నాణేన్ని ఇచ్చారు. ఇంత ఖరీదైన దాన్ని నేను ఏమి చేసుకోను? నాకు కావాల్సింది పూటకు పిడికెడు మెతుకులు. అందుకే నేను మీకు దీన్ని వెనక్కి ఇవ్వడానికి వస్తున్నాను’ అని చెప్పి దాన్ని ఇచ్చేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఆశ్చర్యపోవడం వ్యాపారి వంతు అయ్యింది’ అని కథ చెప్పడం ముగించాడు. జ్ఞాని చెప్పిన కథ విని కొద్దిసేపు ఆలోచనల్లో పడింది ఆ మహిళ. ‘నిజమే.. నాకు ఎదురైన అనుభవాలు, మనుషుల ప్రవర్తన వల్లే నేను ఆ మాటలన్నాను. మంచివారు కొందరైనా ఉండబట్టే ఈ వ్యవస్థ ఇంకా మనుగడ సాగిస్తున్నది. నేను నా ఆలోచనా సరళి మార్చుకోవాల్సి ఉంది’ అని గుర్తించి అక్కడినుంచి వెళ్లిపోయింది.