కెప్టెన్ జాక్‌స్పారో.. ఇప్పటివాళ్లకు అంతగా తెలియకపోవచ్చు. కానీ, రెండు దశాబ్దాల క్రితం.. ఒకతరం సినీ ప్రేక్షకులు అమితంగా అభిమానించిన పేరు. 2003లో మొదలైన ‘పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్’ ఫ్రాంచైజీతో.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కథానాయకుడు జాక్‌స్పారో! ఈ పాత్ర పోషించింది హాలీవుడ్ నటుడు జానీ డెప్. ఒక్క క్యారెక్టర్‌తోనే హాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడుగా నిలిచిపోయాడు.
2017లో వచ్చిన ఈ ఫ్రాంచైజీలోని చివరిచిత్రం ‘డెడ్‌మెన్ టెల్ నో టేల్స్’లో చివరిసారిగా కెప్టెన్ జాక్‌స్పారోగా కనిపించాడు జానీ. మళ్లీ ఇన్నాళ్లకు ఆ ఐకానిక్ పాత్రలో మెరిశాడు. అయితే.. ఇప్పుడు కెప్టెన్ జాక్‌గా మారింది సినిమా కోసం కాదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పలకరించడానికి ఈ అవతారం ఎత్తాడు. ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ ‘డే డ్రింకర్’ చిత్రీకరణ కోసం స్పెయిన్‌లో ఉన్నాడు ఈ హాలీవుడ్ హీరో.
ఈ సందర్భంగా మాడ్రిడ్‌లోని ‘నినో జీసస్ యూనివర్సిటీ చిల్డ్రన్స్ హాస్పిటల్’ను కెప్టెన్ జాక్‌స్పారో పాత్రలో సందర్శించి.. అక్కడి పిల్లలను ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇలా పిల్లల ఆనందం కోసం పనిచేయడం, వారికోసం విలువైన సమయాన్ని కేటాయించినందుకు జానీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
ఎలాంటి ప్రచారం కోరుకోని ‘నిజమైన హీరో’ అంటూ కొనియాడుతున్నారు. అయితే.. జానీడెప్ ఇలా జాక్‌స్పారోగా పిల్లల ఆసుపత్రిని సందర్శించడం ఇదే మొదటిసారి కాదు. 2024లోనూ శాన్ సెబాస్టియన్ (స్పెయిన్)లోని డోనోస్టియా యూనివర్సిటీ ఆసుపత్రినీ ఇలాగే సందర్శించాడు. అక్కడి పిల్లలను పరామర్శించాడు. వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నాడు. అంతకుముందు కూడా.. వాంకూవర్, పారిస్, లండన్, బ్రిస్బేన్తోపాటు అమెరికాలోని అనేక నగరాల్లో ఉన్న దవాఖానలనూ సందర్శించాడు.