శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్న్యాస యోగ యుక్తాత్మా విముక్తో మాముపైష్యసి॥
(భగవద్గీత – 9-28) ‘సన్యాస యోగమునందు స్థిరచిత్తుడవై, సమస్త కర్మ ఫలితాలను భగవంతుడనైన నాయందే సమర్పించిన కర్మబంధముల నుంచి విముక్తుడవై చివరగా నన్నే చేరగలవు’ అని అర్జునుడితో
పేర్కొన్నాడు శ్రీకృష్ణుడు.
సాధారణంగా మనమంతా దుఃఖాన్ని దూరం చేయమని, సుఖాలను ప్రసాదించమని భగవంతుడిని ప్రార్థిస్తాం. మనం చేసే పనులు, ఆలోచనలు, ప్రణాళికలు, నిర్ణయాలు కూడా ఆవైపుననే సాగుతాయి. భౌతిక జీవితం సుఖమయం కావాలని, ఆధ్యాత్మిక జీవితం మోక్షాన్ని ప్రసాదించాలని పెద్దలను ఆశ్రయిస్తాం. పూజాదికాలు నిర్వహిస్తుంటాం.. తపిస్తాం. అయితే వీటివల్ల జననమరణ చక్ర బంధం నుంచి విడివడి మోక్షాన్ని పొందుతామా? స్వార్థం, లోభం లాంటివి ఆవరించి పాపకార్యాలు చేసినా.. లోభాదులకు దూరంగా పుణ్యకార్యాలు చేసినా ఆయా కర్మలను అనుసరించి శుభాశుభ ఫలితాలను తప్పనిసరిగా అనుభవించాల్సిందే! జననమరణ బంధనాలకు అతీతమైన జీవితాన్ని గడపాలని ఆశపడటం సహజమే కాని.. మోక్షాన్ని పొందాలనే భావనతో చేసే కర్మలు కూడా బంధనాన్నే కలిగిస్తాయి.
ఎవరైతే కర్మలను కర్తవ్యంగా భావించి, సర్వసమర్పణా భావనతో, భగవంతుడిని సేవిస్తున్నాననే భావనతో.. బాధ్యతగా నిర్వహిస్తారో వారికి ఆ కర్మ ఫలాలపై ఆసక్తి సన్నగిల్లుతుంది. ఫలితంగా మోక్షాన్ని సాధించే అర్హతను పొందుతారు. అన్ని కర్తవ్యాలలో, బాధ్యతల నిర్వహణలో, ఫలితాలను భగవదర్పితం చేయడం వల్ల కర్మ ఫలితాలు తనను చేరవు. ఆ కారణంగా బంధనాలు బాధించవు.
తాను కర్మ చేస్తున్నాని, ఆ ఫలితాలకు తానే బాధ్యుడననే భావనకు దూరమవడం, నిస్వార్థంగా కర్మాచరణ చేయడం వల్ల మాత్రమే విముక్తి కలుగుతుంది. ఫలితాపేక్ష లేకపోవడం వల్ల నిర్దిష్టమైన ఫలితాలను సాధించాలనే ఒత్తిడి నుంచి దూరమవుతాం. తద్వారా చేసే పనిపై పూర్తి దృష్టిని కేంద్రీకరిస్తూ.. ఒత్తిడిని అధిగమించడం అలవడుతుంది. ఈ ఆలోచనా సరళి భౌతిక జీవన పరిమితుల హద్దులు చెరిపివేస్తూ వ్యక్తిలోని అత్యున్నత చైతన్యాన్ని జాగృతం చేసుకునే అవకాశం కలుగుతుంది.
భౌతిక జీవితంలో యాజమాన్య నిర్వహణలో ఫలితం సాధించడం అవసరం. అయితే ప్రక్రియ ఆధారంగా పనిచేసే వ్యక్తికి ఒత్తిడి తగ్గి ఫలితం అయాచితంగానే ఆవిష్కృతం అవుతుంది. ఫలితాలపై మాత్రమే దృష్టిని పెట్టిన సమయంలో వ్యక్తులు అనైతికతకు పాల్పడే అవకాశం ఉంటుంది. ఫలితాపేక్ష లేని కర్మాచరణలో సంక్షోభ సమయంలో కూడా స్థిరంగా, శాంతియుతంగా, సరైన నిర్ణయాలు తీసుకునేందుకు మనసు సన్నద్ధం అవుతుంది.
నిజానికి కర్మాచరణ వల్ల ఫలితాలు, ఫలితాలను అనుసరించి చేసే కర్మలు ఆవిష్కృతం అవుతాయి. కార్య నిర్వహణలో సమస్యలు ఎదురైన సమయంలో వ్యక్తులు ఫలితాపేక్ష లేకుండా చేసే కర్మలలో సమస్యల పట్ల అనుక్రియతో, ఫలితాపేక్షతో చేసే కర్మల పట్ల ప్రతిక్రియతో స్పందిస్తారు. అనుక్రియ వల్ల వ్యూహాత్మకంగా ఉత్తమ నిర్ణయాలు తీసుకోవడం సాధ్యపడుతుంది. ప్రతిక్రియ వల్ల జరిగిన తప్పిదాలతో మరిన్ని తప్పిదాలు జతకడతాయి. ఫలితాపేక్ష లేకపోవడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలను సాధించగలుగుతారు. నిస్వార్థత అలవడి బృందాలతో కలసి పనిచేయడం, పరస్పర భావాలను పంచుకుంటూ.. ఉమ్మడి లక్ష్యాలను ఛేదించేందుకు సన్నద్ధమవడం సాధ్యపడుతుంది.
స్వప్రయోజనాలకు అతీతమైన సహకార ధోరణిలో సంస్థ ప్రయోజనాలకై పనిచేయడం వల్ల ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతారు. నిరంతర విద్యార్థులుగా నేర్చుకుంటూ.. నేర్పించుకుంటూ.. పెంచుకుంటూ.. పంచుకుంటూ.. నైతికత ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకుంటూ.. ఉన్నతమైన పని సంస్కృతిని ఆవిష్కరించడం జరుగుతుంది. దానివల్ల బాహిరంగా సంస్థకు ప్రగతి, వ్యక్తికి ఆంతరంగంలో శాంతి నెలకొనడం వల్ల ప్రశాంతత లభిస్తాయి. ఫలితంగా ఆశించకున్నా ప్రేయస్సు శ్రేయస్సు లభిస్తుంది. అదే అత్యున్నత ప్రేరణగా జీవితం పరిపూర్ణతను సాధించేందుకు.. చివరగా పరమాత్మలో లయమయ్యేందుకు మార్గం చూపుతుంది.
-పాలకుర్తి రామమూర్తి