పచ్చదనం కోరుకునే పట్నవాసులకు కారిడారే పూదోట, బాల్కనీయే బృందావనం. మొక్కలపై మక్కువ ఎక్కువ ఉన్నవాళ్లు ఇండోర్ ప్లాంట్స్ విరివిగా పెంచేస్తుంటారు. స్థలం ఉంది కదా అని మొక్కలు నాటేస్తారు.. కానీ, వాటి నిర్వహణలో మాత్రం ఆపసోపాలు పడుతుంటారు. సాధారణంగా వానకాలం మొక్కలు ఏపుగా పెరుగుతాయి. కానీ, ఇండోర్ ప్లాంట్స్‌కు మాత్రం ఈ కాలం ప్రమాదకరం. ఇంటిని నందనవనంగా మార్చుకున్న వాళ్లు రెయినీ సీజన్లో ఈ తప్పులు దొర్లకుండా జాగ్రత్తపడండి..
సహజంగా ఇండోర్ ప్లాంట్స్‌కు నీటి అవసరం తక్కువగా ఉంటుంది. వేసవిలో అంటే పనిగట్టుకొని ఒకటికి రెండుసార్లు నీళ్లు పోసినా ఫర్వాలేదు. కానీ, వానకాలం కూడా అలాగే పోస్తామంటే కుదరదు. నీరు ఎక్కువగా పోయడం వల్ల మొక్కలకు తెగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. చల్లటి వాతావరణంలో నీరు ఇంకిపోవడానికి చాలా సమయం పడుతుంది. దీంతో తరచూ నీళ్లు పోస్తే.. వేళ్లు కుళ్లిపోయి మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది.
ఇండోర్ ప్లాంట్స్ ఆరోగ్యంగా ఉండాలంటే సూర్యరశ్మి చాలా అవసరం. వానకాలం మబ్బుపట్టిన వేళ.. ఇంట్లోకి వెలుతురు సరిగా రాకపోవచ్చు. మొక్కల కుండీలను కిటికీల దగ్గర ఉంచితే ఈ సమస్య చాలావరకు పరిష్కారం అవుతుంది. ఎండ వచ్చే అవకాశమే లేదంటారా.. అప్పుడు గ్రో లైట్లను అమర్చడం మంచిది.
ఇండోర్ ప్లాంట్స్‌ను శుభ్రంగా ఉంచడం ఎంతో ముఖ్యం. ఆకులపై దుమ్ము పేరుకుపోతే వాటిపై ఉండే రంధ్రాలు మూసుకుపోయే అవకాశం ఉంటుంది. వడలిపోయిన లేదా కుళ్లిన ఆకులను మొక్క నుంచి తుంచేయాలి. ఆకులపై ఉండే దుమ్మును శుభ్రం చేయడం వల్ల కిరణజన్య సంయోగక్రియ సక్రమంగా జరిగి మొక్క పెరుగుదల బాగుంటుంది.