టెలికామ్ రంగంలో రిలయన్స్ జియో ఓ సంచలనం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఇదే సంస్థ మరో అద్భుత ప్రయోగానికి తెరతీసింది. కొత్తగా పరిచయం చేసిన జియోకాయిన్ అనే డిజిటల్ టోకెన్‌ను ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేస్తూ సంపాదించొచ్చు. ఈ టోకెన్లు పాలిగాన్ బ్లాక్‌చైన్ అధారంగా డిపాజిట్ అవుతాయి. జియోకాయిన్లను సంపాదించాలంటే, వినియోగదారులు జియోస్ఫియర్ అనే ప్రత్యేక వెబ్ బ్రౌజర్‌ను ఉపయోగించాలి. దీనిద్వారా వారు వివిధ అప్లికేషన్లు వాడుతున్నప్పుడు, టోకెన్లు వినియోగదారుల పాలిగాన్ వాలెట్‌లోకి చేరతాయి. ప్రస్తుతానికి, ఈ బ్రౌజర్ iOS, Android ప్లాట్‌ఫామ్‌లపై అందుబాటులో ఉంది. జియో బ్రౌజర్ వినియోగం ప్రారంభించిన తర్వాత, టోకెన్లు ఆటోమాటిక్‌గా అకౌంట్‌కి జమ అవుతాయి. వీటిని ఎలా రీడీమ్ చేయాలనే వివరాలు ఇప్పటివరకైతే ఆ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, వీటిని రివార్డ్స్ ప్రోగ్రామ్స్‌లో గానీ, జియో ఎకోసిస్టమ్‌లో గానీ కరెన్సీగా ఉపయోగించే అవకాశం ఉందని టెక్నాలజీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కొత్త ప్రయోగం ద్వారా రిలయన్స్ జియో బ్లాక్‌చైన్ టెక్నాలజీని ప్రజల దగ్గరికి తీసుకురావడంలో మరో అడుగు ముందుకేసిందని నిపుణుల మాట. డిజిటల్ టోకెన్లు ఫ్యాషన్‌గా మారుతున్న ఈ రోజుల్లో.. జియోకాయిన్ వినియోగదారులకు కొత్త ఆదాయమార్గాల్ని తెరుస్తున్నదని చెప్పొచ్చు.