భారతీయ సంస్కృతి అతి విశిష్టమైనది. మన చుట్టూ ఉండే ప్రకృతి, మనం నివసించే భూమి,మూలమైన సూర్యుడు అన్నిటినీ వేర్వేరు సమయాల్లో ఆరాధించే క్రమంలో ధర్మశాస్ర్తాన్నిరూపొందించుకున్న వైజ్ఞానిక సంస్కృతి భారతీయమైనది. ప్రతీ విషయాన్ని ప్రతీకలుగా చెప్పడంలో భారతీయ పురాణాదులకు సాటిలేదు. అర్థం కానంతవరకు అవి పుక్కిటి పురాణాలే. అర్థమైతే అద్భుతమైన వైజ్ఞానిక మార్గం.
హైం దవ ఆధ్యాత్మిక విధానంలో కనిపించే ప్రతి దైవ ప్రతిమ ఒక వైజ్ఞానిక భావానికి, ఖగోళానికి, భూగోళానికి, ప్రకృతికి ప్రతీకలుగానే ఉంటాయి. చూసే దృష్టి ఉంటే అంతా విశ్వమయమే. అతి పెద్ద శక్తులకు ఒక రూపాన్ని ఇచ్చి, ఆ రూపారాధన ద్వారా మూలశక్తిని ఆరాధించే గొప్ప వైజ్ఞానిక సంప్రదాయం భారతీయులదే. ఆ రూపాన్ని, ధ్యాన శ్లోకాన్ని, మంత్రాన్ని, అక్షరాలను జాగ్రత్తగా గమనిస్తే ఎన్నో ప్రత్యేక విషయాలు మనకు కనిపిస్తాయి.
మన సంస్కృతిలో అత్యంత ప్రముఖ స్థానం పొందిన యంత్రం శ్రీచక్రం. మొత్తం భారతీయ ఆధ్యాత్మిక వ్యవస్థకు శ్రీచక్రం ఆలంబన. ఆది శంకరాచార్యులు కూడా తిరుపతి, ఇంద్రకీలాద్రి మొదలైన క్షేత్రాల్లో శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని చరిత్ర చెబుతున్నది. ఇప్పటికీ అనేక దుకాణాల్లో శ్రీచక్రాన్ని (చిన్నపాటి రాగిరేకు మీద చెక్కించినది), శ్రీచక్రం ఫొటోను పెట్టుకుని పూజ చేస్తుంటారు. శ్రీచక్రం అనే పేరు చెప్పగానే ‘చాలా పవర్ఫుల్’ అనే మాట ఇప్పటితరం కూడా అంటుంది. ఇంతటి సమున్నతమైన శక్తి కలిగిన శ్రీచక్రం గురించి నిశితంగా పరిశీలిస్తే భారతీయుల అనితరసాధ్యమైన వైజ్ఞానిక వైభవం సాక్షాత్కరిస్తుంది.
శ్రీచక్రం ఓ అద్భుతమైన గణిత నిర్మాణం. త్రిభుజాలు, వృత్తాలు, చతుర్భుజాలు, వలయాలు ఇందులో కనిపిస్తాయి. వీటన్నిటినీ ఒకదాని మీద మరొకటి అమర్చినట్లు ‘త్రిమితీయ’ (త్రీ డైమెన్షన్) రూపం కనిపిస్తుంది. దీన్నే మేరుప్రస్తార శ్రీచక్రం అంటారు. ఈ ఆకారం యంత్రాల మీద చెక్కిన రూపంలోనూ కనిపిస్తుంది. దీన్ని భూప్రస్తార శ్రీచక్రం అంటారు. ఇలా ద్విమితీయ, త్రిమితీయ అనే రెండు రూపాల్లో ఉన్న ఒకే ఒక్క నిర్మాణమిది. ప్రపంచంలో ఈరోజు వరకు మరెక్కడా ఇటువంటి నిర్మాణం లేదు. ఏ దేశంలోనూ, ఏ శాస్త్రవేత్తా ఇటువంటి నిర్మాణాన్ని చేయలేకపోయారు. దీన్నిబట్టి చూస్తే ఎన్నో యుగాల క్రితమే సనాతన భారతీయ హైందవ వైజ్ఞానికత ఎంత పరమోన్నత స్థాయిలో ఉన్నదో అర్థం అవుతుంది.
శ్రీచక్రం విశ్వానికి ప్రతిరూపం, బిందువు, వృత్తం, త్రిభుజి, చతుర్భుజి అనేవి లేకుండా ఏ యంత్రమూ ఉండదు. బిందువు విశ్వానికి మూలం. బిందువు కూడా వ్యాసార్థం లేని వృత్తమే! కాబట్టి బిందువూ, వృత్తమూ ఒకటే. బిందువును విస్తరింపజేస్తే వృత్తం అవుతుంది. దానిని అనంతంగా విస్తరిస్తూ పోతే విశ్వంగా (యూనివర్స్) మారుతుంది. విశ్వాన్ని ఒక అనంతముఖాలు ఉన్న బహుభుజి (infinite sided polygon) అనుకుంటే, దానిని తగ్గిసూ వెళ్తే మనకు మిగిలేది ఒక త్రిభుజమే. ఎందుకంటే అతి తక్కువ రేఖలతో ఏర్పడే జ్యామితీయ ఆకారం త్రిభుజం మాత్రమే. కాబట్టి, బిందువు, త్రిభుజం, వృత్తం, చతుర్భుజం వరుసలో శ్రీచక్రం ఉంటుంది.
బిందువు, త్రికోణం, చతుర్భుజం… ఈ మూడూ లేకుండా ఏ యంత్రమూ ఉండదు. ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే ‘ఇచ్ఛ’ (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి! తరువాత ఆ పని ఎలా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ, ఆలోచనా జ్ఞానం రెండూ కలిగిన తరువాత చేసే కార్యాచరణే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృజించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు. ఇలా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను ఇచ్చేదే శ్రీచక్రం. త్రికోణంలోని మహాశక్తి రహస్యం ఇది.
చరాచర సృష్టి మొత్తం మూడు శక్తుల కలయిక. ఈ మూడు శక్తులను సూచించేదే పరాదేవత అయిన అమ్మ. నేటి శాస్త్రజ్ఞులు కూడా ఏ పదార్థమైనా సరే, శక్తి రూపాంతరమేనని చెబుతున్నారు. నేడు మనం చూస్తున్న విజ్ఞాన శాస్త్రం ద్వారా కనిపెట్టిన వస్తుజాలం అంతా ఈ క్రియాశక్తి రూపాంతరమే. ఇంకా ఎన్నో గణితశాస్త్ర విషయాలు, విశ్లేషణలు శ్రీచక్రం గురించి ఉన్నాయి. విదేశాల్లో ఇప్పటికీ శ్రీచక్రం గురించి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. హైందవ సంస్కృతిలోని ఈ అపురూప నిర్మాణంలోని వైజ్ఞానికతకు అబ్బురపడుతున్నారు.
-శ్రీ భారతి