బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన దృశ్యకావ్యం.. పద్మావత్! ఎన్నో వివాదాలు, మరెన్నో మలుపులతో 2018లో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకుపైగా కొల్లగొట్టింది. ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించిన దీపికా పదుకొణె.. అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్.. ‘పద్మావత్’లో దీపిక పోషించిన పాత్ర.. ఏమాత్రం ప్రాధాన్యం లేనిదని చెప్పుకొచ్చింది.
అందుకే.. ఆ పాత్ర చేయమని డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ నుంచి తనకు ఆఫర్ వచ్చినప్పుడు.. సున్నితంగా తిరస్కరించినట్టు వెల్లడించింది. “నాకు మొదట్లోనే ‘పద్మావత్’ ఆఫర్ వచ్చింది. అయితే, స్క్రిప్ట్ ఇవ్వడానికి డైరెక్టర్ నిరాకరించారు. దాంతో, నా పాత్ర ఏమిటని అడిగాను. దానికి ఆయన చెప్పిన సమాధానం.. ‘హీరోయిన్ పాత్ర ఇంతే! ఆమె ముస్తాబవుతున్నప్పుడు ఆమెను హీరో మొదటిసారి అద్దంలో చూస్తాడు!’ అని మాత్రమే చెప్పారు. అంతకుమించి ఏమీ ఉండదనీ అన్నారు.
దాంతో, నేను ఆ సినిమాను తిరస్కరించాను. నేను ఆ సినిమా చూసినప్పుడు కూడా.. డైరెక్టర్ చెప్పింది నిజమే అనిపించింది!” అంటూ చెప్పుకొచ్చింది కంగన. అయితే, ఆమె వ్యాఖ్యలపై ఇంటర్నెట్లో చర్చ మొదలైంది. కంగన మాటలను కొందరు తప్పుపడితే.. మరికొందరు ‘నిజమే కదా!’ అంటున్నారు. పద్మావత్ చిత్రంలో.. పాటలు, క్లయిమాక్స్ మినహా.. సినిమా మొత్తం దీపికా అద్దం ముందు నిలబడి తయారవుతూనే కనిపిస్తుందని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు.
మరోవైపు, ఆ చిత్రంలోని పాటలు, అందులో దీపిక చేసిన నృత్యాలు అద్భుతమని మరికొందరు పొగుడుతుంటే.. దీపిక నటనను ఇంకొందరు ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక కంగన విషయానికి వస్తే.. ఆమె దర్శకత్వం వహించి, నటించిన తాజా సినిమా ‘ఎమర్జెన్సీ’. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో.. 1975 నాటి ‘ఎమర్జెన్సీ’ ఇతివృత్తంగా తెరకెక్కింది. 2023లోనే సినిమా షూటింగ్ పూర్తయినా.. విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఈ జనవరి 17న థియేటర్లలో విడుదలైంది.