కర్ణాటకలోని ఉడుపి.. ఆధ్యాత్మిక స్ఫూర్తి కేంద్రం. ద్వైత గురువులు మధ్వాచార్యులు అక్కడ స్థాపించిన అష్టమఠాలు కృష్ణతత్వాన్ని ప్రబోధిస్తున్నాయి. అందులోనూ పెజావర్ మఠం సమాజ సేవను కూడా భుజాని కెత్తుకుంది. హైదరాబాద్ లింగంపల్లి (కాచిగూడ)లోని శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో చాతుర్మాస్య దీక్షలో ఉన్న పెజావర్ మఠం పీఠాధిపతి శ్రీ విశ్వప్రసన్నతీర్థులు..‘ చింతన’ పాఠకులకోసం చేసిన అనుగ్రహ భాషణం..
హైదరాబాద్‌తో మా అనుబంధం ప్రత్యేకమైంది. ఈ నగరం చుట్టూ ఎన్నో ఆలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలు స్వతహాగా చింతనాపరులు. ఇక్కడే మా సంస్కృత విద్యాపీఠం శాఖ ఉంది. అందులోనూ మేం విడిది చేసిన.. రాఘవేంద్రస్వామి సన్నిధానాన్ని మా గురువులు, వారి విద్యా గురువులు ప్రతిష్ఠించారు. అన్నిటికీమించి భగవత్ సంకల్పమూ తోడైంది. కాబట్టే, ఈసారి చాతుర్మాస్య దీక్షను ఇక్కడ చేపట్టాం. దీక్ష అంటే తపస్సు. చాతుర్మాస్య దీక్షలో రెండు నియమాలు. మొదటిది ఆహార నియమం. ఇది అందరికీ వర్తించేది. దీక్షలో భాగంగా తొలి మాసం కాయగూరలను వర్జించాలి. రెండో నెల పెరుగు, మూడో నెల పాలు, నాలుగో నెల కొన్ని రకాల ధాన్యాలను వదిలిపెట్టాలి.
జిహ్వ చాపల్యాన్ని జయించడానికే ఈ నియమాలన్నీ. ఏ రుచికీ మన నాలుక బానిస కాకూడదు. ఏ ఆహారమూ వ్యసనంగా మారకూడదు. చాతుర్మాస్య దీక్ష జిహ్వను జయించే శక్తిని ఇస్తుంది. నాలుక మీద నియంత్రణ సాధిస్తే.. సకల ఇంద్రియాలనూ జయించవచ్చు. దేహానికి, మనసుకు ఇదొక శిక్షణ. రెండో నియమం పూర్తిగా సన్యాసులకే పరిమితమైంది. వర్షకాలంలో విషక్రిములు చైతన్యవంతం అవుతాయి. అంటువ్యాధులు ప్రబలుతాయి. వరదల తాకిడి ఎక్కువే. కాబట్టి, ప్రయాణాలు ప్రమాదకరం. ఆ కారణంతోనే, సర్వసంగ పరిత్యాగులు చాతుర్మాస్య దీక్షలో ఉన్నప్పుడు మఠానికో, ఆలయానికో పరిమితం అవుతారు. పరమాత్ముడు ఈ నాలుగునెలల కాలంలో యోగనిద్రలో ఉంటాడు. ధ్యాన, అధ్యయనాలకు అనువైన సమయం ఇది. భగవత్ చింతనలోనే కాలం గడపాలి. ప్రకృతి విపత్తుల నుంచి మానవాళిని రక్షించమని వేడుకోవాలి.
మహాగురువులు..
మధ్వాచార్యులు కారణజన్ములు, జగద్గురువులు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే.. ధర్మాన్ని నిలబెట్టడానికి మహావిష్ణువు ప్రతి యుగంలోనూ ఓ అవతారాన్ని ధరించాడు. ఆయనతోపాటే జీవోత్తముడైన వాయుదేవుడూ! రామావతారంలో హనుమంతుడిగా, కృష్ణావతారంలో భీమసేనుడిగా పుట్టాడు. కలియుగంలో పరమాత్మ ప్రత్యక్షంగా ఏ అవతారమూ ధరించలేదు. ధర్మ సంస్థాపన బాధ్యతను వాయుదేవుడికి అప్పగించాడు. ఆ ఆదేశం ప్రకారమే.. మధ్వాచార్యులుగా జన్మించాడు. ఆచార్యులవారు ధర్మోద్ధరణకు బయలుదేరిన సమయానికి.. అధర్మం, అరాచకం రాజ్యమేలుతున్నాయి. ఆ అజ్ఞాన తిమిరాన్ని మధ్వాచార్యులు ఛేదించారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలను ప్రామాణికంగా తీసుకుని ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. విష్ణుతత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఉడుపి కేంద్రంగా అష్టమఠాలను స్థాపించారు. అందుకో ఒకటి.. పెజావర్ మఠం. అధోక్షజ తీర్థులు ఈ మఠానికి వ్యవస్థాపక గురువులు. దీంతో అధోక్షజ మఠమనీ వ్యవహరిస్తారు. ఆ పరంపరలో భాగంకావడం నా భాగ్యం. కలియుగంలో అసురులు ఏ ద్వీపాల్లోనో, అడవుల్లోనో లేరు. మన చుట్టే ఉన్నారు. మనలోనే ఉన్నారు. శస్ర్తాలతో రాక్షస సంహారం అసాధ్యం. శాస్త్రంతోనే చెడును ఓడించగలం, మంచిని గెలిపించగలం. శాస్త్రంతో బుద్ధి విప్పారుతుంది. జ్ఞానం వర్ధిల్లుతుంది. మధ్వాచార్యుల సర్వమూల గ్రంథాలు మనిషికి సమ్యక్ మార్గాన్ని బోధిస్తాయి. భక్తి, బాధ్యత – రెండూ ప్రధానమేనంటారు గురువులు. భక్తితో మనసు వికసిస్తుంది, బాధ్యతతో సమాజం బాగుపడుతుంది. మా మఠం తరఫున కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. విద్యాలయాలు నిర్వహిస్తున్నాం. గోసేవ చేస్తున్నాం. వైద్యశాలలు నడిపిస్తున్నాం. మా గురువులు విశ్వేశతీర్థులు నిర్దేశించిన మార్గంలోనే మేమూ నడుస్తున్నాం. ఆయన ఒక ధార్మిక విజ్ఞాన సర్వస్వం. గొప్ప సాధకులు. కృష్ణుడిని తన హృదయ మందిరంలో ప్రతిష్ఠించుకున్న మహాభక్తులు. మానవుడిలోనూ మాధవుడిని చూసిన మానవతావాది.
కృష్ణతత్వమే దిక్సూచి..
ఆధునిక జీవితంలోని అనేకానేక సమస్యలకు ఆధ్యాత్మికతలో పరిష్కారం ఉంది. తాను గుడిగోపురాల్లో మాత్రమే లేనని చెప్పాడు గీతాకృష్ణుడు. సమస్త జీవరాశుల్లోనూ తనను దర్శించుకోమని ఆనతిచ్చాడు. ‘నీ వృత్తి బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించు. అవినీతికి, పక్షపాతానికి తావు ఇవ్వొద్దు. సమాజానికి చెడు చేసిన ప్రతిసారీ, పరమాత్మ పట్ల మహాపచారం చేసినట్టే. సమాజాన్ని దోచుకుని నాకు పుష్పమో, పత్రమో, కానుకలో సమర్పించినంత మాత్రాన.. నీ పాపాలు తొలగిపోవు. నా ప్రియభక్తుడివి అయిపోవు. నా ఆరాధన ఆలయంలో ఆరంభమై సమాజంతో ముగుస్తుంది. అహింస పుష్పం, ఇంద్రియ నిగ్రహ పుష్పం, సర్వభూత దయా పుష్పం, సత్య పుష్పం, జ్ఞాన పుష్పం, భక్తి పుష్పం.. దేవతార్చనకు అవసరమైన అసలు పూజా ద్రవ్యాలు ఇవే’ అని స్పష్టం చేశాడు. ఆ మహోన్నత మానసిక స్థితికి చేరుకోగలిగితే..
ఒత్తిడులు, భయాలు, అభద్రత.. ఒకటేమిటి అరిషడ్వర్గాలనూ సులభంగా జయించవచ్చు. మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి స్నేహితుడిగా, మంచి ఉద్యోగిగా, మంచి పౌరుడిగా పేరు తెచ్చుకోవచ్చు. విగ్రహపూజ కేవలం సాంకేతికం. నిత్యపూజ, సత్యపూజ.. మచ్చలేని నీ జీవన విధానమే. సన్మార్గంలో పయనించే ప్రతి ఒక్కరూ పరమాత్మకు ప్రీతిపాత్రులే.