సైన్యంలో కొలువు దక్కడమే ఎంతో కష్టం.ఇక సరిహద్దుల్లో విధులు నిర్వర్తించడం ఇంకా కష్టం. సంక్షోభ సమయాల్లో శాంతి కోసం యుద్ధం చేయడం అన్నిటికన్నా కష్టం. ఏ కష్టాన్నయినా గుండెధైర్యంతో గెలిచి నిలిచింది లెఫ్టినెంట్ కల్నల్ మితాలి మధుమిత.భారత సైన్యంలో శౌర్య పతకం గెలిచిన ఒకే ఒక్క ధీరగా ఆమె ఖ్యాతి గడించింది!
నగరం ప్రశాంతంగా ఉంది. అప్పుడే మేల్కొంటున్న కాబూల్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెల్లవారుజామున చెవులు చిల్లులుపడే శబ్దం. తేరుకుని.. ఏం జరిగిందో తెలుసుకునే లోపే జరగరాని నష్టం జరిగిపోయింది. హమీద్ గెస్ట్ హౌస్ ఎదురుగా ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న భారతీయులు, మరికొంతమంది విదేశీయులే లక్ష్యంగా మిలిటెంట్లు దాడి చేశారు. ఆ శబ్దానికి ఉలిక్కిపడింది మేజర్ మితాలి మధుమిత. ఆందోళనతో అక్కడ ఏం జరిగింది? ఎవరికి ఎలా ఉందో తెలుసుకుందామని ఆమె ప్రయత్నించింది. కానీ, కమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయక ఆ ప్రయత్నం సఫలం కాలేదు.
బాంబు పేలుడు ఘటన జరిగిన చోటుకు వెళ్లడానికి అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేవు. వీధుల్లో వాహనాల సంచారం లేదు. సమయం వృథా చేయకుండా ఆమె పరుగు పరుగున ఘటనా స్థలానికి చేరుకుంది. పేలుడు జరిగిన ప్రదేశంలో తన సహచరులు గాయపడి ఉన్నారు. తూటాలు గాలిలో దూసుకొస్తున్నాయి. గ్రెనేడ్లు పేలుతున్నాయి. వెంటనే తన విధులను మర్చిపోకుండా మితాలి సాధారణ ప్రజలను, సహచరులను కాపాడే బాధ్యత తీసుకుంది. గాయపడ్డ వాళ్లందరినీ సురక్షిత ప్రదేశానికి చేర్చి, వైద్యసేవలు అందించింది. ప్రాణానికి తెగించి ఆమె చేసిన సాహసం వల్ల పందొమ్మిది మంది బతికి బయటపడ్డారు. వారిలో ఏడుగురు భారతీయులు.
కాబూల్ బాంబు దాడుల వార్త ప్రపంచమంతా తెలిసిపోయింది. ఆ దాడిలో సహచరుల ప్రాణాలు కాపాడటం కోసం మేజర్ మితాలి మధుమిత పోరాటపటిమను ప్రపంచం గుర్తించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఐక్యరాజ్య సమితి పంపిన శాంతి దళంలో పని చేసేందుకు మితాలి నియమితురాలైంది. ఆనాటి పోరాటం మితాలికే కాదు భారత ఆర్మీకీ ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా వేనోళ్లా పొగడ్తలు అందుకున్న మితాలికి భారత ప్రభుత్వం ఉన్నతమైన శౌర్య పతకం ప్రదానం చేసింది. సాహస వీరులైన సైనికులకు ఇచ్చే ఈ పురస్కారం పొందిన తొలి మహిళగా మితాలి చరిత్రకెక్కింది. అంతేకాదు ఇప్పటికీ శౌర్య పతకం సాధించిన ఒకే ఒక మహిళ మితాలి మధుమిత ఒక్కరే కావడం విశేషం.
విధుల్లో వీరత్వం ప్రదర్శించిన మితాలి మేజర్ పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చింది. తన సర్వీస్‌ని కొనసాగించాలని ఆమె మిలటరీ అధికారులకు విన్నవించుకుంది. కానీ, ఉన్నతాధికారులు ఆ విజ్ఞప్తిని తిరస్కరించారు. తనను షార్ట్ సర్వీస్ కమిషన్ ఎంపిక చేసింది. నిబంధనల ప్రకారం షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన వాళ్లు సైన్యంలో అయిదేళ్ల నుంచి పదిహేనేళ్ల పాటే పనిచేయాలి. అందువల్ల ఆమెను పర్మినెంట్ కమిషన్‌లోకి తీసుకోవడం సాధ్యం కాదని ఆర్మీ తెలిపింది. తన అభ్యర్థన తిరస్కారాన్ని సవాల్ చేస్తూ మితాలి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు నుంచి అనుకూలమైన తీర్పు రాగానే ఆమె లెఫ్టినెంట్ కల్నల్‌గా పదోన్నతి పొందింది. దేశం కోసం సేవ చేయడం కంటే సంతోషం, గౌరవం మరొకటి లేదంటున్న మితాలి ఎందరో సైనికులకు స్ఫూర్తి.
ఒడిశాకు చెందిన మితాలి మధుమిత విద్యావంతుల కుటుంబంలో పుట్టి పెరిగింది. వాళ్లమ్మ అధ్యాపకురాలు. తాను కూడా పెద్దయ్యాక అధ్యాపకురాలు కావాలని కలలు కనేది. కానీ, అనుకోకుండా ఆమె భారత సైన్యంలో చేరింది.