e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home జిందగీ గుస్సాడి అమ్మాడి

గుస్సాడి అమ్మాడి

గుస్సాడి అమ్మాడి

బంగారు నందులు ఇంటిదారి పట్టాయి. బంగారం లాంటి కెరీర్‌ బంపర్‌ ఆఫర్లతో ఊరించింది. కానీ, ఆమె మాత్రం అడవి బాట పట్టింది. వనం ఒడిలో స్వచ్ఛంగా వినిపిస్తున్న అడవిబిడ్డల గుండె సడిని ఒడిసి పట్టింది. లయాత్మకంగా సాగే పాదాల విన్యాసాన్ని సచిత్రంగా బంధించింది హైదరాబాద్‌ యువతి జెన్నిఫర్‌ అల్ఫోన్స్‌. గుస్సాడి సంబురంలో తనూ హిస్సా అవుతూ గిరిజనుల పదఘట్టనలను ‘గుస్సాడి సెలబ్రేషన్‌ ఆఫ్‌ బీయింగ్‌ గాడ్‌’ పుస్తకంగా తీర్చిదిద్దింది. లాస్యవిన్యాసాలను ఓ డాక్యుమెంటరీగా మలిచింది. ఫొటోగ్రాఫిక్‌ డాక్యుమెంట్‌నూ రూపొందించింది. సినీరంగంలో తన ప్రత్యేకతను నిరూపించుకుంటానని చెబుతున్న జెన్నిఫర్‌ ‘జిందగీ’తో పంచుకున్న అనుభవాలు..

కథలు చెప్పడమంటే నాకు సరదా. గలగలా మాట్లాడుతూ కావచ్చు, చిత్తరువు చూపుతూ అచ్చెరువొందించేలా కావచ్చు, షార్ట్‌ ఫిల్మ్‌తో కావచ్చు. కథలు చెప్పడమే నా హాబీ. కేవలం సరదాకోసం కాకుండా, సంస్కృతీ సంప్రదాయాలను మిళితం చేస్తూ చెబుతాను. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలోనూ చెప్పగలను. సౌత్‌ ఇండియా అంతా మా ఇంట్లోనే ఉందంటే నమ్మాలి. మా తాత, ముత్తాతలది హైదరాబాదే. నేను పుట్టిందీ, పెరిగిందీ ఇక్కడే! మా నాన్న తమిళియన్‌, అమ్మ మలయాళీ. అలా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మాట్లాడగలను. నాన్న రైల్వేలో చేసేవారు. నేను పదో తరగతిలో ఉండగా నాన్న పోయారు. అమ్మ జూనియర్‌ కాలేజీలో లెక్చరర్‌. నాకు సినిమాలపై ఆసక్తి ఏర్పడటానికి కారణం మాత్రం నాన్నే! సినిమాలే కాదు, అవి తీసే విధానంపైనా నాన్నకు ఆసక్తి ఉండేది. తనతో సినిమాకు వెళ్లినప్పుడు కథ గురించి, దర్శకత్వంలోని టెక్నికల్‌ అంశాల గురించి వివరించేవారు. అలా ఫిల్మ్‌ మేకింగ్‌పై మమకారం ఏర్పడింది.

లైటింగ్‌ టు రైటింగ్‌

డిగ్రీ పూర్తయ్యాక హైదరాబాద్‌లోని సూత్రధార్‌ యాక్టింగ్‌ థియేటర్‌లో ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సు చేశాను. తర్వాత పుణెలోని ప్రతిష్ఠాత్మక ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను. అక్కడ దాదాపు అన్ని విభాగాల్ల్లో శిక్షణ తీసుకున్నా. స్క్రిప్ట్‌ రైటింగ్‌నుంచి లైటింగ్‌
వరకు అన్నిట్లో పట్టు సాధించా. మొదటి ప్రయత్నంగా ‘కచరా’ షార్ట్‌ఫిల్మ్‌ తీశాను. ఈ చిట్టి చిత్రానికి బెస్ట్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ సోషల్‌ రెలవెంట్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ చైల్డ్‌ యాక్టర్‌ .. ఇలా మూడు ‘బంగారు నందులు’ వచ్చాయి. అంతర్జాతీయ పురస్కారాలూ లభించాయి. తర్వాత, మరిన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌ తీశాను. వాటికీ మంచి స్పందన వచ్చింది. ఫిల్మ్‌మేకింగ్‌తోపాటు నాకు ఫొటోగ్రఫీ అన్నా ఇష్టం. చిన్నప్పటి నుంచీ పుస్తకాలు బాగా చదివేదాన్ని. ముఖ్యంగా బొమ్మల పుస్తకాలను ఇష్టపడేదాన్ని. అందుకేనేమో, గుస్సాడి నృత్యంపై బొమ్మల పుస్తకం చేయాలన్న ఆలోచన వచ్చింది. మరోవైపు డాక్యుమెంటరీకూడా నిర్మించాలనుకున్నా. నా మొదటి ఫీచర్‌ డాక్యుమెంటరీ ‘ది టేక్‌ ఓవర్‌’కు 2016లో కెనడా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘రాయల్‌ రీల్‌’ అవార్డు వచ్చింది. అదే ఏడాది కేన్స్‌ షార్ట్‌ ఫిల్మ్‌ కార్నర్‌కు ఎంపికైంది. అంతకు ముందు నిర్మించిన ‘స్ట్రేంజర్స్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ 2014లో కేన్స్‌కు ఎంపికైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా రకరకాల కేటగిరీల్లో 14 ఇంటర్నేషనల్‌ అవార్డులను సంపాదించింది. అలాగే, ‘నాగోబా జాతర’ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కి మెక్సికోలో జరిగిన క్వెట్జల్‌కోల్‌ ఇండిజీనియస్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో మూడు అవార్డులు వచ్చాయి. ఇప్పటివరకు మొత్తం 10 డాక్యుమెంటరీ ఫిల్మ్స్‌ తీశాను.

అడవి బాట

గుస్సాడి నృత్యాన్ని శిల్పారామంలో మొదటిసారి చూశాను. ఆ నాట్యం గురించి అక్కడి వారిని అడిగితే పెద్దగా సమాచారం దొరకలేదు. ఆదిలాబాద్‌ అడవుల్లోకి వెళ్లి గిరిజనులతో మాట్లాడితే గానీ, గుస్సాడి వైభవం తెలియదని అనిపించింది. కొందరు స్నేహితులతో కలిసి ఆదిలాబాద్‌ వెళ్లా. మమ్మల్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు. సరిగ్గా మాట్లాడేవాళ్లూ కాదు. వాళ్లు మమ్మల్ని నమ్మడానికి, వారి ఆచారాల గురించి మాతో పంచుకోవడానికి రెండేండ్లకు పైగా సమయం పట్టింది. అలా డాక్యుమెంటరీ నిర్మాణం మొదలైంది. కానీ, డబ్బులు పెట్టడానికి ఎవరూ ముందుకు రారు. నేను ఫ్రీలాన్స్‌గా చేసే యాడ్స్‌పై వచ్చే డబ్బుతో పని మొదలు
పెట్టాను. ఆ సమయంలోనే గుస్సాడికి సంబంధించిన ఆచారాన్ని పిక్టోరియల్‌ బుక్‌లా తీసుకు రావాలని అనుకున్నాను. శతాబ్దాల సంస్కృతికి చిత్రరూపం ఇస్తే భావితరాలకు గుస్సాడి గొప్పదనం తెలుస్తుందనే ఉద్దేశ్యంతో ‘గుస్సాడి- సెలబ్రేషన్‌ ఆఫ్‌ బీయింగ్‌ గాడ్‌’ పుస్తకం రూపొందించాను. ఈ క్రమంలో సెక్యూరిటీ అనుమతుల విషయంలో అప్పటి ఆదిలాబాద్‌ కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ ఎంతో సాయం చేశారు. అలా, గుస్సాడి జరిగే సమయానికి గిరిజన గూడేల్లోకి వెళ్లి షూట్‌ చేసి డాక్యుమెంటరీ పూర్తి చేశాం.

గుస్సాడి అమ్మాడి

సినిమా స్క్రిప్ట్‌ రెడీ

డాక్యుమెంటరీలు, షార్ట్‌ఫిల్మ్స్‌ నిర్మిస్తూనే ఫ్రీలాన్స్‌గా వాణిజ్య ప్రకటనలు, ప్రభుత్వ అవేర్‌నెస్‌ కార్యక్రమాల ప్రకటనలు కూడా చేస్తుంటాను. వీటితోపాటు చాలా సినిమాలకు దర్శకత్వశాఖలో పనిచేశాను. సొంతంగా ఒక స్క్రిప్ట్‌ రాసుకున్నాను. పరిస్థితులు కుదట పడిన తర్వాత సినిమా దర్శకత్వంపై నిర్ణయం తీసుకుంటా. నాకు దర్శకులు మణిరత్నం, విశ్వనాథ్‌ అంటే ఇష్టం. ‘సాగర సంగమం’ సినిమా చూశాకే భరతనాట్యం నేర్చుకున్నా. నాకు సినిమాలంటే ఎంతిష్టమో, నిజ జీవితానికి అద్దం పట్టే డాక్యుమెంటరీలన్నా అంతే ప్యాషన్‌. భవిష్యత్తులో సినిమాలు తీస్తూనే, డాక్యుమెంటరీలూ నిర్మిస్తాను.

అండగా అమ్మ

పుణెలో ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సు తర్వాత.. డాక్యుమెంటరీలు, షార్ట్‌ఫిల్మ్స్‌ చేస్తానంటే అమ్మ కాస్త భయపడింది. ‘ఇలా సాహసాలు చేస్తూ ఊర్లు తిరగడం ఎందుకు?’ అని బాధ పడింది. కాకపోతే, నా మొదటి షార్ట్‌ ఫిల్మ్‌కు నంది అవార్డు రావడంతో అమ్మ, ఇతర కుటుంబసభ్యులంతా నన్ను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. డాక్యుమెంటరీ మేకింగ్‌ అప్పుడు, క్రౌడ్‌ ఫండింగ్‌కు పిలుపు ఇచ్చాను. ఫేస్‌బుక్‌లో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నా కలల పంట అయిన డాక్యుమెంటరీని ఈ ఏడాది స్క్రీనింగ్‌కి పంపబోతున్నా. అలాగే, గుస్సాడి పుస్తకాన్ని ఏప్రిల్‌ 23న
విడుదల చేశాం. ఈ పుస్తకాన్ని అమెజాన్‌లో అందుబాటులో ఉంచాం. నా రచనను ఆదిలాబాద్‌ జిల్లా ప్రజలకే అంకితమిచ్చాను. దీనిపై వచ్చే ప్రతి రూపాయి గిరిజనులకే చెందేలా ఐటీడీఏ ద్వారా ఓ
అకౌంట్‌ తెరిచాను.

గుస్సాడి అమ్మాడి

నిఖిత నెల్లుట్ల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గుస్సాడి అమ్మాడి

ట్రెండింగ్‌

Advertisement