ప్రతి పున్నమీ పున్నెం పంచేదే! అందులోనూ కార్తిక పౌర్ణమి మరింత విశేషమైనదని పెద్దల మాట. షోడశ కళలతో విరాజిల్లే చంద్రుడు మనసుకు ప్రశాంతత చేకూరుస్తాడు ఆధ్యాత్మిక సౌరభాలు పంచే నిండు పున్నమి విశేషాలివి..
పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కార్తిక పౌర్ణమి. అలాగే విష్ణుమూర్తికి కూడా ఈ రోజు ఇష్టమైనదని భావిస్తారు. ఈ పౌర్ణమినాడే పరమేశ్వరుడు త్రిపురాసురులను సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనిని త్రిపుర పౌర్ణమి అంటారు. దీనినే కైశిక పౌర్ణమి అని కూడా అంటారు. తెలంగాణలో దీనిని జీడికంటి పున్నమిగా వ్యవహరిస్తారు.
కార్తిక పౌర్ణమి నాడు స్త్రీలు ఉదయం నుంచి ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తే విశేష ఫలం లభిస్తుంది. తమిళనాడులో తిరువణ్ణామలైగా ప్రసిద్ధి చెందిన అరుణాచలం కొండమీద ఈ రోజున వెలిగించే అఖండ జ్యోతిని దర్శించడానికి అసంఖ్యాకంగా భక్తులు పోటెత్తుతారు.
‘ఏకస్సర్వదానాని దీపదానం తథైకత’ అని శాస్త్ర వచనం. అంటే అన్ని దానాలు ఒక ఎత్తు దీపదానం ఒక ఎత్తు అని. దీపదానం చేసేవారు స్వయంగా వత్తులను తయారుచేసుకోవాలని సూచించారు పెద్దలు. వరిపిండి, గోధుమపిండితో ప్రమిదను తయారు చేసి ఆవునెయ్యితో దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని పూజించి, నమస్కరించి శైవ వైష్ణవాలయాల్లో దానం చేయాలి. ఇలా దీపదానం చేసిన వారికి సద్గతులు ప్రాప్తిస్తాయని చెబుతారు.
కార్తిక పౌర్ణమి నాడు సాలగ్రామం, ఉసిరికాయలు దానం చేసినా కూడా పాపాలు నశిస్తాయంటారు. అంతేకాదు ఇదే రోజున ఏడాది మొత్తానికి కలిపి 365 వత్తులతో దీపం వెలిగిస్తారు. దీనిని ఆలయంలో గానీ, ఇంట్లోనే దేవుని ముందు, తులసి కోట ఎదుట వెలిగించవచ్చు. ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం. పౌర్ణమి రాత్రి ఆలయ ధ్వజస్తంభానికి వేలాడే ఆకాశ దీపాన్ని దర్శిస్తే సకల శుభాలూ కలుగుతాయని అంటారు.
నైమిశారణ్యంలో కార్తిక పౌర్ణమి నాడు సూత మహర్షి మునులందరితో కలిసి ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసినట్లు కార్తిక పురాణంలో వర్ణించారు. ఉసిరిచెట్టు శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైంది. అందుకే వనభోజనాలకు ఉసిరి చెట్టు నీడ శ్రేష్ఠం. వనభోజనాల ప్రారంభానికి ముందు, ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి, పూజించాలి. ఆ తర్వాత వండిన పదార్థాలను దైవానికి నివేదించి సహపంక్తి భోజనాలు చేయడం సంప్రదాయం.
– శ్రీ భారతి