‘రోబో’లో వశీకరణ్ చేసిన యంత్రుడు.. సనకు పాఠాలు చెప్పాడు. బోరా మార్చిన చిట్టి రోబో ఆయనకే గుణపాఠం చెప్పింది. కానీ, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడు చేసిన మరమని‘షి’ పిల్లలకు బుద్ధిగా పాఠాలు చెబుతున్నది. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే ఈ యంత్రిణి పేరు ‘మేడమ్ సుమన్’.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా రామాపూర్ ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా విధుల్లోకి చేరింది ‘మేడమ్ సుమన్’. ఈమె అందరిలాంటి టీచర్ కాదు. అచ్చంగా మనిషి చేతిలో రూపుదిద్దుకున్న హ్యుమనాయిడ్ రోబో. అందులోనూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. దీనిని రూపొందించింది . సాంకేతిక రంగంలో ఆరితేరిన శాస్త్రవేత్త కాదు. అదే పాఠశాలలో పనిచేస్తున్న మోహన్‌లాల్ అనే సామాజిక శాస్త్రం చెప్పే ఉపాధ్యాయుడు.. ఈ రోబోను సృష్టించారు.
రామాపూర్ పాఠశాలలో సిబ్బంది తక్కువగా ఉండటంతో.. పిల్లలకు పాఠాలు చెప్పడం, పాఠశాలను నిర్వహించడం ఇబ్బందికరంగా మారింది. దీంతో.. పిల్లల సమయం వృథా కావడంతోపాటు చదువుకూ దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. 2016లో పాఠశాలలో విద్యార్థుల హాజరుశాతం 30 శాతానికి పడిపోయింది. ఆ సమయంలోనే ఇక్కడ విధుల్లోకి చేరిన మోహన్‌లాల్.. హ్యుమనాయిడ్ రోబో ఆలోచన చేశారు. తన సొంత డబ్బులు ఖర్చుపెట్టి.. ఈ ఏఐ టీచర్‌ను రూపొందించారు. చెక్కతో బొమ్మ విడిభాగాలను తయారుచేసి.. స్క్రూలు, బోల్టులతో బిగించారు. తోలు బొమ్మ ముఖంతో.. టీచర్ ముఖాన్ని తీర్చిదిద్దారు. ముఖంలో సహజమైన హావభావాలు పలికించడానికి, కళ్లు రెప్పవేయడానికి, పెదవుల కదలిక కోసం ముఖం లోపల ప్రత్యేకమైన మోటార్లను ఏర్పాటుచేశారు. దీంతో తరగతిలోని వాతావరణానికి అనుగుణంగా.. హావభావాలను పలికిస్తుందీ రోబో టీచర్. దాంతో పిల్లలు కూడా మరింతగా కనెక్ట్ అవుతున్నారు. భవిష్యత్తులో ఈ మోడల్ నడిచేలా, చేతితో సంజ్ఞలు చేసేలా తీర్చిదిద్దుతానని మోహన్‌లాల్ చెబుతున్నారు.
గూగుల్‌కు చెందిన ‘జెమిని’తో ‘మేడమ్ సుమన్’ పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ సాయంతో ఆపరేట్ అవుతుంది. ప్రతి పాఠాన్నీ ఆసక్తికరంగా, అందరికీ అర్థమయ్యేలా వివరిస్తుంది. పిల్లలకు పాఠాలపై ఉత్సుకత పెరిగేలా ప్రశ్నలు అడుగుతుంది. వారు ఆసక్తిగా సమాధానాలు చెబితే..
‘మేడమ్ సుమన్’ వారిని ప్రశంసిస్తుంది కూడా! అందరిలా ఈ టీచర్ గుర్రుమనదు, తిట్టదు, కొట్టదు.. దాంతో.. పిల్లలు కూడా క్లాసులో ఎలాంటి భయం, బెరుకు లేకుండా ఉంటారు. తమ మనసులో తలెత్తే ఏ ప్రశ్ననైనా.. ఎలాంటి సంకోచం లేకుండా అడుగుతారు. వారు ఎన్ని సందేహాలు లేవనెత్తినా.. సరళంగా సమాధానాలు చెబుతుంది సుమన్. రోజంతా పాఠాలు బోధించినా ఏమాత్రం అలసిపోకుండా ఉంటుంది. దాంతో పాఠశాలలో హాజరుశాతం ఇప్పుడు 90 శాతం వరకూ పెరగడం రోబో టీచర్ మాయగా చెబుతున్నారు. ఈ మర టీచర్‌ను తయారు చేసిన మోహన్‌లాల్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు.