‘నిద్ర’పై జపాన్ ప్రధానమంత్రి సనే తకైచి వ్యాఖ్యలు.. కొత్త చర్చకు దారితీస్తున్నాయి. తాను రాత్రిపూట రెండు నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతానని తకైచి చెప్పుకొచ్చింది. నిజానికి ఆమె మాటలు జపాన్ పని సంస్కృతికి అద్దం పడుతున్నాయి. అదే సమయంలో ఆరోగ్యంపై చూపే దుష్ప్రభావాలనూ ఎత్తిచూపుతున్నాయి. కాబట్టి, పని-నిద్ర మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. లేకుంటే, ఆరోగ్యంతోపాటు పని నాణ్యత కూడా దెబ్బతింటుందని అంటున్నారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. ప్రతీ ఒక్కరికి ఏడు గంటలు అంతకంటే ఎక్కువ రాత్రినిద్ర తప్పకుండా ఉండాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. లేకుంటే, శరీరంపై తీవ్రప్రభావం చూపుతుంది. ఆ దుష్ప్రభావం పనిమీద కూడా పడుతుంది. నిద్రలేమి వల్ల ఉద్యోగుల్లో ఏకాగ్రత లోపిస్తుంది. దాంతో తప్పులు చేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా పని నాణ్యతతోపాటు ఉత్పాదకత బాగా తగ్గిపోతుంది. డెస్క్ ఉద్యోగాల్లో ఇలాంటి సమస్యలు కనిపిస్తే..
కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు మరోరకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిద్రమత్తు వల్ల పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాకాకుండా ఉండాలంటే.. సరిపడా నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం అవసరం. ప్రతిరోజూ రాత్రి 7-9 గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. నిత్యం ఒకే సమయానికి నిద్రపోవడం-మేల్కోవడం అలవాటు చేసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగాను ఆశ్రయించాలి. సమతుల ఆహారం తీసుకుంటూ, వ్యాయామాన్ని జీవితంలో భాగంగా మార్చుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా.. రాత్రి పూట స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలి. ఇలా, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే.. పనికోసం నిద్ర మానుకోవాల్సిన అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడు నాణ్యమైన ఔట్పుట్ ఇచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.