e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 19, 2021
Advertisement
Home Top Slides పల్లె పాటల.. స్వాతిముత్యం!

పల్లె పాటల.. స్వాతిముత్యం!

పల్లె పాటల.. స్వాతిముత్యం!

పొద్దున నాలుగింటికే.. దినాం గణగణా గంటల సప్పుడు. శంఖం ఊదుతూ ‘తెల తెల్లావారిందీ లేరా కృష్ణా!’ అనే కీర్తనలు. ఓ ఐదేండ్ల అమ్మాయికి ఇదేందో కొత్తగా అనిపించేది. ఈ కథేందో తెలుసుకొని కొద్ది రోజులకు..‘శుభము కలుగు.. జయము కలుగు.. లేరా కృష్ణా!’ అంటూ పాడటం మొదలుపెట్టింది. ఇప్పుడామె పల్లె పాటల స్వాతిముత్యమై జానపద దరువు మోగిస్తున్నది!


పొద్దున్నే.. ‘తెలతెల్లావారింది లేరా కృష్ణా’ అంటూ కీర్తనలు పాడే ఆ కళాకారులు బాలసంతులు. సంక్రాంతికి నెల రోజుల ముందుగానే ఊరూరా తిరుగుతూ తెలవారంగనే నిద్ర లేపుతరు. చిన్నప్పటి నుంచీ బాలసంతుల పాటలు ఇష్టంగా విని, ముచ్చటగా అనుకరించి ఆనందించేది యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు ఆణిముత్యం.. కూరాకుల స్వాతి, రేలారే స్వాతిగా సుపరిచితురాలు. ‘రేలారే’ ప్రోగ్రామ్‌ తర్వాత నాలుగైదేండ్లు తెలుగు టీవీ చానెల్స్‌ను ఉర్రూతలూగించిన స్వాతి ఇప్పుడేం చేస్తున్నది? ఆమె మాటల్లోనే..

భారతక్క స్ఫూర్తి
నాన్న కూరాకుల పున్నయ్య. అమ్మ పుష్పమ్మ. మాది వ్యవసాయ కుటుంబం. నేను అడ్డగూడూరు సర్కారు బడిలో చదువుకున్నా. ఐదేండ్ల వయసు నుంచే జానపదాలంటే ప్రాణం. సంక్రాంతికి ముందుర పొద్దుగాల నాలుగు గంటలకే గంట కొట్టుకుంటూ, శంఖం ఊదుకుంటూ ఊర్లో తిరిగే బాలసంతుల పాటలన్నా, బతుకమ్మ పాటలన్నా చానా ఇష్టం.
‘ఇసొంటి పాటలు పాడ్తదేంది?’ అని ఎవరన్నా ఎక్కిరిస్తరని ఈ పాటలను పొలం కాడనే పాడేదాన్ని. అప్పుడు నేను మూడో తరగతి. స్కూల్లో యాన్యువల్‌ ప్రోగ్రామ్‌ జరుగుతుంది. చీఫ్‌ గెస్ట్‌ ‘నేలమ్మ నేలమ్మ నేలమ్మా నీకు వేలవేల వందనాలమ్మా’ పాట పాడింది. అందరూ చప్పట్లు కొట్టిండ్రు. ఆ ఊపు తగ్గకముందే ‘నా చిట్టీ చేతులు చక్కటి రాతలు నేర్వలేదయ్యో’ అని మల్లొక పాట అందుకుంది. ఒకటే ఈలలు, కేకలు. ‘ఎవరీమె? పాట పాడితే గింత ఆదరణ ఉంటదా?’ అనిపించింది. ఆమె ఎవరో కాదు. సుద్దాల హనుమంతు బిడ్డె, సుద్దాల అశోక్‌ తేజ సార్‌ వాళ్ల చెల్లె భారతి. వాళ్ల ఊరు అడ్డగూడూరుకు దగ్గరే. నేను పాటలు పాడాలని గట్టిగా నిర్ణయించుకోవడానికి భారతక్కనే స్ఫూర్తి.

ఎన్‌సీసీ జట్టుకోసం..
ఊళ్లె ఎవరైనా కొత్త పాట పాడితే, యాదివెట్టుకొని ఇంటికొచ్చి అచ్చం వాళ్లలెక్క పాడుతుంటి. మెల్లగా నా పాట స్కూల్‌దాకా చేరింది. మొదటిసారి ‘ఉందిలే మంచీకాలం ముందుముందూనా’ పాట పాడిన. అందరూ మెచ్చుకున్నరు. స్కూల్ల ఏ చిన్న కార్యక్రమం అయినా నేను పాడాల్సిందే అనే గుర్తింపు సంపాదించుకున్నా. ఒకసారి అమ్మ ఊరికెళ్తుంటే, మల్లతెల్లారేకదా వచ్చేది అని నేనూ వెళ్లిన. ఆ రోజు స్కూల్ల్ల కాంపిటీషన్స్‌. ఊరికాడనే రెండ్రోజులైంది. నేను లేను కాబట్టి, నాకోసం కాంపిటీషన్స్‌ ఆపిండ్రు టీచర్లు. పదో తరగతి అయిపోయినంక భోనగిరి బాలికల కాలేజీలో ఇంటర్‌ చేసిన. చదువు ఒక్కటే కాకుండా జీవితంలో నేర్చుకునేవి చాలా ఉన్నయని తెలిసింది. అదే నన్ను ఎన్‌సీసీ వైపు మళ్లించింది. గణతంత్ర దినోత్సవం రోజున, ఢిల్లీ పరేడ్‌లో పాల్గొనడానికి ఎంపిక చేసిన ప్రత్యేక జట్టులో నాకు అవకాశం వచ్చింది.

బాట చూపిన శీనన్న
హైదరాబాద్‌లో శిక్షణ తర్వాత వరంగల్‌ వెళ్లినం. రిపబ్లిక్‌ డే కల్చరల్‌ యాక్టివిటీస్‌ సెలక్షన్‌ కమిటీ సభ్యులు పాట పాడమని కోరిండ్రు. ‘తయ్యం దత్తయ్యొం తయ్యం దత్తయ్యొం’ పాట పాడిన. ఒకతను నన్ను తారీఫ్‌ చేసిండు. ‘నీ గొంతు నేచురల్‌గా చాలా బాగుందమ్మా. నువ్వు మంచి ఫోక్‌ సింగర్‌ అవుతవు’ అన్నడు. తర్వాత తెలిసింది ఆ పాటను రాసింది అతనే అని. ఆయనెవరో కాదు.. మన వరంగల్‌ శీనన్న. జానపదాల్లో నేర్చుకునేది ఏముంటది? అనే అభిప్రాయం నాది. ‘జానపదాలకు ఇప్పుడు క్రేజ్‌ లేకపోవచ్చు. దానికీ ఒకరోజు వస్తది’ అని చెప్పిండు శీనన్న. ‘యాడా ఉన్నాదో నవ్వుల నాయెంకీ’ పాట పాడి ఆ క్యాంప్‌లో కూడా ఫస్ట్‌ ప్రైజ్‌ కొట్టిన.

సెలక్షన్స్‌ అయిపోయిన తర్వాత వరంగల్‌ శీనన్నకు మా బాబాయ్‌ ఫోన్‌ నంబర్‌ ఇచ్చి ఇంటికొచ్చిన. కొద్ది రోజులకు అన్న నుంచి కాల్‌ వచ్చింది. ‘అరే చెల్లె.. రేలారే రేలా సెలక్షన్స్‌ జరుగుతున్నయి. మంచి అవకాశం వెళ్లు’ అని చెప్పిండన్న. ‘నాకు సంగీతం రాదాయె. నావల్ల అవుతుందా’ అని అంటే, ‘సంగీతం అవసరం లేదు. ఒరిజినల్‌ పల్లె పదాలే ఉంటయి. నీ గొంతుకు అవే కరెక్టు’ అని ఒప్పించి పంపించిండు.

అమీర్‌పేటలోని సారథి స్టూడియోకు వెళ్తే సెలక్షన్స్‌ అయిపోయినయి. డైరెక్టర్‌ స్టయిల్‌ సురేష్‌ సార్‌ను రిక్వెస్ట్‌ చేస్తే ఒక అవకాశం ఇచ్చిండ్రు. నా పాటలు నచ్చి ఓకే చేసిండ్రు. స్టూడియో రౌండ్‌లో ‘వట్టిశాపల కూర ఒడిపిల మెతుకులు’ పాట పాడిన. రేలారే కాంపిటీషన్‌లో మొదటి పాటగా ‘తూర్పూ దేశాన తూర్పూ దేశాన’ పాడిన. ఇది చంద్రయ్యగారు ఇచ్చిన రాయలసీమ జానపదం.

‘రేలారే’ టైటిల్‌ నాదే
కొప్పు పెట్టిండ్రు, చీర కట్టించిండ్రు. ‘ఈ గెటప్‌ ఏంది సార్‌’ అని అడిగిన. ‘ఎపిసోడ్‌ తర్వాత తెలుస్తది’ అని సురేష్‌ సార్‌ నచ్చజెప్పిండు. నిజంగనే, ఒక ఎపిసోడ్‌ తర్వాత నా పేరు మార్మోగిపోయింది. అమెరికా వంటి దేశాలల్ల నుంచి కూడా కాల్‌ చేసి ‘కూరాకులోల్ల అమ్మాయి మాటీవీల మస్తు పాడుతుంది’ అని మెచ్చుకున్నరు. విన్నర్‌ అవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నా. రేలారేలో 25కు పైగా పాటలు పాడిన. వరంగల్‌ శీనన్న నేర్పించిన ‘పచ్చి సాపల కూర పట్టుకొచ్చినా రారా’ మంచిపేరు తీసుకొచ్చింది.

‘నాగలిదున్నేటి బంగారు మరిది.. సద్దాడ వెట్టాన్నో మరిది’ వంటి పాటలతో అలరించిన. వరంగల్‌లో ఫైనల్స్‌. ఇసుకేస్తే రాలనంత జనం. అంతమందిలోనూ తొణకకుండా, బెణకకుండా ‘రాగిచెట్టెక్కేడు రాగాలు తీసేడు’ పాట పాడి టైటిల్‌ కొట్టిన. ఈ పాటను మా ఊరి బండి కేతమ్మ దగ్గర సేకరించిన. రేలారే కార్యక్రమం తర్వాత మాటీవీ వాళ్లు వరంగల్‌, విజయనగరం, కడప, నిజామాబాద్‌లలో ఈవెంట్స్‌ నిర్వహించిండ్రు.

పల్లె పాటల.. స్వాతిముత్యం!

ఎక్కడికి వెళ్లినా జనాలు ‘ఆటోగ్రాఫ్‌ కావాలి’ అంటుంటే.. ‘నేనేంటీ ఆటోగ్రాఫ్‌ ఇవ్వడమేంటి?’ అని ఇవ్వలేదు. డైరెక్టర్‌ సార్‌ ‘మీకు జనాల్లో మస్త్‌ క్రేజ్‌ ఉంది. ఆటోగ్రాఫ్‌ ఇస్తే తప్పేముంది?’ అంటుండె. తర్వాత ‘సూపర్‌ సింగర్‌’ పెట్టిండ్రు. సినిమా పాటలు పాడే శ్రీకృష్ణ, అంజనా సౌమ్య వంటివాళ్లతో పోటీ పడటం వల్ల చాలా నేర్చుకున్నా. దీనివల్లనే ఆలీ సినిమాలో ‘చీరల్లేవు రైకల్లేవు రాతో నా రాతా’ అనే పాట పాడే అవకాశం వచ్చింది. తర్వాత ఓ తమిళ సినిమాలో, ‘యమలోకంలో తెలంగాణ’ సినిమాలో ఫోక్‌ బిట్స్‌ పాడనీకె అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘సూపర్‌ సింగర్‌-4 మొదలైంది. మధ్యలో నుంచే తప్పుకొన్నా.

మరచిపోలేని సందర్భం
తెలంగాణ వచ్చినంక హెచ్‌ఎంటీవీలో ‘మార్మోగిన పాట’, టీన్యూస్‌లో ‘దరువు’, ‘రేలారే రేలా’ కార్యక్రమాల్లో పాల్గొన్న. తర్వాత పెండ్లి అయింది. టీన్యూస్‌కు ఒక ఐదేండ్లు ప్రోగ్రామ్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన. తెలంగాణ రాకముందు, చానెల్‌ పెట్టేటప్పుడు ప్రోమోల కోసం కేసీఆర్‌గారు అశోక్‌ తేజ సార్‌తో నన్ను పిలిపించిండ్రు. తీరొక్క పాటలు పాడి వినిపించిన. సార్‌ చాలా సలహాలిచ్చి ప్రోమోల కోసం కావాల్సినవి రాబట్టుకున్నరు. ‘ఖాళీగా ఉన్నప్పుడు మన టీవీల పనిచెయ్‌’ అని చెప్పడంతో నేను టీన్యూస్‌లో ప్రోగ్రామ్‌ ప్రొడ్యూసర్‌గా చేసిన. ఇది నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని విషయం. పాప పుట్టిన తర్వాత కొంతకాలం బ్రేక్‌ తీసుకున్నా. ఇప్పుడు యూట్యూబ్‌ చానెల్స్‌కోసం పాడుతున్నా. జానపదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా.

జానపదంలో జీవం ఉంటది
ఇప్పటివరకు నేను వేదికలమీద పాడిన జానపదాలనే యూట్యూబ్‌ ద్వారా మళ్లీ తీసుకురావాలని అనుకుంటున్నా. ఇంకా, నా దగ్గర సేకరించి పెట్టుకున్న పాటలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ జనాలకు చేరవేయడమే నా లక్ష్యం. అయితే నేను సేకరించి, గుర్తింపు తీసుకొచ్చిన చాలా పాటలను కొందరు నా అనుమతి లేకుండనే ఇష్టమొచ్చినట్లు వాడుకుంటున్నరు. ఇది తప్పు. జానపదాలను ధ్వంసం చేయొద్దు. ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం పాడటం కాదు. జానపదాల్లో ఒక జీవం ఉంటది. అది పోగొడుతున్నరు. సినిమాలకు పనికొచ్చే స్వచ్ఛమైన జానపదాలు నా దగ్గర ఉన్నయి. సంప్రదిస్తే ఇవ్వడానికి రెడీగా ఉన్నా.

పల్లె పాటల.. స్వాతిముత్యం!


ఉద్యమంలో పాటనై..
‘సూపర్‌ సింగర్‌-4’ మంచి అవకాశమే. కానీ అప్పటికే తెలంగాణ ఉద్యమం మొదలైంది. నాకు ఉద్యమమే ముఖ్యం అనుకున్నా. శివనాగులు, గంగ ఇంకా ఫ్రెండ్స్‌తో కలిసి ఉద్యమంలోకి వెళ్లిన. మొదట్లో గోరటి వెంకన్న సార్‌ గ్రూప్‌లో ఉంటుంటి. తర్వాత మేమే ఒక గ్రూప్‌గా ఏర్పడి ఈవెంట్స్‌ చేసినం. కాలికి గజ్జెకట్టి తెలంగాణ ధూమ్‌ధామ్‌ల మీద ఎగిరి దుంకిన. ఆకలి, దూపలను సైతం పక్కనపెట్టి ముందుకు కదిలిన. ‘కట్టు కట్టర బండీ.. తెలంగాణ బండీ.. బండీ ఆపుర పిలగో రాములయ్యా.. నేనొస్తర పిలగో రాములయ్యా’ అంటూ ఉద్యమానికి ఊతమైనం. శ్రీకాంతచారి ఆత్మబలిదానం చేసుకున్నప్పుడు మోత్కూరులో నిర్వహించిన భారీ ర్యాలీని నా పాటలతో ముందుకు సాగించిన.

Advertisement
పల్లె పాటల.. స్వాతిముత్యం!

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement