“ఆడపిల్ల అంటే.. మహిళగా పుట్టడం కాదు, మహిళగా ఎదగాలి!” అని పిలుపునిస్తున్నది నటి, ఎంపీ కంగనా రనౌత్. చిన్నప్పుడు చదివిన ఈ కొటేషన్.. తన జీవితంలో ఇప్పుడు నిజమైందని అంటున్నది. ఇప్పటికే సినిమా, రాజకీయ రంగాల్లో రెండు పడవల ప్రయాణం చేస్తున్న కంగనా.. తాజాగా ఫుడ్ బిజినెస్లోకీ అడుగుపెట్టింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో ఇటీవలే కేఫ్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఓ ఇంగ్లిష్ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తన బాల్య స్మృతులను గుర్తుచేసుకున్నది.
ఆడపిల్లవనీ, ఇంటి పనులకే ఎక్కువ సమయం కేటాయించాలనీ వాళ్ల అమ్మ ఎప్పుడూ చెబుతుండేదట. పచ్చళ్లు పెట్టడం, నెయ్యి తయారు చేయడంతోపాటు కూరగాయలు పండించడం కూడా నేర్చుకోమని చెప్పేదట. “ఆ సమయంలో అమ్మ చెప్పే మాటలు.. నాకు ఏమాత్రం నచ్చేవి కావు. అమ్మ ఏంటి? ఇంత తెలివితక్కువ మాటలు చెబుతుంది అనిపించేది” అంటూ నాటి సంగతులను నెమరువేసుకున్నది కంగనా. “బాల్యం నుంచే ఉన్నత ఆలోచనలతో ఉండేదాన్ని.
దేశంలోనే అతిచిన్న వయసులో ధనవంతురాలైన మహిళల్లో నేను కూడా ఒకదాన్ని అనుకునేదాన్ని. ఇప్పుడు కూడా అదే చెబుతున్నా! ప్రతి మహిళా స్వశక్తితో పైకి రావాలని కోరుకుంటున్నా!” అని చెప్పుకొచ్చింది. “చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలకు అసలైన అర్థం ఏంటో ఇప్పుడు అర్థమైంది. ఇప్పడు నేను కేఫ్‌ను ప్రారంభించాను. నేను పరిణతి చెందానని, తెలివైనదాన్ని అయ్యానని మా అమ్మ భావిస్తుంది. ఈరోజు ఆమె ఎంతో సంతోషంగా ఉంది” అంటూ ముగించింది.