ఒకటి నుంచి పదో తరగతి వరకూ ఉన్న పాఠ్యపుస్తకాల్లో ఆమె రాసిన గేయాలుంటాయి. ఆమె దగ్గర శిష్యరికం చేస్తే.. ఓనమాలు నేర్పి, గేయాలు పాడించి, పాఠాలు చదివించడమే కాదు గేయాలు రాయిస్తుంది. కథలు చెప్పిస్తుంది. కవుల్ని తయారు చేస్తుంది. సంస్కృత, తెలుగు భాషలోని న్యాయాలపై వ్యాఖ్యానిస్తూ
భాషకు కొత్త భాష్యం చెబుతున్నది ఉపాధ్యాయిని వురిమళ్ల సునంద. ఈ ఏడాది తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారం అందుకున్న సునంద ఎనిమిది పుస్తకాలు రాసింది. పిల్లలతో పదిహేడు పుస్తకాలు రాయించింది. పదో తరగతి వరకే పాఠాలు విన్న సునంద ఇన్ని పాఠాలు చెప్పే టీచరయిందెలాగో
జిందగీతో పంచుకున్న ముచ్చట్లివి..
మా నాన్న వురిమళ్ల సోమాచారి ఉపాధ్యాయుడు. ఉద్యోగరీత్యా వేర్వేరు ఊళ్లకు బదిలీ అయ్యేది. మా నాయనమ్మను చూసుకునేందుకు మా ఊరు సిరికొండ (మోతె మండలం, సూర్యాపేట జిల్లా)లో ఉండి చదువుకున్నాను. మా తాత వురిమళ్ల శ్రీరాములు గారు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. తనకు రాజకీయాలతోపాటు సాహిత్యం ఇష్టం. శతకాలు, రామాయణం, భారతం, పురాణాలు ఇంట్లో ఉండేవి. అవి చిన్నప్పుడే చదివాను. మా స్కూల్ లైబ్రరీలో ఉండే చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు పత్రికలు, కథల పుస్తకాలు చదివాను. పదోతరగతి నాటికే విశ్వనాథ, యద్ధనపూడి రచనలు చదివాను.
ఊళ్లో బాల్య వివాహాలు ఎక్కువ. ఏడో తరగతి నుంచే పెళ్లి సంబంధాలు వస్తుండేవి. పెళ్లి చేసుకోనని గొడవపడ్డాను. అయినా.. పదో తరగతి అయిపోగానే పెళ్లి చేశారు. నాకు చదువంటే ఇష్టం. మా ఆడపడుచు పిల్లలు చదువుకుంటున్నారు. నేనూ చదువుకుంటానంటే.. మా వారు ‘అంతగా చదవాలని ఉందా. బయటికి పంపించడం కుదరదు. ఎగ్జామ్ ఫీజు కడతాను. ప్రైవేట్‌గా చదువుతావా?’ అన్నారు. అదే పదివేలు అనుకున్నాను. మా అత్తగారికి నేను చదువుకోవడం ఇష్టం లేదు. ‘ఉద్యోగం చేస్తావా? ఊళ్లేలతావా?’ అనేది. మా అత్తగారిది పెద్ద ఫ్యామిలీ. వచ్చే పోయే వాళ్లతో ఇల్లు సందడిగా ఉండేది. వంట పని, ఇంటి పని రోజంతా ఉండేది. చదవడానికి సమయం ఉండేది కాదు. అర్ధరాత్రి, తెల్లవారుజాముల్లో చదువుకునేదాన్ని. అలా ఇంటర్మీడియెట్ పాసయ్యాను. టీటీసీ ప్రవేశ పరీక్ష రాయాలనుకున్నాను. స్టడీ మెటీరియల్ లేదు. కోచింగ్‌కి పోయే అవకాశం లేదు. ఆ రోజుల్లో సరుకులను న్యూస్ పేపర్లతో పొట్లం కట్టేవాళ్లు. ఆ పేపర్లన్నీ మా అత్తగారికి తెలియకుండా పరుపుకింద దాచుకునేదాన్ని. అర్ధరాత్రి వాటిని తిరగేసేదాన్ని. వాటితో ఆరు వేల బిట్లు తయారు చేసుకున్నాను. ఎంట్రన్స్ రాశాను. పద్దెనిమిదేండ్లకే ఇద్దరు పిల్లలు. మా ఆయన హెల్త్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తున్నారు. టీటీసీ చదవడానికి మా ఆయన ఒప్పుకొన్నారు. కానీ, మా అత్తగారు ఒప్పుకోలేదు. నీ పిల్లల్ని చూడను అన్నది. అప్పుడు మా అమ్మ దగ్గర పిల్లల్ని వదిలేసి వచ్చాను. టీటీసీ అయిపోయింది. పాతికేండ్లకే టీచర్ అయ్యాను.
ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయోగాలు చేశాను. టీచర్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేసుకున్నాను. చీరలు కొంటే వచ్చే అట్ట బాక్సులపై అక్షరాలు, పదాలు రాసి నేర్పించాను. థర్మాకోల్ షీట్లు, కొబ్బరి పీచుతో జంతువుల బొమ్మలు చేశాను. పాఠాలు తేలికగా అర్థమయ్యేలా గేయాలు రాశాను. పాఠ్యాంశాలు బోధించేందుకు మాడ్యూల్స్ తయారు చేశాను. సైన్స్, మ్యాథ్స్, తెలుగు బోధించడం కోసం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) తయారు చేశాను. టీఎల్ఎం మెటీరియల్ తయారీలో మండల స్థాయిలో పోటీ పెట్టిన ప్రతిసారీ పైజ్ వచ్చింది. జిల్లా స్థాయిలోనూ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. విద్యాశాఖలో సాదినేని సత్యనారాయణ సార్ నన్ను గుర్తించి ‘నీలా ప్రయోగాలు చేసేవాళ్లే రిసోర్స్ పర్సన్‌గా ఉండాలి’ అన్నారు. రిసోర్స్ పర్సన్‌గా ఎంపిక చేసి రాజస్థాన్ పంపించారు. అక్కడ పిల్లలకు గణితం బోధించేందుకు నూతన పద్ధతుల్ని నేర్చుకుని వచ్చాను. టీచర్లకూ ఆ మెలకువలు చెప్పాను. క్రమంగా జిల్లా రిసోర్స్ పర్సన్ నుంచి స్టేట్ రిసోర్స్ పర్సన్‌గా ఎదిగాను. ఉద్యోగం చేస్తూనే దూరవిద్య ద్వారా ఎంఏ తెలుగు, పొలిటికల్ సైన్స్ చదివాను. తెలుగు పాఠ్యపుస్తకాల గేయాల్లో నేను రాసినవి ఉన్నాయి. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు నా గేయాలున్నాయి.
చిన్నప్పుడు మా ఇంట్లో రేడియో ఉండేది. బాలానందం, బాలవినోదం వినేదాన్ని. ఆ కథలు, ముచ్చట్లన్నీ పిల్లలే రాశారేమో అనుకుని, నేనూ రాయాలని ప్రయత్నం చేశాను. చిన్నప్పుడు అమ్మానాన్నల దగ్గర పెరగలేదని బాధపడేదాన్ని. ఆ బాధని నోట్‌బుక్‌లో డైరీలా రాసుకునేది. నాతో ఎవరూ లేరని, ఈ రోజు కోపంగా ఉన్నానని… ఇలా రాసుకుంటుండేదాన్ని. చిన్నప్పుడు చదివిన కథల మీద అభిప్రాయాలు కూడా రాసుకునేదాన్ని. అలా రాయడం మొదలుపెట్టాను. కానీ, ఎవరికీ పంపలేదు. టీచర్ అయ్యాక కూడా కవిత్వం రాయడం కొనసాగిస్తూనే ఉన్నాను. ఓ రోజు ఉపాధ్యాయుల మీటింగ్‌లో పిల్లల కోసం నేను రాసిన గేయాలు పాడాను. సాహితీ స్రవంతి సభ్యులు ఆనందాచారి గారు విని అభినందించారు. నా కవితలు చూసి.. ‘బాగా రాస్తున్నావమ్మా’ అన్నారు. కవి సమ్మేళనాలకు పిలిచారు. అప్పటి నుంచి కవి సమ్మేళనాలకు వెళ్తూ ఉన్నాను. కవి రౌతు రవి గారు మరిన్ని మంచి కవితలు రాసేలా సలహాలిచ్చేవారు. కొత్త పరిచయాలు, ఎంతోమంది ప్రోత్సాహంతో రాయడం ఆపలేదిక. చూసిన ప్రతిదానికీ స్పందిస్తాను. అనుభవాలనే రాశాను. రైతుల వ్యథలు, స్త్రీలపై దాడులు, ఆడపిల్లలపై వివక్షలాంటి వాటి గురించి ఎక్కువగా రాశాను. ఆ రోజుల్లో వర్షాలు ఉండేవి కావు. దళారీల మోసాలు, ఆత్మహత్యలు, అప్పులు ఉండేవి. రైతుకు ఆనందం, ఆత్మగౌరవం ఉండాలని, రైతే రాజు కావాలని కవిత్వం రాశాను. ‘వరిమళ్ల వసంతం’ పేరుతో ఆ కవిత్వం వచ్చింది. దాని ద్వారా నాకు ఒక కవయిత్రిగా గుర్తింపు వచ్చింది. గేయాలు, కవితలు, కథలు… ఇలా మొత్తంగా ఎనిమిది పుస్తకాలు రాశాను.
పిల్లలంటే ఇష్టం. వాళ్ల భవిష్యత్ కోసం పనిచేయడం అంటే ఇష్టం. వాళ్లతో గడపడం ఇష్టం. తను వెలుగుతూ విద్యార్థుల్ని వెలిగించడమే బోధన. పాఠ్యపుస్తకంలోని జ్ఞానమే కాదు మనకున్న ప్రతిభనూ పిల్లలకు అందించాలనే ఇష్టంతో పనిచేశాను. కైకొండాయిగూడెం, న్యూలక్ష్మీ పురం, చిరునోముల, ఆళ్లపాడు, కలకోట, నాగుపల్లి పాఠశాలల్లో పని చేశాను. పిల్లలకు గేయాలు, కవితలు, కథలు, వ్యాసాలు రాయడం నేర్పించాను. శిక్షణ శిబిరాలకు సొంత డబ్బులతో తీసుకుపోయాను. వాళ్ల కవితలు, గేయాలు, కథలు, వ్యాసాలతో ఇప్పటి వరకు పదిహేడు పుస్తకాలు ప్రచురించాను. నన్ను బదిలీ చేస్తే.. ‘సునంద టీచర్ మాకు కావాలి’ అని ఊరి జనమంతా కలెక్టరేట్‌కి పోయారు. టీచర్ బదిలీ ఆపాలని ట్రాక్టర్లతో ప్రజలు తరలిరావడం చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. బదిలీ అయ్యాక పాత పాఠశాల పిల్లలు కొత్త పాఠశాలకు నడుచుకుంటూ వచ్చారు. వాళ్లకి సర్దిచెప్పి పంపించాల్సి వచ్చింది. బోధనలో ప్రతిభ, పిల్లల పట్ల ప్రేమకు గుర్తింపుగా ఖమ్మం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా, కొత్తగూడెం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డులు అందుకున్నాను. విద్యలో, సాహిత్యంలో పిల్లలను ప్రోత్సహిస్తున్నందుకు ఈ మధ్యే తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారం 2024 ప్రదానం చేశారు. నేను పిల్లల్ని ఎంతగా ప్రేమించానో, వాళ్లు నన్ను అంతగా ప్రేమించారు. ఈ పురస్కారాలన్నీ అందుకు నిదర్శనాలు. బోధన, అధ్యయనం, రచనే జీవితంగా సాగిన నా ప్రయాణం ఆడపిల్లల చదువుకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను.
తెలుగు పదాల్లో దగ్గర సంబంధం కలిగి ఉండి, అక్షర భేదంతో అర్థంలో సహస్ర భేదం ఉండే పదాల గురించి రాస్తున్నప్పుడు.. డిక్షనరీలు తిరగేశాను. సంస్కృత న్యాయాలకు తెలుగుతో సంబంధం గుర్తించాను. అవి మన సామెతలు, జాతీయాలకు దగ్గరగా ఉన్నాయి. అక్షర భేదం ఉన్న పదాలకు అర్థాలను వివరిస్తూ సునంద భాషితం రాసిన తర్వాత, సంస్కృత న్యాయాలకు వ్యాఖ్యానం (సునంద భాష్యం) రాశాను. వాటిని శాంతా బయోటెక్నిక్స్ వరప్రసాద్ రెడ్డి గారు గుర్తించారు. వారే పుస్తకంగా ప్రచురిస్తామని అడిగారు. సంతోషంగా ఒప్పుకొన్నాను. ఇప్పుడు తెలంగాణ సామెతలు రాస్తున్నాను.
– నాగవర్ధన్ రాయల
– గడసంతల శ్రీనివాస్