కండ్లతోనే కోటి భావాలను పలికించడం.. ఒక్క కాజోల్‌కే చెల్లింది! 90లనాటి కుర్రకారును తన మత్తు కండ్ల మాయలో పడేసి.. ఓలలాడించింది. 30 ఏండ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో మరుపురాని చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నది. అయితే.. పరిశ్రమకు వచ్చిన తొలినాళ్లలోనే నటనను విడిచి పెట్టాలనుకున్నట్లు కాజోల్ చెప్పుకొచ్చింది. తన తాజా చిత్రం ‘దో పట్టి’ ప్రమోషన్లో భాగంగా.. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నది ఈ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్.
మూడో చిత్రంతోనే చిత్రసీమకు గుడ్‌బై చెప్పేద్దామని భావించానని వెల్లడించింది. ఇంకా ఏం చెప్పిందంటే.. ‘నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ‘ఉధార్ కీ జిందగీ’ అనే సినిమా చేశా. అది నా మూడో చిత్రం. అప్పటికి నాకు 18 ఏండ్లు ఉంటాయేమో! అప్పుడు ఇండస్ట్రీ అంతా కొత్తగా అనిపించేది. మూడో సినిమాకే ఎంతో అలసిపోయినట్లు భావించాను. భారీస్థాయి సినిమాలు చేయలేనేమో అనుకునేదాన్ని. దాంతో నటనకు గుడ్‌బై చెప్పాలనుకున్నా! అదే సమయంలో షారూక్ ఖాన్‌తో ‘బాజీగర్’ చేస్తున్నా! అప్పుడే షారుక్ నాకు ఓ అద్భుతమైన సలహా ఇచ్చాడు. అది నాకింకా గుర్తుంది.
‘మీకు నటన తెలుసు. మీరు అద్భుతంగా చేస్తున్నారు. కానీ, ఇంకా నేర్చుకోవాలి!’ అంటూ ప్రోత్సహించాడు. షారుక్ మాటలను స్ఫూర్తిగా తీసుకొనే.. ఇండస్ట్రీలో కొనసాగా!’ అంటూ నాటి విషయాలను గుర్తుచేసుకున్నది కాజోల్. 1992లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కాజోల్.. 90లలో టాప్ హీరోయిన్గా కొనసాగింది. తాజాగా ‘దో పట్టి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ఇందులో కాజోల్ తొలిసారిగా పోలీస్ అధికారి పాత్రలో కనిపిచడం విశేషం.